2, జులై 2009, గురువారం

ప్రియమైన తమ్ముడికి

నిజమే !

బాధ నాదైనప్పుడు

అది నిజమో కాదో నీకెలా అర్థమౌతుంది !

ఆకలి అగ్నికీలల్లో దహించుకు పోతున్నా

అహంకారాన్ని వదులుకోలేని సంస్కృతి మీదే కదా

నేనూ ధ్వజమెత్తింది !

తర తరాల చరిత్ర పరిణామ క్రమంలో

ఉద్యమమెప్పుడూ నాగరాజు కోరల్లో నీరు కారలేదు !



***



మారుతున్న కాలంతోపాటు

కొత్తనడకనీ నేర్చుకోవాలి తమ్ముడూ !

నీ నడకని విరుస్తున్న వాళ్ళ

నడ్డి విరగ్గొడదామనే నేనంటున్నది...

కుల మంటల్లో వూళ్ళని మసిచేసి

కాలువల్లో శవాల చిరునామాల్ని తొక్కేసిన

కండకావరం ముఖమ్మీద

ఎవరైనాసరే, కాండ్రించి ఉమ్మాల్సిందే !

ముద్దుకృష్ణ మతాహంకార సంకలనంలో లేనంత మాత్రాన

మహాకవి వైతాళికుడు కాకుండా పోతాడా ?

నీకు నాకూ మధ్య ద్వేషమే లేదిక !

కరిగి కన్నీరైన గుండెల్ని పరామర్శించి

మన మధ్య పెరిగిన శతాబ్దాల అగాధాల్ని పూడ్చుదాం

మనిషిగా బ్రతకడానికి

ఇద్దరం కలిపే నడుద్దాం రారా! తమ్ముడా!

గుండెల్నిండా ప్రేమ నింపుకుని

ఇప్పుడు బయలుదేరింది నీ ఇంటికే!

నీతో కలిసి ఉద్యమించడానికి

గొడ్డుమాంసంతో అన్నమే పెట్టక్కర్లేదు

నాకీ గోంగూర పచ్చడే చాలు

అల్లుకున్న అభిమానంతో

గ్లాసుడు మంచినీళ్ళిస్తే చాలు

అయినా

ఇప్పుడు ఏ తిండి తినాలనేది ప్రశ్న కాదు

ఏ తిండి లేని వాడే ప్రశ్న...



(పగడాల నాగేందర్‌కి)

2 కామెంట్‌లు:

Afsar 3 జులై, 2009 3:35 AMకి  

dear saiprasad:

pagadaala ekkadunnaadu?

meerelaa vunnaaru?

ee kavita baagundi. kaani, bayata yekkadannaa publish ayite koodaa baaguntundi.

email ivvandi

afsar (afsartelugu@gmail.com)

Kathi Mahesh Kumar 16 జులై, 2009 8:37 PMకి  

దళితుడు చెయ్యి అందిస్తూనే ఉన్నాడు
"అణగారిన ప్రతొక్కడూ దళితుడే" అని చెబుతూనే ఉన్నాడు
"కలిసిపోరాడుదాం!" అంటూనే ఉన్నాడు
కానీ...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP