శిధిలాల మధ్య ఓ పిడికిలి
జీవితమన్నాక
బాధల్ని మోయడం మామూలే కానీ
బాధలే జీవితంగా మారితే
బహుశా.. రంపపు కోతే నయమేమో!
ఎన్నేళ్ళుగా
ఈ శరీరాన్ని వ్యధలతో మోసుకొస్తున్నానో
నుదిటిమీద ముడుతలు పడ్డ అనుభవానికి తెలుసు
చదువుకున్న వేదశాస్త్రం
కాలు విరిగిన వృషభంలా కొరగానిదై
గాడి తప్పిన బతుకుబండిని మళ్ళించలేక పోయింది
కంఠశోషను మిగిల్చిన పురాణ పఠనాలు
నా గర్భదారిద్ర్యానికి
శప విమోచనం చూపలేని దొంగ మునులయ్యాయి
కాలాన్ని హరించిన సంధ్యావందానాలు
చీకటి బతుకులో వెలుగును ఫోకస్ చేయలేని
సెల్సు మాడిన టార్చిలైట్లయ్యాయి
పట్టేడన్నం పెట్టలేని వూరు
నా ముఖానికి రిక్త హస్తం చూపితే
పంచాంగాన్ని చంకలో ముడుచుకొని
కష్టకాలపు కాందిశీకుణ్ణయ్యాను
ఇప్పుడు - కులం పేరుతో ప్రతి వూరూ
కాలే కడుపు మీద కత్తులు విసురుతుంటే
బతుకును ఖాళీ చేయడం అనివార్యమౌతోంది
ఆకలి నటించే పొట్టనిండిన గొంతులు
రాయితీల రసగుల్లలు మింగుతూ
బహుముఖాలుగా శిధిలమైన బ్రాహ్మణ్యాన్ని
ఇంక అగ్రకులంగానే ఆక్షేపిస్తుంటే
ఎలా ఒప్పుకోవాలి చెప్పు?
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి