అంచులేని దృశ్యం
మనమిక్కడ కూర్చునే ఉంటాం!
కూర్చునే తీరికలేక వాళ్ళు ప్రవహిస్తూ ఉంటారు
మనకు ఘనీభవించడం తప్ప
ప్రవహించడం నిజంగానే ఇష్టముండదు
మెతుకు మెతుక్కి రక్తం వొలుకుతున్న వాస్తవం
సందేహాస్పదమైనప్పుడు
కరుగుతున్న జీవితాలు కల్పిత కథల్లా ఉంటాయి!
బలుపెక్కిన పొగరు అధికారమై
బలహీనుడి నెత్తికి బరువులెత్తుతుంది
అబద్ధం శాసనమై మోసగించినందుకు
వాళ్ళు ఆరుబయట జైల్లో డొక్కలెండిన పశువుల్లా...
ఇక్కడ
ఆనవాలు తెలీనంతగా ఊటలు ఇంకిపోయాయి
అంతా కారు చీకటి, అన్నీ వెన్నెలలేని రాత్రులే
బతుకు పండని మబ్బులు ఎన్ని కురిస్తేనేం?
గాయాలు సలుపుతూనే ఉన్నాయి
ఆదమరచి నిద్రించిందెప్పుడూ..
గువ్వలు గుంపులై
దుఃఖాన్ని వెంటబెట్టుకుని ఎగిరిపోతూనే ఉన్నాయి
ఏ దారి ఎటుపోతుందో ఎవరికి తెల్సు...
***
మనమిక్కడ టీవిగా నిల్చునే వుంటాం!
రక్తం స్వేదమౌతున్న వాస్తవం మనకు కలలానే ఉంటుంది!
నిజాన్ని గుర్తించినా ఒప్పుకోడానికి సిద్ధపడం
అబద్ధంలో జీవించడమే ఇష్టం కనుక...
***
నది ఎండిపోయాక
వంతెన మీంచి నడవాల్సిన అవసరమేముందనీ
వయ్యారాల్ని వొలకబోసేది గాలిపటాలేకాని
కాలాన్ని వడబోసిన పండుటాకు నిశ్శబ్దాన్నే కదా కౌగలించుకునేది
ఒడ్లొరుసుకుని ప్రవహించే పరవళ్ళ మధ్య
ఉనికి కోల్పోయే గడ్డి పోచలను పరామర్శిచేదెవరు?
ఈ కళ్ళన్నీ తుఫానుల్నే మోస్తున్నాయి
కన్నీటిలో ఈదే మనుషుల్ని
అన్నీ పలకరిస్తున్నయి, మనుషులు తప్ప
(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 05.03.1997)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి