పోర్టర్
స్టేషన్‌లో దిగగానే
కాకీ నిక్కరు, ఎర్రచొక్కా తొడుక్కుని
ఆత్మీయత నింపుకున్న కళ్ళతో
చిరకాల మిత్రుడిలా నవ్వుతూ ఎదురొస్తాడు
'మంచిగున్నారా సార్' అంటూ పలకరించి
నా బరువును తన భుజాలమీది కెత్తుకుంటాడు
కిక్కిరిసిన ప్లాట్‌ఫారం నుంచి
జన సమూహాన్ని తోసుకు వెళ్తున్న తను
సముద్రాన్ని చీల్చుకుపోతున్న క్రీస్తులా వుంటాడు
జబ్బమీద మెరిసే ఇత్తడి లైసెన్స్ బిళ్ళ ఎప్పుడూ
అతణ్ణి గాడిదను చేసి భూగోళాన్ని వీపు కెత్తుతుంది!
అతని శ్రమను కరెన్సీతో తూచి
పదినోటు చేతిలో పెడతానా -
'నా కష్టం ఐదు రూపాయలే సార్' అంటూ
సత్యహరిశ్చంద్రుడిలా సమాధానమిస్తాడు
ఎనౌన్సర్ గొంతు రైలు ఆలస్యన్ని పలికినప్పుడు
స్టేషన్ ముందుండే రావిచెట్టు కింద కూర్చుని
చేతిమీద కాయలు కాసిన జీవితాన్ని తడుముకుంటాడు
బీడీముక్కల వెచ్చదనాన్ని గుండె నిండా పీల్చుకుని
పొగలు పొగలుగా ఆలోచన్లోకి వెళ్ళి
రోగిష్టి భార్య మందుల ఖర్చును వెదుక్కుంటాడు
నేను తిరిగి ఊరెళ్ళేప్పుడు
కుటుంబ సభ్యుడిలా నా వెంట వచ్చి
బండి కదలగానే
చేతిని పచ్చ జెండాలా పైకెత్తి వీడ్కోలు చెబుతాడు
అతనీమధ్య ఎందుకో కనిపించట్లేదు
బహుశా వేరే ఊరు వెళ్ళాడనుకున్నాను
కానీ...
అతను మరో లోకం వెళ్ళిపోయాడని తెల్సి
గుండె రైలు పట్టాలకింద నలిగిపోయినట్లైంది!
ఇప్పటికీ
ఆ స్టేషన్‌లో దిగితే చాలు
అతని కరస్పర్శకోసం నా సూట్‌కేస్
పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది
నేను వచ్చిన పని మర్చిపోతాను.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి