గాయపడ్డ గుండెకేక
బతకాలి కదా!
కరువు కుండకు పడ్డ చిల్లికి
ఒక్క ముద్దైనా అడ్డుపెట్టాలి కదా
బతకడం చావుగా మారినప్పుడు
ఈ యజ్ఞోపవీతం, రెండో జన్మా
శిశిరాన్ని మూటగట్టే శాపాలే మరి
తెల్లారగట్ల గుడిమైకులో
గొంతు చిరిగిన మేల్కొల్పులమైనా
మా బతుకుకు సుప్రభాతముండదు
సాయం సంధ్యల్లో దీపాలమై వెలిగినా
ఏ దేవుళ్ళకూ మాపై దయచూపే తీరికుండదు
మా విజ్ఞపన పత్రాలు అందుకోగానే
నాయకుల కళ్ళు చూపుల్ని కోల్పోతాయి
మా బాధోపనిషత్తు వినాలంటే చాలు
చట్టం చెవిలో కర్ణభేరి మాయమౌతుంది
ఇన్నాళ్ళూ
మా నెత్తిన శఠకోపురం పెట్టి
దేవాలయ మాన్యాలను ధర్మకర్తలు భోంచేస్తుంటే
పెచ్చులూడిన ధ్వజస్థంభాల మౌనమయ్యాం
మా ఫాలభాగంపై పంగనామం పెట్టి
కానుకలు కాజేస్తున్న కార్యనిర్వాహకుల ముందు
నిర్లిప్తాన్ని ప్రదర్శించే ఉత్సవ విగ్రహాలమయ్యాం
అమ్మవారి నగలు అదృశ్యమైన రాత్రి
మీ అనుమానం చండ్రకోలై మా వీపుల్ని చీరితే
అవమానం శూలానికి గుచ్చబడ్డ మాడవ్య మునులమయ్యాం
రంగనాయకస్వామి రక్షకుడైన నేలపై
మా ఆడోళ్ళమానం మంట గలసినప్పుడు
ఊరు ఖాళీ చేసిన కన్నీటి నిర్వాసితులమయ్యాం
ఇవాళ
మేం అవమానాలకు చిరునామగాళ్ళం
ఆర్థికంగా చితికి ఆకలితో అణిగిపోతున్న వాళ్ళం
వృత్తికీ, ఉద్యోగాలకీ రెంటికీ చెడ్డ రేవళ్ళం
దర్శనమౌతున్నా నిదర్శనం ముఖ్యమనుకుంటే
కులాలవారీగా ఆకలి పోటీలు పెట్టి
గెలిచిన వాళ్ళకే రిజర్వేషన్ బహుమతి ప్రకటించండి
అయ్యా! నాయకుల్లారా!
మేమిప్పుడు అగ్రహారాలను అడగటం లేదు
దేవాలయ మాన్యాలను మళ్ళీ తెచ్చిమ్మనటం లేదు
కంకణాలడగటం లేదు. గండపెండేరాలడగటం లేదు
మా వెనుకబాటుతనం ముఖమ్మీద కూడా
ఒక్క రిజర్వేషన్ ముద్ర కొట్టించమంటున్నాం
అందాక
మేం అభిషేకాలమై స్రవించిపోతాం
కర్పూరహారతులమై మండిపోతాం
పొట్ట నింపని పౌరోహిత్యాలమై కాలిపోతాం, కాని
మేం గుండెమండిన పరుశురాములం కాకముందే
మా బిడ్డల చీకటి భవిష్యత్తులోనైనా
ఒక్క వెలుగు శాసనం లిఖించిపోండి!?
(ప్రకృతి సాహితి, సెప్టెంబరు 2001)
3 కామెంట్‌లు:
చాలా చక్కగా వ్యక్తపరిచారు. అభినందనలు
బాగుంది. కానీ అగ్రకులమంటూ అగ్రతాంబూలమిచ్చినంత మాత్రాన కడుపునిండదని వారికి తెలియదంటారా?
చాలా బాగా చెప్పారు. ఆకలితో మిగిలినవాడూ, కడుపు రగిలినవాడూ ఇద్దరూ కలిస్తేగానీ సమస్య తీరదు. ఆ ఎరుక రానంతవరకూ పరిస్థితి మారదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి