29, జూన్ 2009, సోమవారం

కర్ణుడి చిరునామా!

మిరెప్పుడైనా

చీకటి పాటలు విన్నారా?

అశ్రుకణాల్ని చూశారా

లేత దుఃఖాన్ని పలకరించారా?

మీరు

పలరాతి సౌధాల్లో

జీవితాన్ని ఉయ్యాలలూపుకుంటూ

సుఖాల ముసుగుల్లోంచి దుఃఖాల్ని ప్రదర్శించేవాళ్ళు కదా !

దయచేసి వీళ్ళ బాల్యాన్ని గాయపరచకండి !

వీళ్ళసలే

చీకటి రాల్చిన మొక్కలెరుగని పువ్వులు

అక్టోబరు రెండోరోజో

ఆగష్టు పదిహేనోనాడో

నలగని ఖద్దరు టోపీలు

పేపర్లలో ఫొటోలకోసం పంచే బన్నుముక్కలే

ఈ ఆకలి కడుపులకి

ఒకింత ఊరటనిచ్చే పరమాన్నాలౌతాయి !

మత్తుతెలియని రాత్రుల్లో

విశృంఖల కౌగిళ్ళ మధ్య నలిగిన మల్లెపూలూ

వీళ్ళ చిరునామాలు చెప్పలేవు

ఊహ పెరిగేకొద్దీ

భవిష్యత్తును చంపే ఆలోచనల మధ్య

వీళ్ళ బ్రతుక్కి దారేదీ?

రైల్వేప్లాట్‌ఫారాల్లోనూ, బస్టాండుల్లోనూ

పలక ఫోటోలై వేలాడాల్సిందేనా?

చరిత్ర తిప్పితే

ఇలాంటి వెలుగు పూలకు

సంఘం పొత్తిళ్ళలో బహిస్కరణలెన్నో

చేతికున్న వేళ్ళేం చెబుతాయి!

స్వగతాల నేపధ్యంలో

అమావాస్య కరిగించిన స్వప్న పత్రాలివి

కనుబొమ్మలమధ్య ఉదయించే

ఈ సందిగ్ధ సంధ్యలకు సమాధానమేదీ...?

మళ్ళీ...

ఎక్కడో కేర్ మంటున్న శిశువు తొలి ఏడుపు...

ఈ కర్ణుడెవ్వడో...?

4 కామెంట్‌లు:

అజ్ఞాత,  29 జూన్, 2009 4:29 PMకి  

ఇప్పుడు మీరు వాళ్ళ పేదరికాన్ని చులకన గా చూస్తున్నారా
లేకపోతే వాళ్ళు పుట్టడమే ఒక భారం అని మీ భావమా?

ఆత్రేయ కొండూరు 29 జూన్, 2009 8:14 PMకి  

అజ్ఞాత గారూ.. కవితను మరోసారి చదవండి. మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.

సాయిప్రసాదు గారూ మీకో నమస్కారం. కాగితాలు వేదనతో నింపగలరు. కవితలు చదివి, అది బాగుందని చెప్పి, భావాన్ని అవమానించలేక, అది పలికే వేదననుభవించి గాయపరిచిందని చెప్పలేక.. ఏం చెప్పాలో తెలియక ఇప్పటి వరకు మీ కవితలకు ఏ వ్యాఖ్య చేయలేదు.

మీ గుండెకు గుచ్చుకున్న ముళ్ళను ఇలా కాగితంమీద గులాబీలుగా పూయిస్తున్నారు. అభినందనలు. సంగుభట్లవారి వేదన వనంలో నేనో పదచారిని.

రాధిక 29 జూన్, 2009 8:38 PMకి  

ఆత్రేయ గారూ చాలా బాగుందండి.మారిన మీ గళం చాలా నచ్చింది.మొదటి వ్యాఖ్యలోలా నాకు నెగెటివ్ అర్ధాలు ఏమీ స్పురించలేదు.

రాధిక 29 జూన్, 2009 9:10 PMకి  

క్షమించాలి.ఆత్రేయ గారు రాసారనుకున్నా.సాయి ప్రసాదు గారూ అద్భుతం గా చెప్పారండి.

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP