25, మే 2009, సోమవారం

నులక మంచం

ఎంత మంచిదీ నులక మంచం

ఊహ తెలిసిన్దగ్గర్నుంచీ

దీనితో ఎంత అనుబంధమేర్పడిందీ..!

ఈ మెత్తటి నులక మీద పడుకుంటే

అమ్మ గుండెలమీద పడుకున్న అనుభూతి నిచ్చింది

ప్రతి రాత్రి

తాను కొత్త పెళ్ళికూతుర్లా సిగ్గుపడుతూ

నా రాకకోసం ఎంతగా ఎదురుచూసేదనీ..!

అమ్మ కొట్టినప్పుడో, నాన్న కోప్పడినప్పుడో

అలిగి ముడుచుకు పడుకున్నప్పుడు

నన్ను గోముగా సముదాయించిందీ మంచమే

నా వీపును తన గుండెలకు హత్తుకుని

ప్రేమగా పెట్టుకున్న ముద్దులన్నీ

తెల్లారాక వీపుమీద ముద్రలై కనిపించేవి

నా పెళ్ళి రాత్రి

పూల చెండాటలో పాన్పై తెగ మురిసిపోయింది

నేనూ, నా సహచరీ సరసాలాడుకుంటూ

దాంపత్య సుఖంలో తేలాడుతున్నప్పుడు

కిర్రు కిర్రు మంత్రాల ఆశీస్సులిచ్చి

నాకు పండంటి వారసుడ్నందించిందీ నులక మంచమే.

శిధిలమౌతున్న నా శరీరంతోపాటు

ఇప్పుడీ నులకమంచమూ కుక్కిదైపోయింది

చిన్నప్పుడు దోగాడుకుంటూ వీధిలోకెళ్తానేమోని

నానమ్మ నులకమంచానికి నన్ను కట్టేసేది

తరుముకొచ్చిన వృద్ధాప్యంలో

ఎవరూ కట్టేయకుండానే ఈ మంచంలో బందీనయ్యాను

ముసలికంపు కొడుతున్న ఈ దేహాన్ని

అయినవాళ్ళంతా ఈ సడించుకుంటుంటే

ఈ నులక మంచం మాత్రం

ఇప్పటికీ అదే ప్రేమతో నన్ను గుండెలకు హత్తుకుంటూనే ఉంది

నా ఊపిరాగే లోపు

ఏమిచ్చినా దీని ఋణం తీరేట్టులేదు

ఈ మంచానికి కాళ్ళకట్టగా మారితే తప్ప.

4 కామెంట్‌లు:

హరే కృష్ణ 25 మే, 2009 4:38 PMకి  

జీవితం ను బాగా వివరించారు నులక మంచెం అంటే నాకు గుర్తొచ్చేది మా ఇంట్లో ఎప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచినా rtc బస్సులా బలయ్యేది.

మరువం ఉష 25 మే, 2009 5:47 PMకి  

మంచంతో మనిషి అనుబంధాన్ని బాగా వివరించారు. నులక మంచం కాదు కానీ నవారుమంచం బాగా అలవాటు, రెండు రోజుల క్రితం కూడా నా కింగ్ బెడ్లో పడుకుని మా వూరి చెరువు గట్టు మీద నవారుమంచంలో పడుకున్నట్లే కలగన్నాను.

అజ్ఞాత,  25 మే, 2009 6:08 PMకి  

:) బావుంది.
మీరంతా అమెరికాలో ఉంటారా!!
నేను ఎక్స్ పోర్ట్ చేసి పెడితాను! ఎంత డబ్బులకైతే మీరు రెడీ!

Ramani Rao 26 మే, 2009 2:26 PMకి  

"చిన్నప్పుడు దోగాడుకుంటూ వీధిలోకెళ్తానేమోని
నానమ్మ నులకమంచానికి నన్ను కట్టేసేది
తరుముకొచ్చిన వృద్ధాప్యంలో
ఎవరూ కట్టేయకుండానే ఈ మంచంలో బందీనయ్యాను"
చాలా బాగుందండి.. నులకమంచం, మడతమంచం, పడకుర్చీ అనుభూతులు ఎంత చెప్పుకొన్నా తరగనివి . చాలా బాగుంది మనిషి జీవితానికి నులక(కుక్కి ) మంచానికి బంధం.

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP