వీధి అనాధ కాదు
వీధి యిరుకవుతోంది!
ముక్కలుగా తెగుతూ ఉనికిని కోల్పోతున్న వీధి
ప్రతిక్షణం నన్ను కలవరపెడుతోంది
రెప్పవిప్పగానే మర్చిపోవడానికి వీధి కల కాదు కదా!
ఇది మనసును అల్లుకున్న జ్ఞాపకం తీగ
ఈ వీధి
వేనవేల ఉద్యమాలను భుజాల కెత్తుకొని
నినాదాల ప్రతిధ్వనులతో ఊరేగించింది
తిరుగుబాటు పాటల మధ్య ఎత్తిన పిడికిలై
అధికార దురహంకారానికి చెమటలు పట్టించింది
రాత్రి నిద్రకు దూరమైన నాటక రంగస్థలమై
పోరాట పద్యాల్ని గొంతెత్తి పాడింది
మనుషుల మధో, మనసుల మధో అగాధం ఏర్పడ్డప్పుడు
పల్లెకూ పట్నానికి వీడని దోస్తీ కుదిర్చింది
ఈ వీధి చిన్నప్పటి నా పెద్దబాల శిక్ష
ఎన్నెన్నో అనుభవాల పాఠాలు నేర్పించి
నా కోసం గారడై, కనికట్టై, పిచ్చుకుంట్లకథై
చక్కభజనై, తోలుబొమ్మలాటై, అదై, ఇదై, ఏదేదో ఐ
గుండెపట్టని సంతోషాన్ని పంచిపెట్టేది
కొత్త పుస్తకాలను కొనలేని నా పేదరికాన్ని గుర్తించి
పాత పుస్తకాలను సగం ధరకే పేర్చి పెట్టేది
కునుకు పట్టని రాత్రుల్లో
ఈ వీధి చిటికినవేలు పట్టుకొని
ఊరి చివరిదాకా వెళ్ళి వచ్చేవాడ్ని
రోడ్డు పొడవునా
దుఃఖమే కలవరింతై నిద్రిస్తున్న బిచ్చగాళ్ళనీ,
అవయవాల్ని స్వప్నిస్తున్న అవిటితనాన్ని చూపించి
బాధగా కంటతడి పెట్టుకునేది
పైకి కరకుగా కనిపించినా కరిగిపోయే జాలిగుండె దీనిది
అందుకే - ఈ వీధిని నేను ప్రేమిస్తాను
ఈ వీధికి నేను నమస్కరిస్తాను
వీధీ ఓనా వీధీ! నిన్నెలా మర్చిపోగలను
నీ భుజల చదును మీద బొంగరాలు తిప్పుకున్నవాడ్ని
నీ వీపు చదును మీద ఇసుక గూళ్ళు కట్టుకున్న వాడ్ని
నీ ఒదీలో బోర్లపడి బతకడం నేర్చుకున్న వాడ్ని
నువ్వు ఇరుకు సందువైనా, గుంటలు పడ్డ స్ఫోటకపు ముఖానివైనా
ఏసు ప్రభువుచే శపించబడ్డ అంజూరపు చెట్టువైనా సరే
నిన్నెన్నటికి అనాంధను కానివ్వను
నిన్ను కొత్త చరిత్రకు ముఖచిత్రాన్ని చేస్తాను
మళ్ళీ నువ్వు చైతన్యం నింపుకొని విప్లవాల భూమికవౌతావు!
సుప్రభాతం (వీక్లీ)
29.04.2000
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి