10, సెప్టెంబర్ 2009, గురువారం

చివరి పాట

ఎప్పటికైనా ఖాళీ చేయక తప్పదు

బతుకు చుట్టూ అల్లుకున్న

మమకార బంధాలను తెంచుకొని

చివరి క్షణంలో ఒంటరి ప్రయాణమూ తప్పదు



ఈ కోరికలెప్పుడూ ఇంతే!

ఆశల పల్లకి ఎక్కించి ఊరేగిస్తుంటాయి

దూరాన్ని సమీపించే కొద్దీ

విచారాన్ని మిగిల్చి విడిపోతుంటాయి

కొసకు చేరిన ఆయువు దీపం

వత్తిని తడుముకుంటూ కొండెక్కుతుంది

ఇక ఏ కోరికా వుండవు

వెళ్ళిన వాళ్ళ జ్ఞాపకాలతో

వెళ్ళబోయేవాళ్ళు దుఃఖమై కరుగుతుంటారు

కన్నీళ్ళమధ్య మళ్ళీ ఊరేగింపు మొదలవుతుంది



ఎప్పటికైనా తప్పనప్పుడు

బతుకును మూటకట్టుకొని సిద్ధపడటమే మంచిది

మృత్యువు ఎన్నడూ గాయపరచదు

సుతారంగా ప్రాణాన్ని ముద్దెట్టుకుంటుంది

పొందిన అనుభూతులన్నీ మాయమై

ఈ ఆఖరి అనుభూతే అద్భుతమౌతుంది



ఊపిరి పిట్టా! ఊపిరి పిట్టా!

గూడు విడిచే ఘడియ వచ్చిందని

దిగులు పడతావెందుకు?

మరణం శాపం కాదు

పునర్జన్మకు రెక్కలు తొడిగేందుకు

ఈ జన్మ మిగిల్చిన చివరి పదం


(26.06.2001, రాత్రి 01:15)


(ఈ బ్లాగుకి ఇదే చివరి పాట..!!)

7, సెప్టెంబర్ 2009, సోమవారం

కూలుతున్న సోపానం

మీరు చెవులు రిక్కరించి కూర్చోండి

నేను గంధర్వుడిలా మారి

మీ కర్ణపుటల్లో గానామృతం నింపుతాను

శ్రవణ పేయంగా మీ తలలు వూగేందుకు

శృతి తప్పని స్వరతంత్రుల విన్యాసమౌతాను

మీ మానసిక కల్లోలం ఉల్లాసంగా మారేందుకు

అసలు కథ మధ్యలో

ఉపకథల చమత్కారమౌతాను

శివరాత్రులకో, నవరాత్రులకో తప్ప

ఇంకెప్పుడూ నేను గుర్తుకు రాక పోవచ్చు

నా కన్రెప్పల వెనక కావేరి నదులుంటాయని

మీ మనస్సంద్రంలో

ఆలోచన కెరటమై కదిలి వుండకపోవచ్చు

జల్లెడగా మారిన ధోవతిని చూసి

చకోర పక్షుల్లా కళ్ళు చిట్లించడం తప్ప

నా పేదరికంపై జాలి దుప్పటి కప్పలేని జడత్వం మీది

ఎముకలు కొరికే చలి రాత్రుల్లో

చొక్క లేకుండా కథ చెప్పాలని

మీరంతా పట్టువదలని విక్రమార్కులైనప్పుడు

'ఎనీమియా' కు ఆశ్రయంగా శ్రీరాన్ని ఒప్పగించాను

గాత్ర సౌలభ్యం కోసం

గుక్కెడు మిరియాల పాలు ఇప్పించమన్నందుకు

గుడ్లురిమి చూసిన మీ అహంకారం

మనసుపొరలను ఇంకా గుచ్చుతూనే వుంది



గొంతులో జలుబు దాగున రాత్రి

కథ శ్రావ్యంగా లేదని సాకుపెట్టి

పారితోషికం తగ్గించిన మీ అల్పబుద్ధి

ఎన్ని కథలుగా చెప్పినా తక్కువేనేమో!

మీరు 'వూ' కొట్టకున్నా

కథలు చెప్పి మెప్పించే అభాగ్యుడ్ని నేను తప్ప

ఈ ప్రపంచంలో - ఇంకెవరున్నాడు

గుడి ముంగిళ్ళలో, వీధి పందిళ్ళలో

హరికథా శ్రవణ ఫలితంగా

మీ పుచ్చు పుర్రెలకు పుణ్యాన్ని తాపడం చెయ్యడానికి

కంచిలోని కథలన్నీ తెచ్చి చెప్పాను

కానీ -

ఇవాళ

నేను బతుకు వ్యధను కథగా వినిపిస్తే

మీ చెవులన్నీ బధిరత్వాన్ని ఆపాదించుకున్నాయి

హరికథా సామ్రాట్టు వారసుణ్ణయినందుకు

ధర్మసత్రం అరుగు నా అడ్రసును మోస్తోంది

మీ మితిమీరిన నిర్లక్ష్యానికి

కాఫీ హోటళ్ళముందు, కళ్యాణ మంటపాల ముందు

కడుపును చేతిలోకి జార్చుకొని

యాచకత్వాన్ని శిక్షగా అనుభవిస్తున్నాను


ఈ బాధల భాగవతారును చూసి

మీ దాతృత్వం చిల్లరై

నా దోసిట్లోకి జారిపడకపోయినా

నేను మాత్రం ఆకలి పేగుల్ని శృతి చేసుకుంటూ

హరికథా సంకీర్తనతో

మీ మోక్షానికి సోపానమౌతూనే వున్నాను!

3, సెప్టెంబర్ 2009, గురువారం

చరమాంకం

గొంతు తీగె తెగిపోయినప్పుడు

కరచాలనంలో విషాద స్తబ్దత

పరామర్శలో పలకరింపులో నిశ్శబ్దం!

కాలం కనికరించదు

మృత్యువు పగనెవడూ తప్పించుకోలేడు

ఆగిన గుండె కదలిక మళ్ళీ కదల్దు

మరణం

పునరావృతమయ్యే స్వప్నం కాదు

ఊపిరి తెగిపోయే చరమాంకం

నెత్తురు గడ్డకట్టే దీనావస్థ...

శ్వాస ఆగినప్పుడూ

సమూహ దుఃఖం సముద్రాల్ని గడ్డ కట్టిస్తుంది

ఏడుపు శవయాత్రలో వెదజల్లబడుతున్న

స్మృతి పత్రాల వెనుక అగ్నిని దహించే విషాదం

ఆకు రాలాల్సిందే...

ప్రవహించే వర్తమానంలో వెంటాడే మృత్యువు అనివార్యం

చావు చచ్చాక రాదు

మరణం మళ్ళీ మళ్ళీ పొందే అనుభూతి కాదు.

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP