30, జనవరి 2009, శుక్రవారం

శీతాకాలం రాత్రి

చీకటి రాకముందే

చలిగాలి పరిగెత్తుకొస్తోంది

లాకౌట్ ప్రకటించినట్టు

ఇళ్ళన్నీ తలుపులు బిగించుకుంటాయి

మూసిన కిటికీ సందుల్లోంచి

చలి పాములా దూరి

గదుల గుండెల్ని కాటు వేయాలని చూస్తోంది



రోడ్లు చిత్తు కాగితాల్ని కప్పుకొని

కలత నిద్రపోతున్నాయి

వరండాల్లోని తాతయ్యలు, వృద్ధాప్యంతో పాటు

శీతాకాలాన్నీ శాపనార్ధాలు పెడుతున్నారు

దొడ్లోని గడ్డివాములు

కొబ్బరాకు రుమాళ్ళు కప్పుకున్నాయి

వీధి లైటు డోము రెప్పలకు

మంచు కాటుకను దిద్దుకుంటున్నాయి

విరహంతో విసిగిపోయిన ఊరకుక్క

ఆడకుక్క మచ్చిక చేసుకోలేని

అసమర్ధతను మూలుగుతోంది



అబ్బ... ఎవరు వేసి వెళ్ళారో

ఊరిపైన ఈ మంచు షామియానా

బొట్లు బొట్లుగా జారుతూ

చల్లటి ఉచ్చులతో నరాలు బిగిస్తోంది

చలిని చెక్కుతున్న ఆకాశం నుంచి

మంచు పొట్టులా రాలుతూనే వుంది

చుక్కలు కనిపించడం లేదు

చందమామ జాడ తెలియటం లేదు

చింతతోపు చివర్లోంచి

చలిగాలిలా దూసుకొచ్చే కీచురాళ్ళ ధ్వని

తెల్లార్లూ నిద్రను తరుముతూనే వుంది



రాత్రి కరిగినా మంచు తరగటం లేదు

పూల మొక్కల శిగలో ముత్యాలు మెరుస్తున్నాయి

మంచులో తడిసిన గుమ్మడి పువ్వు

చిన్న సైజు అక్వేరియంలా జలజలలు పోతోంది

అరటిబోదెలు నీటి చుక్కలుగా జారుతూ

శిరస్నానం చేసొచ్చిన

పడుచుపిల్ల నునుపు దేహాన్ని తలపిస్తున్నాయి

మంచు ముద్దుల ముద్రలతో

గుమ్మం ముందు న్యూస్ పేపరు సిగ్గుపడుతోంది

చలికి ముడుచుకున్న పావురాళ్ళలా

కిటికీలో పాల ప్యాకెట్లు!



పొద్దు పొడవట్లేదు

గడ్డకట్టిన శరీరాలపై సూదులు గుచ్చడానికి

సూర్యుడు భయపడుతున్నాడు

ఆలోచనలు రేపిన మంటలతో

ఇక నేనే అగ్ని గోళాన్నై ఉదయించి

అన్ని దేహాలకూ కవిత్వం కాపడం పెడతాను


(ఆంధ్రజ్యోతి దినపత్రిక 24-01-1999)

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP