ఒక ఒయాసిస్సు కోసం
నేను పుట్టింది మొదలు
ఈ దుఃఖం అజ్ఞాత శత్రువై వెంటాడుతూనే ఉంది!
ఆశల్ని మీటుకుంటూ
వెన్నెల వసంతాన్ని స్వప్నించి, స్వప్నించీ
నిరాశల ఊపిరి సెగల మధ్య
దగ్ధానుభూతికి లోనౌతాను !
***
అమ్మ ఒడిలో
వెండిగిన్నె పాలబువ్వ గోరుముద్దలకు, ప్రేమ ముద్దులకూ,
నాన్న వీపు నెక్కి
'చెల్ చెల్ గుర్రం - చెలాకి గుర్రం' ఆటల సరదాలకూ
కుప్పతొట్టి సాక్షిగా పెట్టి పుట్టని జీవితం నాది..!
మీ లాగా
నా బాల్యం బంగారు మొలతాడు కాదు
ముఫ్పై వసంతాలు విరబూసినా
మూడుముళ్ళకు నోచుకోని అక్కబోసి మెడను
ఉరితాడు కౌగలించుకున్న కన్నీటి దృశ్యం నా బాల్యం...!
మీరనుకున్నట్టి నా యౌవ్వనం
ఇందిరాపార్కు గుబురు పొదలమధ్య
వెచ్చని కౌగిళ్ళపరువపు గుబాళింపు కాదు
పగబట్టిన ఎన్‌కౌంటర్ నీడలో
గురి తప్పని తూటాకు బలైన తమ్ముడి శవాన్ని
కాటికి చేర్చేందుకు దారిచూపిన నిప్పుకుండ నా యవ్వనం
***
రెప్ప విప్పింది మొదలు
కంటి గూట్లోంచి ఎన్ని కన్నీటి పిట్టల్ని జారవిడిచానో
చిట్లిన జ్ఞాపకాల గాజు ముక్కలకు తెలుసు..!
ఈ ఎండిన గుండెను
ఏ మేఘ శకలమూ చినుకు వేళ్ళతో స్పృశించదు...
ఎడారి అనుభవాల మధ్య
ప్రశ్నార్థకమైన శేష జీవితాన్ని భుజాలకెత్తుకుని
ఇసుక గుండెలోని తడిని పరితపిస్తూ
నా దేహాన్నంతా చూపుగా మార్చుకున్నాను!
కాలిపోతున్న రాత్రింబవళ్ళ మధ్య
శూన్యాన్ని శోదిస్తున్న ఓ ఖర్జూర వృక్షమా ! ఇక్కడెక్కడా
పక్షుల జాడ కంపించదేం...!!
5 కామెంట్‌లు:
ఏమని స్పందించను? అంతాకాకపోయినా.. నాలోని కొంతభాగాన్ని కవితా దర్పణంలో ఆగి ఓసారి పరికించినట్టుంది.
O images thy name is poetry. isnt it?
బాబాగారు,
I would slightly disagree with you and answer "It is not". :-)
"ముఫ్పై వసంతాలు విరబూసినా
మూడుముళ్ళకు నోచుకోని అక్కబోసి మెడను
ఉరితాడు కౌగలించుకున్న కన్నీటి దృశ్యం నా బాల్యం...!"
ఇది పదచిత్రమా? కాదు, పదునైన చిత్రం. అలసలిది చిత్రమే కాదు. ఒక దుఃఖ తరంగం.
"గురి తప్పని తూటాకు బలైన తమ్ముడి శవాన్ని
కాటికి చేర్చేందుకు దారిచూపిన నిప్పుకుండ నా యవ్వనం"
మరి ఇదో? నగ్నంగా కళ్ళెదుట కనిపిస్తున్నట్టుంటే ఇది చిత్రమెలా అవుతుంది?
"చిట్లిన జ్ఞాపకాల గాజు ముక్కలకు తెలుసు..!"
ఆ గాజుముక్కలు నాలోపలే ఎక్కడో చిట్లిపోయి గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటే దీన్ని image అని నేనెలా ఒప్పుకుంటాను?
వట్టి చిత్రాలు కవిత్వం కాలేవు. గాఢమైన ఉద్విగ్నమైన అనుభూతి అణువణువూ నిండినప్పుడు అప్పుడు అప్పుడే చిత్రాలు కవిత్వం కాగలవు. అది మీకు తెలుసని నాకు తెలుసు :-)
ఇన్నాళ్ళూ ఇక్కడ కవిత్వాన్ని నిశ్శబ్దంగా నాలో ఇంకించుకుంటూనే ఉన్నాను. వ్యాఖ్య పెట్టానో లేదో గుర్తులేదు. ఇక్కడ వ్యాఖ్యలు అప్రస్తుతమైపోతాయి, అసందర్భమైపోతాయి. అది తెలిసినా ఇప్పుడెందుకో అసంకల్పితంగా గొంతు పెగిలింది. సాయిప్రసాద్ గారు, నన్ను మన్నించండి.
భైరవభట్ల గారు,
fraility thy name is woman అన్న షేక్స్పియర్ మాట గుర్తుకుతెచ్చిందేమో నా కామెంటు కొంపతీసి,కదూ. :-)
ఇక మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఇవన్నీ ఉత్త పదచిత్రాలు కావు, పదునైన జీవనచిత్రాలు. పదలమాటున కనిపించేది అర్ధాలు కావు, జీవితం.
బహుసా ఇమేజెస్ అన్న ఒక్కమాటే వాడటం వలన నేచెప్పదలచుకొన్న విషయం పలచనైనదనిపించింది.
కవిత్వంలో ఉద్యమాల ఘోషలవల్ల, అనిబద్ద కవిత్వం వ్రాసే సంగుభట్ల వంటి గొప్పకవులను తెలుగు లోకం సరిగా గుర్తించలేదని నేనిదివరలో ఎక్కడో అన్నాను.
ఒ పదిహేనేళ్లక్రితం క్రితం నేనూ దళితుడినే అన్న కవిత పత్రికలో చదివి , ఈ పేరు నా మనసులో ముద్రించుకుపోయింది. మరలా ఈ యన కవితలు నాకెక్కడా తారసిల్లలేదు. మరలా ఇలా బ్లాగ్ముఖంగా కలుసుకోవటం ఆనందంగా అనిపిస్తుఉంది.
thank you for sharing
bollojubaba
నేను ఇంతకు ముందు మరో పోస్టులో ఇలా కామెంటు చేశాను.
"సాయిప్రసాదు గారూ మీకో నమస్కారం. కాగితాలు వేదనతో నింపగలరు. కవితలు చదివి, అది బాగుందని చెప్పి, భావాన్ని అవమానించలేక, అది పలికే వేదననుభవించి గాయపరిచిందని చెప్పలేక.. ఏం చెప్పాలో తెలియక ఇప్పటి వరకు మీ కవితలకు ఏ వ్యాఖ్య చేయలేదు. మీ గుండెకు గుచ్చుకున్న ముళ్ళను ఇలా కాగితంమీద గులాబీలుగా పూయిస్తున్నారు. అభినందనలు. సంగుభట్లవారి వేదన వనంలో నేనో పదచారిని."
ఇప్పటికీ నాది అదే సందిగ్ధము... వీరి కవితలు చదివిన ఒకటి రెండురోజుల వరకూ ఆ పదాలు వెంటాదుతూనే ఉంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి