31, ఆగస్టు 2009, సోమవారం

The Lake of Nature

ఆలోచనలు

రాత్రిని కౌగలించుకోగానే

నేను

నీళ్ళల్లో నిద్రిస్తాను

చేపా చేపా

నా రెప్పలెత్తవూ...

సంఘర్షణల మధ్య

చీకటి నోరు విప్పగానే

నేను

చెట్టుబెరడులో మూగబోతాను!

పిట్ట పిట్టా

మాట నేరపవూ...

మనిషి కోరిక

మృగ దాహమవ్వగానే

నేను

అరణ్యంలోకి పరిగెడతాను !

అరణ్యమా అరణ్యమా

నాలో పచ్చదనాన్ని పూయవూ...

కాలుష్యాల తాకిడికి

నేల గాయపడగానే

నేను

ఆకాశంలోకి నడుస్తాను !

ఆకాశమా ఆకాశమా

నన్ను మేఘాన్ని చేయవూ...!

నన్ను ఏదో ఒకటి చేసి

ఈ ఎడారితనంలోంచి

ఒక్కసారి ప్రకృతి జలాశయంలోకి విసిరెయ్యరూ...

Read more...

27, ఆగస్టు 2009, గురువారం

సముద్రాల్ని మోసే కళ్ళు

కాలం ఒక గూఢాచారి

రాత్రి పగలుగా రూపాన్ని మార్చుకుంటూ

నిరంతరాన్వేషణ సాగిస్తుంటుంది

దిక్కుల మధ్య పరచుకున్న భూమి కాన్వాసు పై

కొన్ని జీవితాలు విషాదంగా వొలికిపోతుంతయి

ఏ విషాదం ఏ గాయానిదో?

గాయానికి దయలేదు

పొరలు పొరలుగా చిట్లుతూ బతుకును భయపెడుతుంది

ఇక్కడ బ్రహ్మడి బతుకు ఈ గాయం

రంగు రంగుల భవిష్యత్తును

జంధ్యప్పోగుతో ఉరితీసి చంపే చట్టాలు

వల్లకాటి దారిలోనూ కత్తులు పేర్చుతాయి

చిరిగిన పంచెను జీవితంగా కప్పుకున్న విభూతి ముఖాలు

చిగురునవ్వును మొలకెత్తడం మర్చిపోతాయి

ఈ కళ్ళు సముద్రాల్ని మోయ్యడానికే పుట్టాయేమో!



వడ్డించిన విస్తరిలాంటి ఆలయభూములు

చడీ చప్పుడు లేకుండా స్వాహా చేసి

ఎంగిలి మెతుకులు విసిరే ప్రభుత్వాలు

అర్చకత్వాన్ని యాచకత్వంగా మారుస్తాయి

మూల విరాట్టులు మౌనాన్ని వీడవు

పూజారి శోకం గర్భగుడి దాటదు



బ్రాహ్మడుగా పుట్టడం నేరమైన దేశంలో

కొసదాకా బతుకు లాగటమే

ఆవలి తీరం చేరేందుకు అవిటివాడు నదిని ఈదటమే

అడుగడుగునా పేర్చిన నిచ్చెనలెక్కుతూ

వెనుకబడ్డ వాళ్ళాంతా ముందుకెళ్ళిపోయారు

ముందరివాడు మంత్రాల కింద నలిగి

వెంక్కి రాలేక, ముందుకు పోలేక

బతుక్కి దూరమౌతున్నాడు!

Read more...

24, ఆగస్టు 2009, సోమవారం

ఒకానొక సందర్భం

ఇద్దరం కలిసే వున్నాం

మౌనంగానో, మాటలుగానో

ఒకర్నొకరం పలకరించుకుంటూనే వున్నాం

హృదయాలే ఒక్కటవ్వట్లేదు

నా అభిరుచికి ఆమె దూరంగా వుండటమో

అమె ఆంతర్యానికి నేను దగ్గర కాలేకపోవడమో..



ఒక్కోరోజు

ఆమె మాటలు ముక్కలుగా విరిగిపోతుంటాయి

విడగొట్టడానికి వీల్లేని మాటలు నావి

అర్థం చేసుకునే ప్రయత్నంలో

ఆమె మాటలన్నీ మల్లెపూలలా ఏరుకుంటాను



ఆ మధ్య... కాలం వెంట పరిగెడుతూ

కొన్నాళ్ళు ఆమెకు ఎడబాటు కల్పించాను

తిరిగి వచ్చి చూస్తే

గుమ్మమ్ముందు ఎదురుచూపుల కొత్త సందర్భం

ఆమె పెదాలపై చిరునవ్వు పండుతోంది

ఆమె మాటలు స్పష్టంగా, అర్థవంతంగా

హృదయోల్లాస వ్యాఖానమంత సరళంగా -

ఇక మల్లెపూలు ఏరాల్సిన అవసరంలేదు



నిజమే... ఎవరన్నారో గానీ

దూరమై, మళ్ళీ దగ్గరయ్యాక

పొందే అనురాగమే అసలైన ప్రేమ


(26.12.2000, వేకువఝాము)

Read more...

20, ఆగస్టు 2009, గురువారం

పునరావృతం

ప్రతిరోజు ఇదే అనుభవం

పొద్దువాలేలోపు గాయపడటం

రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడం



సన్నివేశ పునరావృత పరంపరలో

గొంతెత్తి ప్రశ్నిచే సందర్భముండదు

రుతువులు భ్రమణ సూత్రాన్ని వల్లిస్తూ

ఎదురు చూపుల నమ్మకంపై

ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి

ముఖాలు మౌనాన్ని తెరలు దించుకొని

ప్రాణం వూడిన తంత్రీ వాద్యాలవుతాయి

విరిగిన భుజాల మీంచి నడిచే విషాదం

సాముహిక దుఃఖమై స్రవిస్తుంది

ఉదయాలు గాయపడకుండా అడ్డుకోలేవు

ఏ రాత్రీ గాయానికి పూత మందు కాలేదు



ప్రతి రోజు ఇదే అనుభవం

పాత గాయాలను ఓదార్చుకుంటూ వెళ్ళి

మళ్ళీ పొద్దువాలే లోపు గాయపడటం

రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తుడుచుకోవటం



సుప్రభాతం విక్లీ 25.08.2001

Read more...

17, ఆగస్టు 2009, సోమవారం

చెక్కిలి మీద జ్ఞాపకం

ఈ రాత్రి నిశ్శబ్దంగా వుండదు

చెవిని తొలిచే కీచురాళ్ళ ధ్వని

ఆలోచనకు రెక్కలు తొడగకా మానదు

ఇప్పటికెన్ని ఆలోచనలు

గాజుబొమ్మల్లా పగిలి పోయాయో

టార్చిలైటును ఆర్పివెలిగిస్తూ

రాత్రిని పరిశోధిస్తున్న మిణుగురుకు తెలుసు

పదునెక్కిన ఆలోచనల ముల్లుగర్రలు

మానుతున్న గాయాలను మెల్కొల్పుతుంటాయి

గాయాలు జ్ఞాపకమై సలిపినప్పుడల్లా

హృదయంలో కత్తిదిగిన బాధ...

అర్ధరాత్రి దాటాక

కునుకుపట్టని కళ్ళు నేరేడు పళ్ళవుతాయి

నరాలు కాలుతున్న కరెంటు తీగలౌతాయి

గుడ్లగూబ గొంతు విని

చంద్రుడు మబ్బు దుప్పటి కప్పుకుంటాడు

నేను మాత్రం

జ్ఞాపకాల లోయల్ని తొవ్వుకుంటూ

ఏ మూడో ఝామునో

స్వప్నంతో నిద్రను వెలిగించుకుంటాను.



తెల్లారి చూస్తే

జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తుంది

అద్దానికి ముఖాన్ని చూపగానే

చెక్కిలి మీద చారికై నిలిచిన జ్ఞాపకం

మళ్ళీ ఆలోచనల్నిరేపి

నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తుంది.


(విజేత దినపత్రిక, 18.03.2001)

Read more...

13, ఆగస్టు 2009, గురువారం

బాధోపనిషత్

దేవుడా!

వేదాలను నేనే కనుగొన్నాను

స్వరాలను నేనే సృష్టించాను

యాగానికి నేనే ఆయువు పోశాను

హోమ జ్వాలలో నేనే హవిస్సునయ్యాను

నిన్ను దేవుడ్ని చేశాను, నేను దరిద్రాన్ని మోశాను



ప్రభూ!

అభిషేకాలతో నిన్ను శుభ్రపరిచాను

అర్చనలతో నిన్ను అలంకరించాను

నైవేద్యాలతో నిన్ను తృప్తిపరిచాను

కల్యాణ వేడుకలతో ఊరేగించాను

నువ్వు మోసం చేశావు, శోకం మిగిల్చావు



భగవాన్!

అష్టోత్తరాల్ని నేనే సమకూర్చాను

సహస్రనామల్ని నేనే మాలగా గుచ్చాను

షోడషోపచారాల్ని నేనే సిద్ధం చేశాను

అట్టహాసంగా పట్టాభిషేకం జరిపించాను

నిన్ను హృదయపీఠం పై నిల్చాను, నువ్వు గుండెల మీద తన్నావు



స్వామీ!

నిన్ను స్మరిస్తూనే బాధల్ని మోశాను

నిన్ను ధానిస్తూనే కష్టాల్ని గడిపేశాను

ఏ మబ్బురధంలో దాగున్నావు ప్రభూ!

ఇప్పటికీ నేను నిరీక్షించే చకోరపక్షినే

నువ్వు వానచినుకెప్పుడౌతావో మరి



(12.1.2002, ఉదయం 9:40)

Read more...

10, ఆగస్టు 2009, సోమవారం

మరణాన్ని ప్రశ్నించే వీరుడికి

ఇక్కడెవ్వరూ క్షేమంగా లేరు

గోముఖ వ్యాఘ్రాల దాడిలో

జీవితం కన్నీటి సముద్రమైంది

నల్దిక్కులా

ఆవులించే మృత్యుముఖాలు

కన్రెప్పల మధ్య

చూపుల్ని గాయపరిచే సంక్షోభం

గొంతు నులిమే చీకట్లో

ఊపిరాడని ఉద్విగ్నస్థితి

వీధి మలుపు నెత్తురు చారల్లో

పాడెల్ని మోసుకెళ్ళిన పాద ముద్రలు...

వ్రణాన్ని చీల్చే సజీవ దహన వీచికలు



ఇప్పుడది రత్నగర్భ కానే కాదు

శవాల్ని కడుపులో దాచుకున్న స్మశానం!



అడవులంతా భాష్పవాయువు వ్యాపిస్తోంది

ఇక్కడో కన్నపేగు మెలికలు తిరుగుతోంది...!

చిరునామ దొరకని ఎముకల గుట్టల్ని చూసి

ఆగిపోయిన గుండె కదలికలు...


నువ్వొచ్చే దారిలో ఎన్‌కౌంటర్లు పొంచి వుంటాయి!

కత్తుల బోనులుంటాయ్!

కాటికి మోసే చేతులుంతయ్!

జాగ్రత్త సుమీ!

నీ పిడికిట్లోని వసంతాన్ని మాత్రం జారవిడవకు.

Read more...

6, ఆగస్టు 2009, గురువారం

నీటి పడగ

ఉన్నట్టుండి

ఆకాశం మేఘావృత ముఖాన్ని చూసుకోడానికి

భూమిని జల దర్పణంగా మారుస్తుంది

పడగెత్తి నీటిసర్పం నాల్క మీద

ప్రాణాలు పిప్పరుమెంటు బిళ్ళలౌతాయి

కాయ కష్టం కంకులౌతున్న ఉదయాన

పంట ముఖంపై నీటి ముసుగు కప్పే ఉప్పెన

మెతుకుల స్వప్నానికి గుండె కోత విధిస్తుంది

ఎత్తుల్ని కొలిచే అంతస్థులు సైతం

వరద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాయి

ప్రవాహోధృతికి నడుములు విరుచుకున్న వంతెనలు

నీళ్ళలో నానబెట్టిన గుగ్గిళ్ళౌతాయి

తీరం తాకని పడవలు ముక్కలై

చచ్చిన సొరచేపల్లా నీటిపై తేలుతుంటాయి

పక్షులు వలయాలుగా కలియ తిరుగుతూ

జల ఖడ్గపు ఝుళిపింపుకు రెక్కలు తెగి కూలిపోతాయి

వరద వేటుకు విరిగిన తరు సమూహం

చివరిసారి మొదళ్ళకు సాష్టాంగ పడుతుంది

వడుపు తెలిసిన మలుపుల రాణి సుడుల కౌగిలిలో

ఉక్కిరి బిక్కిరిగా నలిగిన రాచవీధులు

లోతు తెలియని కాల్వలౌతాయి

ప్రతీరోజూ ప్రదక్షిణ మంత్రాన్ని ధ్వనించే బస్సులు

డిపోల గూళ్ళలో ముడుచుకున్న చలి రాత్రుల పావురాళ్ళౌతాయి

వాన దేవుడి అజీర్తి రోగానికి భూదేవికి పొట్టుబ్బుతుంది

***


ఈ నీటి పడగ చితికి పోనూ...

ఎండిన గొంతును కబళించే నాల్గు చినుకులతో తడపాల్సింది పోయి

ఆయువును కబళించే జలగండంగా మారింది

వేనవేల కళేబరాల్ని మురికి పొట్టలో కుక్కుకొని

పరిసరాల్ని గుప్పుమనే శవాల వాసన చేసింది

ఇప్పుడు - వానంటే వొట్టి నీటి ప్రవాహమే కాదు

గొంతు బిగించి నిలువునా ఊపిరి తెంపే నీటి మోకు

శరీరాలను నిశబ్ద తీరాలకు తరలించే శవ పేటిక


***


ఎప్పుడూ ఇంతే

మళ్ళీ ఆకాశమ్మీద నిప్పుల కుంపటి మొదలవ్వగానే

వరద నీళ్ళు పారిపోతాయి

కన్నీళ్ళు, కొన వూపిరి శబ్దాలు మాత్రం మిగిలిపోతాయి


(2000 ఆగష్టు రాష్ట్రంలో వచ్చిన వరదలకు స్పందించి)

ఆదివారం ఆంధ్రజ్యోతి
10.09.2000

Read more...

3, ఆగస్టు 2009, సోమవారం

ఏదీ నిజంకానప్పుడు

మీరు అలాగే నవ్వుకోండి

గుక్కతిప్పుకోకుండా ఏడుపు నలాగే కొనసాగించండి

ఏదీ నిజం కానప్పుడు

నవ్వినా ఏడ్చినా ఒకటే కదా!

బ్రతికున్నతనానికి గుర్తుగా

మీరలాగే నిరర్థక సంభాషణ చెయ్యండి

మాట్లాడాల్సిందాన్ని మాట్లాడలేనప్పుడు

నీతైనా, బూతైనా ఒకటే కదా!


***


నిలువునా విలువలు కూలుతున్నా సరే

గజ్జి కుక్కలాంటి వ్యవస్థకు సిగ్గుండదు

ప్రార్థనా మందిరాల ముందు మతంపై కాలు దువ్వి

వివాదాల్ని గొంతెత్తి పిలుస్తున్న మారణాయుధాల్ని

ఏ చట్టమూ నిషేదించదు

పగ తీర్చుకున్న కర్కశత్వం నవ్వుతూనే వుంటుంది

గోడ మీద నినాదాలు రాసి

అజ్ఞాతంలోకి పరుగెత్తే ఉడుకు రక్తాన్ని నమ్ముకుని

రాని వెన్నెల కోసం

పల్లె అమాయకత్వం రెప్ప వాల్చని కన్నౌతుంది

నిండుగా ఖద్దరు కప్పుకున్న రౌడీయిజం

దొంగ గొంతుకతో అభివృద్ధిని వల్లించినందుకు

గొర్రెలు మూకుమ్మడిగా తలలూపుతాయి

నడివీధిలో జరిగిన దారుణ హత్య

ఆత్మహత్యగా రుజువైనందుకు

కోర్టంతా చప్పట్ల హోరుతో మార్మోగుతుంది

ప్రభుత్వ మొక గుడ్డెద్దు

వీరుడి నిజాయితీ అవినీతిగా నిరూపించి, ఊపిరొదిలాక

అమర వీరుడి బహుమతి ప్రకటిస్తుంది



***

జరగరానిది జరుగుతోందని అందరికీ తెల్సు

అబద్ధం నిజమౌతోందని, నిజం అబద్ధమౌతోందనీ తేలుసు

ఐనా నిజంగా మారిన అబద్ధాన్నే గొంతులన్నీ సమర్షిస్తాయి

రాని నవ్వును, లేని ఏడుపును నటిస్తూ

మసి గుడ్డతో ముఖం తుడుచుకోవటం అలవాటైంది



***



నిజాన్ని నిజంగా చెప్పుకోవడంలో తప్పు లేదు

ఈ సమాజం ఒక పిచ్చాసుపత్రి



ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక 26.04.1997

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP