28, మే 2009, గురువారం

పూజగది

ఇది నా గుండెగది

వేదమంత్రాలతో, ఘంటానినాదాలతో

ప్రతిధ్వనించే నిత్యపూజల గర్భగుడి.


దిక్కులు తెల్లారక ముందే

ఈ గదిని కడిగిన ముత్యాన్ని చేసి

ధ్యాన ఆవాహనలతో దేవుళ్ళనాహ్వానించేవాణ్ణి

ఆశల పీథంపై ఆసనమేర్పరచి

అర్ఘ్యపాద్య ఆచమనాలుగా స్రవించేవాడ్ని

మూర్తీభవించిన సాలగ్రామాల శిరస్సుపై

ఎన్నిసార్లు కన్నీటి అభిషేకమయ్యానో

నా వొంటికి గుడ్డపేలిక కరువైనా

ఈ దేవతా మూర్తుల మానాల మీద

పట్టు పోగుల వస్త్రాలు కప్పేవాడ్ని

నా చిరిగిన పంచెను కుట్టుకోడానికి

దారం కరువైన దరిద్రంలో కూడా

వీళ్ళ భుజాలకు యజ్ఞోపవీతాలు తగిలించేవాణ్ణి

మేపూత సువాసనల కోసం

నా జీవితాన్ని గంధం చెక్కలా అరగదీసే వాడ్ని.


సూదికొన బొటనవేలికి కసిని గుచ్చుతున్నా

రంగు రంగు పూలను గుదిగుచ్చి

వీళ్ళ మెడలో ఇంద్రధనుస్సుల్ని మెరిపించాను

అయినా వాళ్ళ నిష్ఠూరాలను, వ్యంగ్యోక్తుల వెటకారాలను పక్కకునెట్టి

తీరని కష్టాల మధ్య అష్టోత్తరాలు చేశాను

ఈ సుర సమూహ ధూప సుగంధం కోసం

నా బతుకును అగరబత్తిగా వెలిగించి పెట్టాను

తాకట్టుగా మారిన స్థిరాస్తుల్ని

వీళ్ళ నీటికి నైవేద్యాలుగా, తంబూలాలుగా అందించి

హరించుకుపోయిన కర్పూర హారతినయ్యాను

అరుణారుణ మృదు చరణాల ముందు

స్వరం తప్పని మత్రపుష్పాన్నై మోకరిల్లాను

గానుగెద్దులా ప్రదిక్షిణాలు చేసి

దక్షిణగా హృదయాన్ని హుండీలో వేసినా

ఏ దాక్షిణ్యమూ దారి చూపే చుక్కాని కాలేక పోయింది

లక్షల అక్షింతలు పాదాలపై చల్లినా

ఏ కటాక్షమూ నా క్షుదార్తిని తీర్చే అక్షయ పాత్ర కాలేకపోయింది

పునఃపూజల ఉపచారాలు

గ్రహచారాన్ని మార్చలేని ఉపవాస చర్యలయ్యాయి

శిరస్సుపై చల్లుకున్న శంకు తీర్ధం

ఎన్ని పాపాల్ని ప్రక్షాళించిందో తెలీదుకాని

నా నెత్తిమీద దరిద్రాన్ని మాత్రం తొలగించలేక పోయింది


వెతలు తీర్చే వేల్పులు కొదవైనందుకు

ఈ పూజగది ఈశాన్యం అంచున

నేనోకన్నీటి చుక్కనై వేలాడుతున్నాను

దశాబ్దాలుగా మారని జీవన శైధిల్యాన్ని చూస్తూ

సహనాన్ని పరీక్షిస్తున్న ముక్కోటి దేవుళ్ళలో

ఏ ఒక్కడైనా వచ్చి

ఈ కాలుతున్న వొత్తిని కాపాడుకుంటాడా?


దేవుడా! దేవుడా!!

ఆజ్ఞాపించడం కాదు గానీ..!

నేను పోయాక మాత్రం దయచేసి నువ్వు రాకు.

Read more...

25, మే 2009, సోమవారం

నులక మంచం

ఎంత మంచిదీ నులక మంచం

ఊహ తెలిసిన్దగ్గర్నుంచీ

దీనితో ఎంత అనుబంధమేర్పడిందీ..!

ఈ మెత్తటి నులక మీద పడుకుంటే

అమ్మ గుండెలమీద పడుకున్న అనుభూతి నిచ్చింది

ప్రతి రాత్రి

తాను కొత్త పెళ్ళికూతుర్లా సిగ్గుపడుతూ

నా రాకకోసం ఎంతగా ఎదురుచూసేదనీ..!

అమ్మ కొట్టినప్పుడో, నాన్న కోప్పడినప్పుడో

అలిగి ముడుచుకు పడుకున్నప్పుడు

నన్ను గోముగా సముదాయించిందీ మంచమే

నా వీపును తన గుండెలకు హత్తుకుని

ప్రేమగా పెట్టుకున్న ముద్దులన్నీ

తెల్లారాక వీపుమీద ముద్రలై కనిపించేవి

నా పెళ్ళి రాత్రి

పూల చెండాటలో పాన్పై తెగ మురిసిపోయింది

నేనూ, నా సహచరీ సరసాలాడుకుంటూ

దాంపత్య సుఖంలో తేలాడుతున్నప్పుడు

కిర్రు కిర్రు మంత్రాల ఆశీస్సులిచ్చి

నాకు పండంటి వారసుడ్నందించిందీ నులక మంచమే.

శిధిలమౌతున్న నా శరీరంతోపాటు

ఇప్పుడీ నులకమంచమూ కుక్కిదైపోయింది

చిన్నప్పుడు దోగాడుకుంటూ వీధిలోకెళ్తానేమోని

నానమ్మ నులకమంచానికి నన్ను కట్టేసేది

తరుముకొచ్చిన వృద్ధాప్యంలో

ఎవరూ కట్టేయకుండానే ఈ మంచంలో బందీనయ్యాను

ముసలికంపు కొడుతున్న ఈ దేహాన్ని

అయినవాళ్ళంతా ఈ సడించుకుంటుంటే

ఈ నులక మంచం మాత్రం

ఇప్పటికీ అదే ప్రేమతో నన్ను గుండెలకు హత్తుకుంటూనే ఉంది

నా ఊపిరాగే లోపు

ఏమిచ్చినా దీని ఋణం తీరేట్టులేదు

ఈ మంచానికి కాళ్ళకట్టగా మారితే తప్ప.

Read more...

21, మే 2009, గురువారం

చెరిగిపోతున్న బాల్యం

యవ్వనం


విశృంఖలంగా పడగెత్తితే


జివితానికి కాటు తగుల్తుంది


ఇప్పుడు


బాల్యం చూపుల్లో


శృంగారం కాపురముంటోంది


గోడమీది వాల్‌పోస్టర్


ఇంటి పర్యావరణాన్ని మారుస్తోంది


సమాజ సంసారిక జీవనంలో


డైవోర్స్‌ల అడ్రసులే ఎక్కువ.


అనుమానపు పొరల్లోంచి


జీవితాలు తెగిపోతున్నాయి


ఒత్తు తేడా పడితే


జీవితం తిరగబడుతుంది


బతుకంటే


కొమ్మలా వూగడం కాదు


చెట్టులా నిలబడటం


నూరేళ్ళ జీవితాన్ని


వెలిగించుకోవడం కోసం


బాల్యాన్ని కొవ్వొత్తిని చేయకండి!


పండు వెన్నెల ముఖమ్మీద


నీలి చిత్రాల్ని ముద్రించకండి!


లేత గుండెల్లో నిప్పు రగిలించి


మొగ్గలోనే వాటి భవిష్యత్తును తుంచేయకండి !




***

Read more...

18, మే 2009, సోమవారం

జోల పాట

బతుకంత గాయం మిగిలాక

సముద్రం కన్రెప్పల మధ్య ప్రవాహమౌతుంది

రోజుల పట్టాలపై కాలం పరుగెడుతున్నా

ఇప్పటికీ నడిచిన దూరం తెలియటం లేదు

దుఃఖన్ని మోస్తున్న గుండె బరువెక్కుతోంది

గాయాల్ని తట్టిలేపే కన్నీటి ఉదయాలు

హృదయంలో దిగబడ్డ గాజుపెంకులవుతున్నాయి.

బహుముఖాలుగా విచ్చుకొనే కిరణాల వెలుగును

ఏ నల్లమబ్బో ఆ దాటున అడ్డుకుంటోంది

ఎడతెగని కల్లోల ఘడియల మధ్య

ఓ నల్లటి ముసుగేదో నా బతుకు చుట్టేస్తోంది

కనుచూపుమేర చీకటి చెట్లే విస్తరిస్తున్నాయి

మెదడు గదిలో మండుతున్న మేధస్సు

ఆశయాన్ని చేతికందించలేక తడబడుతోంది

నిచ్చెన కొసదాకా ఎక్కిన పాదాలను

నీలి నీడలేవో పట్టి కిందకిలాగేస్తున్నాయి

నేల మీంచి చూపును నింగికి సారించేలోపు

నల్లబూచి నిచ్చెనిక్కి కూర్చుంటోంది


కూలుతున్న నమ్మకాల మధ్య

వర్తమాన నిప్పుల మీద నడకై

అరికాళ్ళతోపాటు, ఆశల భవిస్యత్తునూ కాల్చేస్తోంది

రాజ్యాంగ సూత్రాలు ప్రతిభను తొక్కేసే ఉక్కుపాదాలయ్యాయి

మురుగుకాల్వలో మేధస్సును ఒలకబోసుకుంటున్న

ఈ నల్ల ప్రభువుల ముఖాన్ని ఛీకొట్టి

'మెరిట్'కు 'సెల్యూట్' చేసిన

తెల్లదొరలకు తలొంచి నమస్కరించాలన్పిస్తోంది


ఓరి బడానాయకుల్లారా!

కలలో తప్ప ఇలలోదేన్నీ చూడలేని గుడ్డికళ్ళకి

చూపును మెరిపించే నేత్రదాన శిబిరాలు ఏర్పర్చండి

నడకను స్వప్నించే కుంటితనానికి

కనీసం కృత్రిమకాళ్ళైనా అమర్చిపెట్టండి

ఆసరాలేని అవిటి బతుకులను పునరావాసాలు కల్పించండి

మూగచెవిటి నిరాశల్లో పింఛను దీపం వెలిగించి పెట్టండి

అంతేకాని

అన్ని అవయవాలు సమకూరిన సోమరితనానికి

మితిమీరిన రాయితీలు ప్రకటిస్తూ

మనుషుల మధ్య అసమానతను రేపుతున్న మిమ్మల్ని

మానసిక వికలాంగుల కేంద్రంలో బజ్జోపెట్టి

ఈ దేశ పౌరుడిగా

మీ శాశ్వత నిద్రకోసం సరికొత్త జోలపాట పాడాలనుంది

(19.01.2002, రాత్రి 08:35)

Read more...

14, మే 2009, గురువారం

స్తబ్ద చలనం

మబ్బులు పట్టిన ఆకాశం

సూర్యకాంతిని భూమ్మీదకు అనుమతించట్లేదు

ఎక్కడిదో నిలువెత్తు ఇసుక తుఫాను

అరేబియా గుర్రమై

జలపాతపు కొండల్లోకి ఎడారిని మోసుకెళ్తోంది

రాతి ఉదయాల నడుమ

ఎన్నేన్ని గాయపడ్డ అనుభవాలో.. యేమో

పూయడం వసంతాలు మానేశాయ్!


నిద్ర నటిస్తున్న సముద్రం

హఠాత్తుగా కెరటాల పిడికిళ్ళెత్తి

యుద్ధం ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు

గమ్యనికి గమనానికి ముడి తెగి

కౌజు పిట్టలు

వలస పక్షుల్ని అనుసరించడమే బహిరంగ రహస్యం

చీలిపోతున్న మనుషుల మధ్య

లోతు పెరుగుతున్న అగాధం భూగోళాన్ని భయపెట్టోచ్చు, ఐనా సరే

తెరలు తెరలుగా ముసి నవ్వులు నవ్వుకుంటూ

సజీవుడి తలదగ్గర దీపం పెట్టడమే ఇక్కడి ఆచారం

కన్రెప్పలకింది స్వచ్చమైన నది

కాళ్ళమీదికి జారిపడ్డాక

చైత్రానికి శిశిరానికి అట్టే తేడా ఉండదు

ప్రేమించే జీవ లక్షణం పట్టు తప్పాక

కదలికకీ నిశ్చలతకీ భేధం అంపించదు

ఇక

ఈ చలనానికి స్తబ్ధత లేదు, ఛస్తే తప్ప

ఈ స్తబ్ధతకు చలనం రాదు, మళ్ళీ పుడితే తప్ప

(ఆదివారం ఆంధ్రభూమి 02.06.1996)

Read more...

11, మే 2009, సోమవారం

ఒక ప్రవాసాన్ని గూర్చి

జీవితం వొఠ్ఠి ప్రవాసం మాత్రమే

మనం శ్రమను నమ్ముకోవడం నేరంకాదు

కాని రోజుల్లో శ్రమను అమ్ముకోవడం నేరంకాదు

నోటిదాకా వచ్చిన చేతిముద్ద కదలికపై

గుర్తు తెలియని నీడలు కర్ఫ్యూ విధించడం నేరం

ఏరు దాటించిన తెప్పనిస్వార్ధాన్ని

అసంధర్భంగా తగలెయ్యడం ద్రోహం


కాళ్ళు అరిగిన కాందిశీకుడా!

గానుగెద్దు దినచర్యను మోసుకెళ్తున్న

సుదీర్ఘ ప్రయాణం మనది

వెలుగు పిట్టవాలని అంధకార శబ్దంలో

అమావాస్యల్ని గుండెల్లో దాచుకొన్న

కన్నీళ్ళ మీద నడుస్తున్న ప్రవాసం మనది

కాలానికి గాయపరచటం పాత కాదు

గాయపడటం మనకు కొత్తా కాదు

విషాదాన్ని తొడుక్కుని వలసవెళ్ళడమే

నిరపేక్షిత అసంకల్పిత చర్య


ఎప్పుడోమౌతుందో తెలియని సందిగ్ధత మధ్య

నుదుళ్ళను నిషేధించిన ఉదయాల సాక్షిగా

కూలిన గోపురాల మీది పావురాళ్ళమయ్యాం

అణువణువూ చిట్లిన రేణువులతో

ఓదార్పుకు, నోచుకోని ఇసుక నదులమయ్యాం

ఇక-ఎవరి దుఃఖాన్ని వాళ్ళే ప్రకటించుకోవాలి

ఎవడి విషాదానికి వాడే ప్రతీకారం చెల్లించుకోవాలి

సంకెళ్ళు తెంచుకున్న స్వేచ్చా ప్రపంచాన్ని

అరచేతి రేఖల్లో పరిగెత్తనివ్వాలి

ఒక్కసారి

ఈ ఎడారంతా చైత్రమై ఊడలుదించితే బాగుండు

ఒక్కసారైనా

ఎవడి శ్రమనువాడే అనుభవించే

పర్వదినమొస్తే బావుండు


(ఆదివారం విశాలాంధ్ర 20.05.2000)

Read more...

7, మే 2009, గురువారం

కొత్త ప్రకటన

ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను

దీని రమ్యమైన అందాలతోపాటు - దీని మూర్ఖత్వాన్నీ

దీని సమానత్వ సిద్ధాంతాలతో పాటు - దీని చేతగానితనాన్నీ

అన్నిట్నీ కలిపి

ఈ దేశాన్ని నేను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను

ఇది

గోల్డుమెడళ్ళను మెరిట్ సర్టిఫికెట్లను పక్కకునెట్టి

కుల ధృవీకరణ పత్రాలకు ప్రాముఖ్యం ఇచ్చినా సరే

దీన్ని నేను ప్రేమిస్తూనే వున్నాను.

ఉద్యోగాల మీద కులాల పేర్లు చెక్కి

ఇది నా ప్రతిభను పాతాళానికి తొక్కివుండొచ్చుగాక

నా తొంభైశాతం మార్కులు పనికిరావని తేల్చి

క్వాలిఫై కొననందుకోలేని మోడు మెదళ్ళకు

నౌకరీలు పంచేందుకు ఉత్తర్వులు జారీ చేసి వుండచ్చుగాక

Still I love my country..

ఇది ప్రమాదపు వలను పసిగట్టలేని అంధకపోతం

రిజర్వేషన్ కాలపరిమితిని రెట్టింపు చేసుకుంటూ

నా జీవితాన్ని చింపిన విస్తరి చేసిన గ్రామసింహం

బతుకును వెలుగుగా మార్చుకోడానికి

ఫలానా కులంలోనే పుట్టాలని నిర్దేశించి

ఇది నాగొంతులో కపట ప్రేమను వడ్లగింజగా వేసింది

చదువులకీ, ఉద్యోగాలకీ నాపై నిషేదం విధించి

కడుపులో ఆరని చిచ్చురేపింది

శాంతి మంత్రోచ్చారకుడ్ని కదా!

నా బతుకును అవమానాల అగ్నిగుండం చేసినా

దీని సహనంతో తల్లిలా ప్రేమిస్తూనే వున్నాను

ఇది పతివ్రత వేషం వేసుకున్న పూతన

నాకు పలకాబలపం కొనివ్వలేనని బీద పలుకులు పల్కి

కొందరికి ఉచిత భోజన వసతుల్తో హాస్టళ్ళు కట్టిస్తుంది

నా చదువుకు కలేజీలో సీట్లులేవని చెప్పి

కొందరికి కోటాలుగా వాటాలేసి పంచుతుంది

జీవితంలో పావుభాగం దాటగానే

నా వయసును ఉద్యోగానికి అనర్హతను చేసి

కొందరికి మాత్రం

వయోపరిమితికి సడలింపు మీద సడలింపులిస్తుంది

ఫిర్ భి దిల్‌హై హిందూస్తానీ


ఏ ప్రాంతమేగినా ఎందుకాలిడినా

తల్లిభారతిని పొగడటం మరచిపోని వాడ్ని

నిండా మునిగినా నిండు గుండెతో

వందేమాతర గీతాన్నై ధ్వనించిన వాణ్ణి

ఈ మట్టిపై మమకారం పెంచుకొని

తుపాకి మందు గుండెను నిలిపిన వీరుణ్ణి

ఇన్ని ఐనందుకు

ఇది నా ముఖానికి ఏరాయితో ప్రకటించక పోగా

నామెడలో దరిద్రాన్ని మూర్చబిళ్ళగా వేలాడదీసింది

అయినా దీన్ని నేను ప్రేమిస్తునే వున్నాను

కానీ

దీన్నిలా మరుగుదొడ్డిగా మార్చిన నాయకుల్ని ద్వేషిస్తున్నాను

మనుగడను ధ్వంసం చేసి పదవి నిలుపుకుంటున్న

నీతిమాలిన చర్యను నిరసిస్తున్నాను

ఇక - రాజ్యాంగం వొంకర నుదిటిపై

సవరణ చట్టం తిలకమైన రోజున

జాతీయగీతం పాడినంత ఉద్వేగంతో

మా నాయకులు నపుంసకులు కాదని

కొత్త ప్రకటన చేస్తాను!!


(ప్రకృతి సాహితి సెప్టెంబరు 2001)

Read more...

4, మే 2009, సోమవారం

మాంసపుష్పం

శరీరమంతా దుఃఖాన్ని కప్పుకుని
కళ్ళకు విషాద తెరల్ని కట్టుకుని
వీధి మలుపు చీకట్లో గాజుల అలికిడివై
ఓర చూపులు రాసిపోస్తున్నావు
ఎవరు తల్లీ నువ్వు..?
అమాయకమైన నీ లేత చూపులముందు
పెళ్ళి కనికట్టుచేసి
రవిక ముడివిప్పిందెవరు?
చిల్లర నాణెమై
మెరక వీధిలో విసిరేయబడ్డ జీవితం
ఏ కసాయి తండ్రి వ్యసనానికి పెట్టుబడి?

వేడెక్కిన విటుల కోర్కెల కింద
వెలుగును పోగొట్టుకున్న చీకటి పువ్వా
ఏ గాలిపటపు తెగిన దారానివి నువ్వు..?
ఎండాకాలపు గాలి దుమారానికి
కొట్టొచ్చిన పండుటాకా
ఏ చెట్టు కోల్పోయిన లేత చిగురుటాకువు నువ్వు?

నీ కళ్ళకింద గూడుకట్టిన అమావాస్య
గాయాల చిరునామాల్ని పేజీలు పేజీలుగా విస్తరిస్తూనే వుంది
అకలి కడుపును చూపించడానికి బదులు
పైటతీసి
ఇంకిపోయిన నీ ఎద చూపినప్పుడే
నా గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైంది
ఎందరి సుఖాల కౌగిలి కోసమో
రోగాల వాకిలిగా మారి
నీ మాసాన్ని
గంటల లెక్కన తూచి తూచి అమ్ముతున్నావు
అసలెవరుతల్లీ నవ్వు..?

ఏ భర్త జూదానికి కాయబడ్డ పందానివి
ఏ అప్పు తీర్చడానికి అమ్ముడుపోయిన చంద్రమతివి
ఏ దొంగ కోడికూతకు
మోసపోయిన గౌతమ సతివి..!

అందాల్ని వెక్కిరిస్తూ
గతాన్ని కళ్ళముందుంచే ఈ కాలిన మచ్చలు
నువ్వు సహనంతో భరించిన
ఏ రాక్షస రతికి చిహ్నాలు తల్లీ...!
చచ్చుబడుతున్న అవయవాల అసక్తతను
కన్నీటి స్పర్శతో సముదాయించుకుంటూ
ముసలి వాసనేస్తున్న శరీరాన్ని
శిల్కువస్త్రాల షోకేసుల్లో బంధించి
ఎన్నాళ్ళని ఇలా
చార్లీ స్ప్రేల ఎవ్వనాన్ని పరిమళిస్తావు?

ఆకలి తీర్చుకోడానికి
ఏ పాత విటుడికోసం
ఇక్కడ కళ్ళల్లో వొత్తులు వేసుకుని చూస్తున్నావు
అసలెవరమ్మా నువ్వు?
ఈ వీధి మలుపు చీకట్లో వృద్ధాప్యపు శిలవై
నిరంతర దుఃఖాన్ని ప్రవహిస్తున్నావు...!

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP