బతుకుతడి
ప్రతి సాయంత్రమూ
గోదావరి భుజమ్మీద చెయ్యేసి నడుస్తూ
నేనో తెరిచిన పుస్తకాన్నవుతాను
ఈ మెత్తటి ఇసుకమేటలమీద పడుకుని
"బాగా చదువుకోరా నాయనా" అంటూ
తడికళ్ళతో దీవించి పంపిన
అమ్మ ఒడిని జ్ఞాపకం చేసుకుంటాను
నా అల్లిబిల్లి భావాలకు
అక్షర రూపం పేర్చుకోవడం రానప్పుడు
ఈ గోదావరే నా చేత కవిత్వాన్ని ఓనమాలుగా దిద్దించింది
భరించలేని ఏకాంతాన్ననుభవిస్తూ
దుఃఖంతో చెక్కిళ్ళు తడైనప్పుడు
గాలి అలల్ని చేతులుగా చాచి
నా కన్నీళ్ళు తుడిచి, ధైర్యాన్ని నీటి తుంపరులుగా చిలకరించింది
గోదాట్లో ఈతకొడుతుంటే
పసితనంలో అమ్మకాళ్ళమీద బోర్లా పడుకొని
స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది
వర్షాకాలంలో
వరదతో పరవళ్ళు తొక్కుతూ
ఆగ్రహావేశాలతో పరిగెత్తే గోదావరిని చూస్తే
బడికెగ్గొట్టి బెచ్చాలాడుకుంటున్నప్పుడు
కోపంతో ఎరుపెక్కిన నాన్న కళ్ళు గుర్తొస్తాయి
ఇక్కడ గవ్వల్నీ, శంఖాల్నీ ఏరుకుంటున్నప్పుడల్లా
చిన్నప్పటి అష్టాచెమ్మలు
జంగందేవర కొమ్ములూర ధ్వనులూ
ఈ గవ్వల్లోంచి
కన్పించినట్టు, విన్పించినట్టు అనిపిస్తుంది
శీతాకాలం రాత్రి
ఆకాశం పెళ్ళికొడుకు దోసిళ్ళలోంచి జారవిడిచే
ముత్యాల తలంబ్రాలు పోయించుకుంటున్న పెళ్ళికూతురై కన్పించి
తెల్లారేసరికల్లా
లేతకిరణాల వెచ్చదనంలో
కురులారబెట్టుకుంటున్న పెద్దముత్తైదువలా దర్శనమిస్తుంది
వేసవిలో ఒళ్ళంతా ఇసుకమేటలై
ఏడుకొండలవాడికి తలనీలాలర్పించి
లడ్డూలకోసం క్యూలో నిల్చున్న బోడిగుండ్ల వరసలా కన్పిస్తుంది
శరద్రాత్రి వెన్నెల్లో
గౌతముడు పిండి ఆరేసుకున్న ధవళవస్త్రం
ఈ గోదావరి
'గోదావరి తల్లికి గొజ్జంగి పూదండ' అంటూ
జీవనరాగాల్ని కూడాదీసుకున్న సరంగు గొంతు
పడవపాటై సాగిపోతుంటే
నా మనసు తెరచాపలా ఎలుగెత్తుకుంది
ఇప్పుడు గోదావరంటే
ఒక్క నది మాత్రమే కాదు
నాలోంచి ప్రవహించే ఒక జీవరహస్యం
నన్ను దున్ని నాలో కవిత్వాల్ని పండించే
నీటి సేద్యకాడు
ఇప్పుడు గోదారంటే
నన్ను నిలువునా ముంచేత్తే బతుకుతడి.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి