అగ్నిస్తంభం
అప్పుడు మంటకి అర్థం వేరు
***
యంత్రాలూ వ్యూహాలు అపహాస్యానికి గురై
మనిషి మేధస్సు అపనత పతాకమైంది
అగ్నిని దహించే బ్లో-అవుట్ ముందు
సూర్యుడు ఓడిపోయిన సైనికుడై
మబ్బుల పరదాల వెనుక ముఖాన్ని దాచుకున్నాడు
పొగ మంటల మధ్య
పచ్చదనం కోల్పోయిన కొబ్బరి చెట్లు
ఆకాశాని కంటించిన అస్థిపంజరాల్లా ఉన్నాయి
గూడు కాలిన పక్షులు
గమ్యాన్ని వెదుక్కుంటూ మౌనంగా వలస పోతున్నాయి
మంటలు ప్రతి ఫలించే పంటకాల్వ
కళింగ యుద్ధానంతర రక్తపుటేరులా ఉంది
నిజానికి ఈ బ్లో-అవుట్
భూమ్యాకాశాలను కలిపే అగ్ని స్తంభంలా వుంది.
***
మంట్ మనిషికెప్పూడూ శత్రువే !
***
ఈ దేశంలో మంటల్లేని దెప్పుడు..?
కులాలు మంటలై -
మతాలు మంటలై -
ఆకలి కడుపులు మంటలై -
శతాబ్దాల తరబడి దహిస్తూనే ఉన్నాయి
మంటలు
మా పుట్టుకకీ చావుకీ మధ్య
బతుకు తాడును పేనుతున్నాయి
మమ్మల్ని జంతువుల్ని చేసి
రింగ్ మాస్టర్లయి ఆడిస్తున్నాయి
మంటలు మాకేం కొత్తకాదు
కాకపోతే
ఇప్పుడు బాధంతా
ఊరు ఖాళీ చేసిన పత్రి నిర్వాసితుడి గుండే
ఒక మండుతున్న బ్లో-అవుట్ అయిందనే..!
(జనవరి 20, పాశర్లపూడి బ్లో-అవుట్ దృశ్యం చూశాక)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి