మూడోకాలు
గుబాళించే తడి మట్టి మొక్కల మధ్య నిలబడి
భీష్మాచార్యునిలాంటి ఈ చెట్టును చూడు!
ఎండ వేడిలో శ్రమల బొబ్బలెక్కినప్పుడు
నీ కన్నీటి చారికల్ని
అమ్మ పైటకొంగై తుడిచిందీ చెట్టే కదూ !
మాతృత్వాన్నికి నోచుకోని
ముత్తైదువలు కట్టే ఊయలల్లో పసిబిడ్డల్ని పండించి
గొడ్రాలితనము నించి కాపాడే పచ్చని దేవతా ఈ చెట్టే !
ఒక మేఘం కలశం పలకరిస్తే చాలు
నిండు చూలలై ఫలాల తీయదనాల్నందించింది !
ఈ చెట్టు ఊడల భుజాల పై కెక్కితే
నాన్నలా ఊయలలూపి కలల షికారు చేయించేది
ఈ చెట్టు గూట్లోనే కదా ! వేనవేల జాతుల పిట్టలు
జ్ఞాపకాల కాపురాలు చేసిందీ...
ఒకప్పటి లేత యౌవ్వనం
ఇప్పుడు వేళ్ళ కిందికి ఎలా జారిపోయిందో
ఎండి మోడువారిపోతున్న శాఖల్ని తడిమిచూడు
అనుభవాల్ని రాల్చే ఈ కొమ్మల కింద
ఎంత వాణిజ్యం నడిచిందో నీకేం తెల్సు..!
ఆకుల తొలుచుకుంటూ వస్తున్న గాలికి తెలుసు
దీని పచ్చదనం ఆరదని !
ఒక్కసారి చెవులిచ్చి విను
రాలిన ఎండుటాకులు
చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ
పునర్జన్మని ఆలపిస్తున్న పాట...!
ఒక్కసారి రెప్పలెత్తి చూడు
పండిన కాయలు కంటున్న
కొత్త మొక్కల ఎదిగే కలల పంట...!
నీ గుక్కపట్టిన దుఃఖాన్ని
గిలక్కాయై సముదాయించిందీ,
చిన్నప్పుడు నీ రెండు చేతుల్ని భుజాలమీదేసుకుని
నీకు నడక నేర్పిన మూడు చక్రాలబండీ ఈ చెట్టే !
ఓ పట్టెమంచమై
నీ వంశాభివృద్ధి గీతాన్నాలపించిందీ పచ్చని స్వరమే
అంతే కాదు -
రేపు వృద్ధాప్యంలో
నీ రోగగ్రస్థ శరీరానికి ఊతంగా నిలిచి
నిన్ను నడిపించే మూడోకాలూ ఈ చెట్టే !
1 కామెంట్‌లు:
ప్రసాద్ గారూ!
మీ కవిత గొప్ప అనుభూతినిచ్చింది.
దార్ల
కామెంట్‌ను పోస్ట్ చేయండి