8, జూన్ 2009, సోమవారం

ఇదం బ్రాహ్మ్యం

గాయం నాదైనప్పుడు

దాని బాధ కూడా నాదే కదా!

గడిచి పోతున్న రోజులు గుండుసూదులై

నిర్దాక్షిన్యాన్ని కళ్ళలో పొదుస్తుంటే

గుండెపట్టని శోకం

ఎన్నిసార్లు చెరువులై చెక్కిళ్ళ మీదకు జారిందో

తడి ఆరని కన్రెప్పల కొనలకు తెలుసు



మనుగడ చెదిరిన కులవృత్తి నీడలో

బతుకు చిరిగిన బ్రాహ్మణ్యం నాది

శతాబ్దాల శిధిలాల మధ్య

జీవితాన్ని ఆశలుగా విత్తుకొని

విషాదాన్ని ఫలితంగా మోస్తున్న దినచర్య నాది

అగ్రకులం వాణ్ణన్నదీ, కడుపు నిండిన వాణ్ణన్నదీ

ఆ మనుపు నాదీ ఆకలి అగ్నికీలల్లో దహించుకుపోతూ

మృత్యు కోరలకి చిక్కిన ఖాళీ కడుపే...



మెతుకులను స్వప్నించే నా బతుకు ముందు

ఎన్ని ఉదయాలు కన్నీటి చుక్కలై యింకి పోయాయో?

కడుపు నింపని శ్రాద్దాలు పెట్టుకుంటూ

మంత్రాన్ని నమ్ముకున్న వారసత్వం నాది

స్టేషన్లో రైలాగ్గానే

"అపర కర్మలు చేయిస్తారా బాబుగారూ" అంటూ

ప్రయాణికుల్ని చుట్టుకొని

ఎన్ని అవహేళనల్ని బాధతో భరించానో

నా జీవితాన్ని కాటేసిన తెల్లతాచుకు తెలుసు

చిరిగిన పంచె, మాసిన తువ్వాలు

ఉతుక్కోడానికి మారు పంచెలేని

కులాగ్ర పేదరికం నాది.



శరీరాన్ని ధనస్సులా వంచి

తూరుపు కాగడా ముందు చేసిన సూర్యనమస్కారాలూ,

కన్నీటి దోసిళ్ళతో ఇచ్చిన అర్ఘ్య ప్రదానాలు

నా అమావాస్య ముఖంపై

వెలుగును ప్రసరించే చంద్రోదయాలు కాలేకపోయాయి

ఈ మోడ్పు బతుకుపై

కరుణ చినుకును వర్షించేందుకు

ఏ వేద మంత్రమూ మబ్బుతునక కాలేకపోయింది

గడిచిపోతున్న రోజులు గుండుసూదులై

నిర్దాక్షిణ్యాన్ని కళ్ళలో పొడుస్తుంటే

గుండె పట్టని శోకం

ఎన్నిసార్లు చెరువులై చెక్కిళ్ళ మీదకు జారిందో

తడి ఆరని కన్రెప్పల కొసలకు తెలుసు

గాయం నాదైనప్పుడు

దాని బాధ కూడా నాదే

చచ్చాక ఎవరికీ బతుకు లేదేమో కాని

బతికుండీ చచ్చిన వాణ్ని నేను మాత్రమే!


(స్వల్ప మార్పులతో ఆంధ్రభూమి దినపత్రిక, 06.03.1995)

2 కామెంట్‌లు:

Afsar 9 జూన్, 2009 4:12 AMకి  

prasad gaaru:

elaa vunnaaru?

mee kavitwamloni aarti, tapanaa naaku baagaa nacchaayi.

nijamgaa tadi vunna anubhootulu ivi.

astitwa vedanalo meedi sonta gontuka.

afsar

డా.ఆచార్య ఫణీంద్ర 9 జూన్, 2009 6:41 AMకి  

ఎంత చక్కని అభివ్యక్తి !
నిజమే... గాయం ఎవరిదో _ బాధ వారిదే !
ప్రసాద్ గారు ! అభినందనలు !

డా|| ఆచార్య ఫణీంద్ర

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP