నీటి పడగ
ఉన్నట్టుండి
ఆకాశం మేఘావృత ముఖాన్ని చూసుకోడానికి
భూమిని జల దర్పణంగా మారుస్తుంది
పడగెత్తి నీటిసర్పం నాల్క మీద
ప్రాణాలు పిప్పరుమెంటు బిళ్ళలౌతాయి
కాయ కష్టం కంకులౌతున్న ఉదయాన
పంట ముఖంపై నీటి ముసుగు కప్పే ఉప్పెన
మెతుకుల స్వప్నానికి గుండె కోత విధిస్తుంది
ఎత్తుల్ని కొలిచే అంతస్థులు సైతం
వరద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాయి
ప్రవాహోధృతికి నడుములు విరుచుకున్న వంతెనలు
నీళ్ళలో నానబెట్టిన గుగ్గిళ్ళౌతాయి
తీరం తాకని పడవలు ముక్కలై
చచ్చిన సొరచేపల్లా నీటిపై తేలుతుంటాయి
పక్షులు వలయాలుగా కలియ తిరుగుతూ
జల ఖడ్గపు ఝుళిపింపుకు రెక్కలు తెగి కూలిపోతాయి
వరద వేటుకు విరిగిన తరు సమూహం
చివరిసారి మొదళ్ళకు సాష్టాంగ పడుతుంది
వడుపు తెలిసిన మలుపుల రాణి సుడుల కౌగిలిలో
ఉక్కిరి బిక్కిరిగా నలిగిన రాచవీధులు
లోతు తెలియని కాల్వలౌతాయి
ప్రతీరోజూ ప్రదక్షిణ మంత్రాన్ని ధ్వనించే బస్సులు
డిపోల గూళ్ళలో ముడుచుకున్న చలి రాత్రుల పావురాళ్ళౌతాయి
వాన దేవుడి అజీర్తి రోగానికి భూదేవికి పొట్టుబ్బుతుంది
***
ఈ నీటి పడగ చితికి పోనూ...
ఎండిన గొంతును కబళించే నాల్గు చినుకులతో తడపాల్సింది పోయి
ఆయువును కబళించే జలగండంగా మారింది
వేనవేల కళేబరాల్ని మురికి పొట్టలో కుక్కుకొని
పరిసరాల్ని గుప్పుమనే శవాల వాసన చేసింది
ఇప్పుడు - వానంటే వొట్టి నీటి ప్రవాహమే కాదు
గొంతు బిగించి నిలువునా ఊపిరి తెంపే నీటి మోకు
శరీరాలను నిశబ్ద తీరాలకు తరలించే శవ పేటిక
***
ఎప్పుడూ ఇంతే
మళ్ళీ ఆకాశమ్మీద నిప్పుల కుంపటి మొదలవ్వగానే
వరద నీళ్ళు పారిపోతాయి
కన్నీళ్ళు, కొన వూపిరి శబ్దాలు మాత్రం మిగిలిపోతాయి
(2000 ఆగష్టు రాష్ట్రంలో వచ్చిన వరదలకు స్పందించి)
ఆదివారం ఆంధ్రజ్యోతి
10.09.2000
1 కామెంట్లు:
yes now i am flooded
bollojubaba
కామెంట్‌ను పోస్ట్ చేయండి