నిశ్శబ్దాలు వెదజల్లబడ్డ చోట
అనుకుంటాం కానీ
మనిషిని ప్రేమించడమే కష్టమైన పని
సమాధులపై విశ్రమించే మనకు
జలపాతంలా పరిగెత్తటం తెలీదు
కాలాన్ని నిముషాలుగా తెంపుకుంటూ
గాయాల మీద జాలి దుప్పటి కప్పేందుకు వెనుకాడుతాం.
రెటీనాపై ప్రతిఫలించిన వాస్తవం
స్వప్న ఫలితంలా సందేహాస్పదమై
మెదడును వురితాడులా మెలితిప్పుతుంది
కరచాలనం చేసిన చేతులు
పలచబారుతున్న విలువల పరదాల వెనుక
హఠాత్తుగా కత్తిదూయటం కొత్తమలుపవుతుంది
పసితనం పచ్చనోటై చేతులు మారాక
బాల్యమంటే శోకగ్రస్థ శాపదశని కాక
తెలుగు వాచకంలో దాచుకున్న
నెమలి పింఛమని ఎలా చెప్పగలం?
మౌనాన్ని పరుచుకున్న వీధి గుండెలో
మృత్యుపాతర దాగుందని ఎలా ఊహించగలం?
ఈ ఘడియలో
ఏ అడుగులు నడకను తెంపుకోనున్నాయో..
నెత్తుటి తీగలమీద రెక్కలు తెంచుకున్న చిలుకలు
మరణాన్ని ప్రేమిస్తూ, మనిషిని ద్వేషిస్తున్నాయి.
ఇన్ని అధివాస్తవిక రూపాల మధ్య
ఒక్క దేహాన్నైనా మనిషిగా నిలబెట్టాలి
ఈ చర్య చివరిదశ చేరేలోపు
నిశ్శబ్దాలు వెదజల్లబడ్డ చోట
ఏ శరీరమూ
మారణాయుధంగా మొలకెత్తకుంటే చాలు
(07.06.2001)
3 కామెంట్‌లు:
ఈ కవిత తిరగ వ్రాస్తే మారణాయుధంగా మారిన మనిషిలో ప్రేమనే రసాయనిక చర్య జరగటానికి విశ్వశాంతి అన్న ఉత్ప్రేరకం అవసరం అని పొడిగించాలేమో కదండి?
adbutham
"పసితనం పచ్చనోటై చేతులు మారాక
బాల్యమంటే శోకగ్రస్థ శాపదశని కాక
తెలుగు వాచకంలో దాచుకున్న
నెమలి పింఛమని ఎలా చెప్పగలం"
చాలా బాగుందండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి