30, మార్చి 2009, సోమవారం

మృత్యుకంపం

ఇవాళ

ఒడ్డు చెదిరిన సముద్రాలు

ఊళ్ళలోకి వలసరావడం ఆశ్చర్యం కాదు

వరదముఖంతో నేలకుజారిన మేఘాలు

నీటి మోకులై గొంతుబిగించడం ఆశ్చర్యం కాదు

బతుకు భరోసాకి చిత్తరువైన భూమి

పట్టపగలు వొళ్ళు విరుచుకోవడం ఆశ్చర్యం

ఒక్కొక్కరికి ప్రేమగా పురుళ్ళుపోసిన పుడమి

ఒక్కసారే ఇందర్ని సమాధి చెయ్యడం ఆశ్చర్యం



నావకింద నీళ్ళు కదిలినట్టు

ఇప్పుడు కాళ్ళకింద నేల కదులుతుంది

ఒక పాపిష్టి ప్రకంపన తర్వాత

ఏది ఇల్లో - ఏది గొయ్యో

అంతా ఒకటిగా కళ్ళముందున్నప్పుడు

భూమంటే మనుషుల్ని పూడ్చే మట్టెని కాక

క్షేమకు రూపమైన ధరిత్రని ఎలా చెప్పగలం?



ఓ వేద పండితులారా!

ఇక మీగొంతులో భూసూక్తాన్ని స్వరపరచకండి

గణతంత్రదినాన కుతంత్రం చేసి

లేతమొగ్గల బతుకుతుంచిన బాల ఘాతి ఇది

మట్టిపొరల పాచినోటితో

ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న పీనుగల దిబ్బయిది



ఇప్పుడు

చెట్లు మొదళ్ళును కోల్పోయి

మట్టి గుండెపై మెటికలు విరచడం ఆశ్చర్యం కాదు

ఆకాశానికి నిచ్చెనేసిన అపార్టుమెంట్లు

నిలబడ్డచోటే కాళ్ళు నరుక్కోవడం ఆశ్చర్యం

వంతెన కలపలేని ఖాళీల మధ్య

నడకలు తెగిన దారులు కళేబరాల్ని పేర్చుకోవడం ఆశ్చర్యం



భూమి పొరలు పొరలుగా విడిపోయాక

వూరంటే శవాలు పేర్చిన వల్లకాడేనేమో

శిధిలాల మధ్య కుళ్ళుతున్న దుర్గంధమేనేమో

బతకడం నేరమైన భూమ్మీద

సామూహిక దహనంగా బూడిదవటమే శిక్షేమో!

ఇక దిక్కులెన్నివున్నా

మనం ముమ్మాటికీ దుక్కులేనివాళ్ళమే

వెల్లువౌతున్న విలయాలమధ్య

బతుకు భరోసాకు భూమి కూడా ఆధారం కానప్పుడు

బతుకు కంటే ఎక్కువగా

మనం చావును ప్రేమించడం సహేతుకం



(2001 జనవరి 26 గుజరాత్ భూకంపానికి పతిస్పందనగా)

(ఆంధ్రభూమి దినపత్రిక 12.02.2001)

Read more...

26, మార్చి 2009, గురువారం

వంట బ్రాహ్మడు

మొదటిసారి వంటకెళ్ళినరోజు

అమ్మానాన్నలు పెట్టిన పేరు గాడిపొయ్యిలో తగలడిపోతే

మీచేత 'వంత బ్రాహ్మడ'ని

ద్వితీయ నామకరణం చేయించుకున్నవాణ్ని

విందులకి వినోదాలకీ మీ నోళ్ళు తీపెక్కడానికి

లడ్డూలూ, జిలేబీలూ చేసిపెట్టి

తీరా ఇంటికెళ్తే

గంజి కాచుకోవడానికి నూకలు కరువైనవాణ్ని


వంట చేస్తున్నంత సేపూ

జీడిపప్పు తింటాననో, దాక్షపొట్లం దాచేస్తాననో

మీ అనుమానాన్ని తలుపు సందులో చూపునుచేసి

బెల్లం ముక్క కూడా నోట్లో వేసుకోని నా నిజాయితీ ముందు

మీరంతా తేలుకుట్టిన దొంగలయ్యేవారు

పప్పులో వుప్పు తగ్గిందనో

కూరలో చిటికెడు కారమెక్కువైందనో

తాలింపు చిటపటల్లా నామీద విరుచుకుపడ్డప్పుడు

ఒక్కసారిగా

కోపం బియ్యపు వడియమై పొంగినా

మూడ్రోజులుగా పస్తులున్న నా పిల్లల ఆకలి ముఖాలు గుర్తొచ్చి

నీళ్ళు చల్లిన పాలపొంగులా

కోపమంత చప్పున చల్లబడిపోయేది

వంట బాగున్న రోజు

నలభీమపాకమని పొగుడ్తూ

మీరంతా ఘటోత్కచులై గిన్నెలు ఖాళీ చేసేవారు

మీ పెళ్ళిళ్ళకి, శ్రాద్ధాలకి

పంచభక్ష్యపరమాన్నాలు అందరికీ వడ్డనచేసి

వాసన మొహం మొత్తితే

ఏ అపరాహ్నానికో నాలుగు మెతుకులు తినేవాణ్ని

వంటపనయ్యేదాకా

పంచదార నోట్లో పోసినట్టు తియ్యటి కబురులు చెప్పి

తీరా పూర్తికాగానే

నన్ను కరివేపాకులా తీసిపడేసే మిమ్మల్ని చూసి

బుట్టలో బూరెలన్నీ చేదెక్కేవి

మీకు చాకిరీ చేస్తున్నంత సేపూ

అట్లకాడకి, అప్పడాలకర్రలకీ విశ్రాంతి దొరికేదేమోకాని

నాకు మాత్రం క్షణం తీరిక కూడా కరువయ్యేది!

సలసలా మరుగుతున్న నూనెగిన్నె జారిపడి

ఒళ్ళంతా ఎర్రగా కంది బొబ్బలెక్కినప్పుడు

నూనంతా వొలికి పోయిందని చీవాట్లేసిన

మీ చిరాకు ముఖాల్ని చూసినప్పుడల్లా

కాల్చిన అట్లకాడతో వాతలు పెట్టాలన్పించేది


మీరంతా పట్టుబట్టలు తొడుక్కోని

నా ముతకపంచెమీద మసిబారిన పేదరికాన్ని

వేళాకోళం చేసినప్పుడు

గుండెల్లో కనపడని ముల్లేదో గుచ్చుకున్నట్టుండేది

పెళ్ళి పెద్దలా

మీ ఆడకూతుళ్ళకి

మాటసాయంతో ఎన్నో సంబంధాలు కుదిర్చాననే కాని

గుండెలమీద కుంపట్లై కూర్చున్న

నా ఎదిగిన బిడ్డలకు

పెళ్ళిళ్ళు చేయలేని పేదపేరయ్యరికం నాది

మడితో వంట చెయ్యాలనే ఆచారాన్ని

తడిగుడ్డగా నా వొంటికి చుట్టుకుని

నేను ఆస్త్మా పేషంటునైన సంగతి మీకు తెలియదు

కట్టెలపొయ్యి మండనని మొరాయించినప్పుడు

అనారోగ్యం పొగలు ఊపిరితిత్తుల్ని అల్లుకుపోయి

ఈ నిప్పుల సెగలమధ్య నా రక్తం ఇరిగిపోయింది

సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని వంట పాత్రల్లో చూసుకుంటూ

నా వసంతాన్ని చిల్లుల గరిటలోంచి జారవిడుచుకున్నాను

ఇప్పుడు అర్థాంతరంగా పైనబడ్డ వృద్దాప్యం నీడలో

ఆకలి మరణాన్ని పలవరిస్తున్నాను

మీరు నన్ను ఆనవాలు పట్టినా

పలకరించడానికి అంతస్థులడ్డురావచ్చు

నేనింత త్వరగా చితి మంటలకు

మీ వంటల మంటల మధ్య విశ్రాంతిని దూరం చేసుకునే కదా!


రేపెప్పుడైనా

నా చావు వార్త మీదాకా వస్తే

వంట బ్రాహ్మడు చచ్చిపోయాడని దిగులు పడక్కర్లేదు

ఆకలి మంటను చల్లార్చుకోడానికి

గరిటె పట్టుకున్న నా కొడుకు

మళ్ళీ ఆ నిప్పుల్లోకే నడిచొస్తున్నాడు..!



(ఆంధ్రజ్యోతి దినపత్రిక 12.06.1995)

Read more...

23, మార్చి 2009, సోమవారం

ఆరు కొత్త ముఖాలు

1

నేలకూ ఆకాశానికి మధ్య

ఎవరో జల్లెడ అమర్చారు

హరివిల్లు రంగుల్ని జార్చుకొని

నింగికి శేషవస్త్రమైంది


2

మేఘాన్ని చూస్తూ కాలాన్నిమోశాం

చినుకురాలని గుండెలో వరదబాకు దిగింది

కిరణాలు చెదిరిన నిప్పుముద్ద

మబ్బు కర్చీఫ్‌లో ముఖం దాచుకుంది


3

అనుభవాలన్నీ సాయంత్రాలవే

ఈతచెట్లు కల్లుముంతల్ని కంటాయి

తాటాకు దొప్పల్లో తడిసిన చూపులకు

రెప్పలమధ్య ఉయ్యాల పండగా


4

పాడుబడ్డ బావిగొంతులో

సాలెగూడు చిక్కుకుంది

మెడకు బిగిసిన చాంతాడుతో

గిలక శాశ్వతంగా నిద్రపోతోంది


5

కాలం అడుగుల కింద

ఎండుటాకుల ధ్వని కాలుష్యం

చెట్టుకు నిద్రపట్టదు

తొర్రలో తొండకు సుదిర్ఘ స్వప్నాలు


6

రాత్రి పిట్ట రొద చేస్తోంది

చంద్రుడు చీకటి కోటు తొడుక్కున్నాడు

కొసమెరుపు లేకుండానే

బతుకు తెల్లారి పోయింది


(12.10.2000 రాత్రి 11:55)

Read more...

19, మార్చి 2009, గురువారం

మూడోకాలు

గుబాళించే తడి మట్టి మొక్కల మధ్య నిలబడి

భీష్మాచార్యునిలాంటి ఈ చెట్టును చూడు!

ఎండ వేడిలో శ్రమల బొబ్బలెక్కినప్పుడు

నీ కన్నీటి చారికల్ని

అమ్మ పైటకొంగై తుడిచిందీ చెట్టే కదూ !


మాతృత్వాన్నికి నోచుకోని

ముత్తైదువలు కట్టే ఊయలల్లో పసిబిడ్డల్ని పండించి

గొడ్రాలితనము నించి కాపాడే పచ్చని దేవతా ఈ చెట్టే !

ఒక మేఘం కలశం పలకరిస్తే చాలు

నిండు చూలలై ఫలాల తీయదనాల్నందించింది !

ఈ చెట్టు ఊడల భుజాల పై కెక్కితే

నాన్నలా ఊయలలూపి కలల షికారు చేయించేది

ఈ చెట్టు గూట్లోనే కదా ! వేనవేల జాతుల పిట్టలు

జ్ఞాపకాల కాపురాలు చేసిందీ...

ఒకప్పటి లేత యౌవ్వనం

ఇప్పుడు వేళ్ళ కిందికి ఎలా జారిపోయిందో

ఎండి మోడువారిపోతున్న శాఖల్ని తడిమిచూడు

అనుభవాల్ని రాల్చే ఈ కొమ్మల కింద

ఎంత వాణిజ్యం నడిచిందో నీకేం తెల్సు..!

ఆకుల తొలుచుకుంటూ వస్తున్న గాలికి తెలుసు

దీని పచ్చదనం ఆరదని !

ఒక్కసారి చెవులిచ్చి విను

రాలిన ఎండుటాకులు

చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ

పునర్జన్మని ఆలపిస్తున్న పాట...!

ఒక్కసారి రెప్పలెత్తి చూడు

పండిన కాయలు కంటున్న

కొత్త మొక్కల ఎదిగే కలల పంట...!


***

నీ గుక్కపట్టిన దుఃఖాన్ని

గిలక్కాయై సముదాయించిందీ,

చిన్నప్పుడు నీ రెండు చేతుల్ని భుజాలమీదేసుకుని

నీకు నడక నేర్పిన మూడు చక్రాలబండీ ఈ చెట్టే !

ఓ పట్టెమంచమై

నీ వంశాభివృద్ధి గీతాన్నాలపించిందీ పచ్చని స్వరమే

అంతే కాదు -

రేపు వృద్ధాప్యంలో

నీ రోగగ్రస్థ శరీరానికి ఊతంగా నిలిచి

నిన్ను నడిపించే మూడోకాలూ ఈ చెట్టే !

Read more...

16, మార్చి 2009, సోమవారం

ఊరు చచ్చిపోయింది

అవును!

మత విద్వేషం మసూచిలా సోకి

ఊరు చచ్చిపోయింది

వరుసలు కలిపి కుశల మడగాల్సిన గొంతులు

కుల మతాల విద్వేషం కక్కుతున్నాయి

ఇప్పుడీ ఊరు

గల గలల సెలయేటి చైతన్యం కాదు

పంట పొలాల మధ్య వెక్కిరిస్తున్న దిష్టిబొమ్మ...!

***

ఎంత కలుపుగోలుగా ఉండేదీ ఊరు

మనసులన్నీ ఒక్కటే పూదోటలా పరిమళించేది

అరమరికల్లేని ఉమ్మడి కుటుంబమై

ఆత్మీయతానురాగల్ని పంచి పెట్టేది

వేడుకైనా, జాతరైనా అందరికీ పండగే..!

తాటాకు పందిళ్ళకింద

సీతారామ కల్యాణం జరుగుతున్నప్పుడు

అత్తరు గుబాళింపులతో

నవాబులంతా చదివింపులిచ్చేవారు

మొహరం రోజు

పీర్ల ఊరేగింపు ఇంటి ముందుకు రాగానే

కులాలన్నీ నిండుకుండలై ఉప్పొంగి

'వారు' పోసి తలొంచి నమస్కరించేవి

రంగు రంగుల బుడగలతో

క్రిష్టమస్ తాత ప్రత్యక్షమవగానే

అందరి గుండెలూ చర్చిగంటలై మారుమోగేవి

సజ్జ కంకులకోసం పిట్టలన్నీ ఒకేసారి వాలినట్టు

ఊరు వూరంతా ఏకమై

చెట్లకింద వనభోజనాన్ని పంచుకునేది

ఎవరు పెట్టరో ఈ చిచ్చు

మనుషుల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది

ఇప్పుడు కులానికో మంచినీళ్ల బావి

మతానికో చర్చల రచ్చబండ !

నడిచే వీధులు వేరు, కొలిచే దేవుళ్ళు వేరు

పరాయివాడు ఆలయ ప్రవేశం చేస్తే

మలాన్ని తినిపించే పైశాచిక స్థితికెదిగి

కులం బుసకొట్టే ఉన్మాదమైంది

ఇక్కడ మనిషిని గుర్తించడం మనిషికే కాదు

మనుషులు వేరుచేసిన దేవుళ్ళకీ సాధ్యంకాదు

కుట్రలై, కుతంత్రాలై, కొట్లాటలై మండుతున్న

ఈ అమానవీయ విద్వేషాల మధ్య

ఊరు చచ్చిపోయింది

నివురుగప్పిన నిప్పై స్మశానం మాత్రం ఇంకా బతికే వుంది.

Read more...

12, మార్చి 2009, గురువారం

ఎదురుచూపు

చైతన్యమా!

నువ్వు నా ఊపిరివి

చిన్నప్పుడు నాతో దోస్తీ చేసేదానివి

ఇప్పుడెక్కడి కెళ్ళావ్?

సంక్షోభ శిఖరమ్మీద

శిలువను మోస్తున్న నాకు

ఇప్పుడు నీ సాయం కావాలి.

నీ కోసం వెతుకుతూ

నన్ను నేను ఎన్నిసార్లు తవ్వుకున్నానో..!

బ్రతుక్కీ, బాధకీ అర్థం తెలియకుండా

రంపం పొట్టులా రాలిపోతున్న

ఘడియల్ని లెక్కేసుకుంటూ

కాలాన్ని ఖర్చుచేస్తున్నాను

నువ్వెక్కడున్నా

సూటిగా వచ్చి నా హృదయంలో పుష్పించు

నిన్ను పాటతో పలకరిస్తాను

కవిత్వంతో బుజ్జగిస్తాను

నీ రాక కోసం

నిరాశలేని నిరీక్షణలో

నా కళ్ళెప్పుడూ మేల్కొనే ఉంటాయి.

Read more...

9, మార్చి 2009, సోమవారం

పోర్టర్

స్టేషన్‌లో దిగగానే

కాకీ నిక్కరు, ఎర్రచొక్కా తొడుక్కుని

ఆత్మీయత నింపుకున్న కళ్ళతో

చిరకాల మిత్రుడిలా నవ్వుతూ ఎదురొస్తాడు

'మంచిగున్నారా సార్' అంటూ పలకరించి

నా బరువును తన భుజాలమీది కెత్తుకుంటాడు

కిక్కిరిసిన ప్లాట్‌ఫారం నుంచి

జన సమూహాన్ని తోసుకు వెళ్తున్న తను

సముద్రాన్ని చీల్చుకుపోతున్న క్రీస్తులా వుంటాడు

జబ్బమీద మెరిసే ఇత్తడి లైసెన్స్ బిళ్ళ ఎప్పుడూ

అతణ్ణి గాడిదను చేసి భూగోళాన్ని వీపు కెత్తుతుంది!

అతని శ్రమను కరెన్సీతో తూచి

పదినోటు చేతిలో పెడతానా -

'నా కష్టం ఐదు రూపాయలే సార్' అంటూ

సత్యహరిశ్చంద్రుడిలా సమాధానమిస్తాడు

ఎనౌన్సర్ గొంతు రైలు ఆలస్యన్ని పలికినప్పుడు

స్టేషన్ ముందుండే రావిచెట్టు కింద కూర్చుని

చేతిమీద కాయలు కాసిన జీవితాన్ని తడుముకుంటాడు

బీడీముక్కల వెచ్చదనాన్ని గుండె నిండా పీల్చుకుని

పొగలు పొగలుగా ఆలోచన్లోకి వెళ్ళి

రోగిష్టి భార్య మందుల ఖర్చును వెదుక్కుంటాడు

నేను తిరిగి ఊరెళ్ళేప్పుడు

కుటుంబ సభ్యుడిలా నా వెంట వచ్చి

బండి కదలగానే

చేతిని పచ్చ జెండాలా పైకెత్తి వీడ్కోలు చెబుతాడు

అతనీమధ్య ఎందుకో కనిపించట్లేదు

బహుశా వేరే ఊరు వెళ్ళాడనుకున్నాను

కానీ...

అతను మరో లోకం వెళ్ళిపోయాడని తెల్సి

గుండె రైలు పట్టాలకింద నలిగిపోయినట్లైంది!

ఇప్పటికీ

ఆ స్టేషన్‌లో దిగితే చాలు

అతని కరస్పర్శకోసం నా సూట్‌కేస్

పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది

నేను వచ్చిన పని మర్చిపోతాను.

Read more...

5, మార్చి 2009, గురువారం

బతుకుతడి

ప్రతి సాయంత్రమూ

గోదావరి భుజమ్మీద చెయ్యేసి నడుస్తూ

నేనో తెరిచిన పుస్తకాన్నవుతాను

ఈ మెత్తటి ఇసుకమేటలమీద పడుకుని

"బాగా చదువుకోరా నాయనా" అంటూ

తడికళ్ళతో దీవించి పంపిన

అమ్మ ఒడిని జ్ఞాపకం చేసుకుంటాను

నా అల్లిబిల్లి భావాలకు

అక్షర రూపం పేర్చుకోవడం రానప్పుడు

ఈ గోదావరే నా చేత కవిత్వాన్ని ఓనమాలుగా దిద్దించింది

భరించలేని ఏకాంతాన్ననుభవిస్తూ

దుఃఖంతో చెక్కిళ్ళు తడైనప్పుడు

గాలి అలల్ని చేతులుగా చాచి

నా కన్నీళ్ళు తుడిచి, ధైర్యాన్ని నీటి తుంపరులుగా చిలకరించింది

గోదాట్లో ఈతకొడుతుంటే

పసితనంలో అమ్మకాళ్ళమీద బోర్లా పడుకొని

స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది

వర్షాకాలంలో

వరదతో పరవళ్ళు తొక్కుతూ

ఆగ్రహావేశాలతో పరిగెత్తే గోదావరిని చూస్తే

బడికెగ్గొట్టి బెచ్చాలాడుకుంటున్నప్పుడు

కోపంతో ఎరుపెక్కిన నాన్న కళ్ళు గుర్తొస్తాయి

ఇక్కడ గవ్వల్నీ, శంఖాల్నీ ఏరుకుంటున్నప్పుడల్లా

చిన్నప్పటి అష్టాచెమ్మలు

జంగందేవర కొమ్ములూర ధ్వనులూ

ఈ గవ్వల్లోంచి

కన్పించినట్టు, విన్పించినట్టు అనిపిస్తుంది

శీతాకాలం రాత్రి

ఆకాశం పెళ్ళికొడుకు దోసిళ్ళలోంచి జారవిడిచే

ముత్యాల తలంబ్రాలు పోయించుకుంటున్న పెళ్ళికూతురై కన్పించి

తెల్లారేసరికల్లా

లేతకిరణాల వెచ్చదనంలో

కురులారబెట్టుకుంటున్న పెద్దముత్తైదువలా దర్శనమిస్తుంది

వేసవిలో ఒళ్ళంతా ఇసుకమేటలై

ఏడుకొండలవాడికి తలనీలాలర్పించి

లడ్డూలకోసం క్యూలో నిల్చున్న బోడిగుండ్ల వరసలా కన్పిస్తుంది

శరద్రాత్రి వెన్నెల్లో

గౌతముడు పిండి ఆరేసుకున్న ధవళవస్త్రం

ఈ గోదావరి

'గోదావరి తల్లికి గొజ్జంగి పూదండ' అంటూ

జీవనరాగాల్ని కూడాదీసుకున్న సరంగు గొంతు

పడవపాటై సాగిపోతుంటే

నా మనసు తెరచాపలా ఎలుగెత్తుకుంది


ఇప్పుడు గోదావరంటే

ఒక్క నది మాత్రమే కాదు

నాలోంచి ప్రవహించే ఒక జీవరహస్యం

నన్ను దున్ని నాలో కవిత్వాల్ని పండించే

నీటి సేద్యకాడు


ఇప్పుడు గోదారంటే

నన్ను నిలువునా ముంచేత్తే బతుకుతడి.

Read more...

2, మార్చి 2009, సోమవారం

ఒక ముగింపు

చిన్నప్పుడు

నాన్న మొక్కను నాటుతుంటే

నేను పెరిగి పెద్దయ్యే సరికి

పండ్లు కాస్తుంది, తినొచ్చనుకొని

సంధ్యావందనం పూర్తయ్యాక

మిగిలిన నీళ్ళతో దీని మూలాన్ని తడిపాను


కానీ -

ఉద్యోగం శూన్యమై

కులవృత్తి శాపమై

ఉరి తీసుకోడానికి

ఈ చెట్టే సాధన మౌతుందని

ఊహించ లేక పోయాను!

(ఆంధ్రప్రభ దినపత్రిక, 15.05.1996)

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP