20, ఏప్రిల్ 2009, సోమవారం

ఎడారివి కావద్దు

బొట్టులేని నీ ముఖాన్ని చూసినప్పుడల్లా

నాకు అమావాస్య ఆకాశం గుర్తొచ్చేది !

గాజుల శబ్దం లేని నీ చేతుల్ని చూసినప్పుడల్లా

పక్షుల కువ కువల్లేని సూర్యోదయాన్ని చూసినట్టుండేది !


కాటుకలేని నీ కళ్ళను చూసినప్పుడల్లా

గ్రహణం పట్టిన సూర్యబింబాన్ని చూసినట్టుండేది !

పసుపుతాడులేని నీ మెడను చూసినప్పుడల్లా

ఎండిన సెలయేరు జ్ఞాపకమొచ్చేది!

జలపాతంలాంటి నీ నల్లటి వదులు జడమీద

విరబూయాలనుకున్న మల్లెమొగ్గలు

విధవతనం నీకిచ్చిన బోడితలను చూసి

దుఃఖంతో వాడి, తీగమీంచి రాలిపోయేవి !

ఇంద్రధనస్సును చూసినప్పుడల్లా

పెట్టెలో నలగని మడతలై కూర్చున్న నీ రంగుల చీరలన్నీ

వెక్కిళ్ళు పెట్టుకునేవి..;


***


నీకు పెళ్ళి కుదిరిందని తెల్సినరోజు

నేను పదోతరగతి పాసైనంతగా సంబరపడిపోయి

గాలిపటంలా దిక్కులన్నిటికీ శుభలేఖల్ని పంచిపెట్టాను గుర్తుందా !

చూపుల్నిండా బేలతనాన్ని నింపుకుని

అప్పగింతలప్పుడు

నీ చెక్కిళ్ళు కన్నీటిమయాలైన దృశ్యం

నెనెట్లా మర్చిపోగలను చెప్పు...!

నువ్వత్తారింటికి బయల్దేరి వెళ్తుంటే

ఊరు ఊరంతా నువ్వెక్కిన బండి వెనకాలే నడుస్తూ

వీడ్కోలై, పొలిమేరదాకా సాగనంపిన వైనం

ఇంకా నా మనోఫలకం మీంచి చెరిగిపోనేలేదు..!

పెళ్ళి జరిగిన నక్షత్రం మళ్ళీ రాకముందే

నువ్వు పచ్చదనం కోల్పోయి పుట్టింటికి తిరిగొచ్చినప్పుడు

నేను నిలువునా చీలి పోతున్నట్టంపించింది

పెళ్ళిళ్ళ్కి, పేరంటలకి నిన్ను దూరంచేసి

నీ చోటును గదిమూలకి నిర్దేశించినప్పుడు

ఒంటరివై

స్వరాలు పలకని సంగీతం పెట్టేలా

మౌనంగా రోదించిన సంగతీ నా కెరుకే..!

నీ సౌభాగ్యాన్ని

ఊరి చివర బావి గట్టుమీద శిరోముండనం చేసినప్పుడు

నీ దుఃఖం ఏ రాళ్ళనీ కరిగించలేక పోయింది !

వీధి పంపుదగ్గర

నీ బొట్టులేనితనం వెక్కిరింపుకు గురైనప్పుడు

తెల్ల ముసుగు చాటు చేసుకుని

కన్నీళ్ళు బిందెతో మౌనంగా తిరిగొచ్చేదానివి.

విధవతనం అపశకునమంటూ

నీకు "బోడిముండ" బిరుదు నిచ్చిన

ఈ పెద్ద ముత్తైదువ లెదురొచ్చిన రోజే కదూ

నీ బాసికం యమపాశపు గాలానికి చిక్కి

నిప్పుల్లో కాలిపోయింది...!

అయినా

ఈ బొట్టు నీకు పుట్టుకతో వచ్చిన సొత్తు

చిట్టి చేతులకు గాజులేసుకుని

జుట్టు చేతికందగానే పూలు పెట్టుకొని

బాల్యం నుంచీ వసంతానివై విరబూసిన నువ్వు

మధ్యలో వచ్చి, నడిమధ్యలో వెళ్ళిపోయిన వాడికోసం

ఎడారివి కావద్దు...!


తల్లీ !

నీ కనుబొమ్మల కొండలమధ్య కొత్త సూర్యోదయాన్ని చూడాలనుంది !

నీ నవ్వుల పండువెన్నెల్లో తడిసి ముద్దవ్వాలనుంది

నీ కోసం ఈ ప్రపంచమంతా పసుపుతోట నాటి

కుంకుమ పూలు పండించాలనుంది...!

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP