నేనూ దళితుణ్ణే...!
చావని అహంకారంతో
తెల్లపంచా శిల్కులాల్చీ తొడుకున్నానే కాని
నిజానికి నాదీ ఆకలి అగ్నికీలల్లో దహించుకుపోతూ
మృత్యుకోరలకి చిక్కిన ఖాళీకడుపే...!
అగ్రకులం నాదన్నది, కడుపు నిండిన వాణ్నన్నది
ఆ మునుపు కాలం నాటి మాట
నిజమే!
గంటకొక యజ్ఞం జరిగిన రోజుల్లో
నిన్ను పంచముడని పరిహసించి, పంచలోకి రానివ్వనిదీ,
నిన్ను ఊరికి, వాడకి, పల్లెకి కాకుండా
యేటిలోకి తొక్కేసిందీ
అంతా నిజమే !
***
అరుంధతి
నా ఇంటి కోడలైన రోజే వరసలు కలుపుకన్నవాళ్ళం
నీ కుల కవి పాదానికి
మా తాత గండపెండేరం తొడిగినరోజునే
బంధుత్వాన్ని పెంచుకున్నవాళ్ళం
నీతో కల్సి నడవాలని నే తొందర పడ్తుంటే
నా మీద ఇంకా ఆరని ద్వేషమెందుకు...?
నిష్టూర మనిపించినా నిజం చెప్పక తప్పట్లేదు
గాయత్రి సాక్షిగా నాదీ చినిగిన బతుకే
కడుపు నిండని వాడెవడైనా దళితుడే...!
***
గుండె పట్టని బాధ నాకూ ఉంది!
కడుపు నిండని శ్రాద్దాలు పెట్టుకుంటూ
మంత్రాన్ని నమ్ముకున్న వారసత్వం నాది.
స్టేషన్లో రైలాగ్గానే
"అపరకర్మలు చేయిస్తారా బాబుగారూ" అంటూ
ప్రయాణికుల్ని చుట్టుకుని
ఎన్ని అవహేళనల్ని బాధతో భరించానో
నా జీవితాన్ని కాటేసిన తెల్లతాచుకు తెలుసు...
చిరిగిన పంచె, మాసిన తువ్వాలు ఉతుక్కోడానికి
మారుపంచలేని
కులాగ్రపేదరికం నాది!
ఈ శ్రాద్దాల రేవులో
ఎన్ని ఉదయాలు కన్నీటిచుక్కలై ఇంకిపోయాయో...!
***
నేను చదువును నిర్లక్ష్యం చేసిన రోజు
"మాదిగోడిలా నువ్వూ చెప్పులు కుట్టుకు బ్రతకాల్సొస్తుంద"ని
నన్ను తిట్టడానికి
తాతయ్య నీ కులాన్ని అడ్డుపెట్టుకున్నప్పుడు
గుండె పగిలి ఎన్ని చెరువులై చెక్కిళ్ళమీదికి జరిందో..
నిన్ను బయట నిలబెట్టి
నువ్వు కుట్టిన తోలుచెప్పుల ముఖాన పసుపునీళ్ళు చల్లి
ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడే నాకర్థమైంది
పశువుకంటే మనిషే ఇంకా వెంకబడి ఉన్నాడని..!
బాల్యాన్ని వెంటేసుకుని బడికెళ్ళినరోజు
మనిద్దర్నీ వేరువేరు బెంచీలమీద ఎందుక్కూర్చోబెట్టారో
నన్ను ప్రేమగా ముద్దుపెట్టుకున్న మాష్టారు
నిన్నెందుకు చీదరించి దూరంగా పొమ్మన్నాడో -
ఇద్దరమూ పాఠము ఒప్పగించకున్నా
"గొడ్డుమాంసం తినేవాడివి నీకు చదువెందుకురా" అంటూ
నిన్ను మాత్రమే పలకతో కొట్టి
ఎందుకు తల బొప్పికట్టించాడో
నాకప్పుడర్ధంకాలేదు
నీ చేతికి అందే అదృష్టం పుస్తకానికి వుండుంటే
బహుశా నువ్వే నాకంటే బాగా చదివుకునుందేవాడివి.
నీతో కలిసి ఆడుకోవాలని ఆరాటపడ్డవాణ్ని
సగం కూలిన మీ గుడిసెలో కూర్చుని
నీ కంచంలో అంబలి పంచుకోవాల్నై ఉబలాటపడ్డవాణ్ని
వయసు పెరిగేకొద్దీ
నాకూ నీకు మధ్య పెరుగుతున్న ఎడబాటు తెల్సింది...!
***
నన్ను అస్పృశ్యుడ్ని చేసిన
ఈ శాస్త్ర గ్రంధాలూ, వేదపఠనాలూ
ఇవేవి అక్కర్లేదు నాకు
మనిషిగా బతకడానికి కాసింత మనిషితనం కావాలి
నిజనికి ఇప్పుడూ నేనూ -
నాలాంటి ప్రతి ఆకలి జీవీ దళితుడే...!
17 కామెంట్లు:
Awesome!! Chaala chakkagaa cheppaaru eenaati so called Agrakulapu paristhithini
Interesting
సహేతుకమైన ఆవేదన
నిర్హేతుకమైన నిరసన
శాస్త్ర గ్రంధాలూ, వేదపఠనాలూ ఏం చేసాయి? అవా మనకు అమానుషత్వాన్ని నేర్పింది!!!?
Thanks for bringing the real picture
and the plight of so called agrakullalu.
కులవైషమ్యాలు,తరాల అంతరాలతోపాటూ మానవత కోణాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.
దళిత-బ్రాహ్మణ సారధ్యానికి సమాజం తయారు కావాలనే పిలుపునిచ్చారు. పోరాటం భుక్తికోసం,సామాజిక హక్కుకోసం, రాజకీయశక్తి కోసం అయినప్పుడు దళితుడు-బ్రాహ్మణుడు-ముస్లిం - క్రైస్తవుడు ఓకే వైపున్నారన్న స్పృహ లేని హిందువులకు చక్కని పాఠం చెప్పారు.
థాంక్యూ,
కొద్దిరోజులుగా వెంటాడితే, కరుణించినందుకు.
సుమారు ఓ పదిహేనేళ్ళ క్రితంప్రముఖ పత్రికలో ఈవారం కవితగా వచ్చింది.
అప్పట్లో దళితకవిత్వం ఉద్యమరూపంలో ఉంది. ఈ కవిత గొప్ప దుమారమే లేపింది. ఈ కవితకు కవితారూపంలో సమాధానాలు కూడా ఈయబడ్డాయి.
ఈ కవిత దళిత కవిత్వాన్ని రెండు దశలుగా విభజింజిందనిపిస్తుంది. అంతవరకూ బ్రాఃహ్మణ ద్వేషం ప్రదర్శించిన వాదం, అగ్రకులమంటే డబ్బున్న కులంకూడా అన్న స్పృహను పెంచుకొంది. (ముందు లేదని కాదు)
నా దృష్టిలో ఒక ఉద్యమరూపాన్ని మలుపుతిప్పగలిగిన (ఇది నా అభిప్రాయం) కవితగా ఈ కవితపై ఎంతో గౌరవం.
అప్పటినుంచీ ఈ కవితపై ఎంతో అభిమానం.
మరలా ఇన్నేళ్ల తరువాత చదువుతూంటే ఇప్పటికీ అదే జలదరింపు. అవే రోమాలు మరలా నిక్కబొడుచుకొంటున్నాయి. అంతకు మించి ఇంకేం చెప్పగలనూ.
మీరు చెపితే నమ్మరు,
ఈ కవిత చదివిన తరువాత ఇంతకాలమూ నేను సంగుభట్ల గారి పేరు మరిచిపోలేదు, అదే విధంగా ఆయన ఇతర కవితలు కూడా నాకు తారసపడలేదు. ఒక్కోసారి అనిపించేది ఏమైపోయాడీయనా అని.
రెండేళ్ల క్రితం ఒక అనువాద కవితల సంకలనంలో వీరు వ్రాసిన వంటవాడు అన్న వీరి కవిత ఇంగ్లీషు అనువాదం చదివి ఓహొ ఉన్నారు మాట అని అనుకొన్నాను.
మరలా బ్లాగుల రూపంలో వీరిని పోల్చుకోవటమూ, తదనంతరం వీరు వ్రాసిన కవితలను చదవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
బొల్లోజు బాబా
@చదువరి గారూ! మనసు కరిగితీల్సిందే!
శాస్త్ర గ్రంధాలూ, వేదపఠనాలూ అమానుషత్వం నేర్పాయని అనలేదనుకుంటాను.
అవి పట్టుక్కూర్చున్న కారణాంగా, ఇవ్వాళ్ళ తాను సమాజంలో అస్పృశ్యుడైపోతుంటే, దళితులు కూడా బ్రాహ్మణులను వెలివేస్తుంటే, వాటిని విసిరేసి, "హగ్ మీ ప్లీజ్" అని మళ్ళీ "అడుక్కుంటున్నాడు"
Begging is my birth right - అన్నాడు వినోభా భావే!
ఇది నిరసన కాదు! ఆవేదనే! కాదు కాదు - అభ్యర్ధనే! యాచనే!
చదువరి గారికి
ఈ కవిత నేపద్యం నేను పైకామెంటులో చెప్పాను. అప్పుట్లో ఒక తీవ్రమైన స్వరంతో, బ్రాహ్మణులపై ఏహ్యభావంతో అనేక కవితలు వ్రాయబడ్డాయి. అలాంటి సందర్భంలో ఈ కవిత ఒక ఆర్ధ్రతా పూరిత స్వరాన్ని వినిపించింది. రేరాజ్ గారు సరిగ్గా అర్ధం చేసుకొన్నారనిపిస్తుంది.
ఈ కవిత ప్రభావం ఎంతంటే, దళితఉద్యమకవిత్వాన్ని రెండు దశలుగా విభజన చేసేంతగా. (ఈ కవితపై నిరసనా లేకపోలేదు)
బహుజనుడనైన నాకు బ్రాఃహ్మణులపట్ల నా దృక్పధంలో మార్పు తెచ్చిన కవితగా దీనిని స్మరించుకొంటాను. నాలాగా ఎందరో ఉండొచ్చు.
మహేష్ గారికి
i admire you because - you see the things, many times, in the way i see.
bollojubaba
@బొల్లోజుబాబా గారు: దళిత ఉద్యమాన్ని అర్థం చేసుకుంటున్న అందరికీ పోరాటంలోని లోటుపాట్లు అర్థమవుతాయి.
బ్రాహ్మణాధిపత్యంపైన పోరాటంతో దళిత ఉద్యమం మొదలైనా బ్రాహ్మణాధిపత్యానికీ భ్రాహ్మణకులానికీ సంబంధం లేదన్న జ్ఞానం కొద్దికాలానికే వచ్చింది. కానీ "బ్రాహ్మణ భావజాలం" అనే కనపడని శతృవుతో పోరాడుతున్నామన్న నిజం శ్రేణులకు తెలిస్తే ఉద్యమం ఎలా ముందుకు సాగుతుందో అన్న సందేహంతో నాయకులు ఈ సైద్ధాంతిక కోణాన్ని ప్రక్కనపెట్టారు.
ఆ తరువాత జరిగిన సామాజికశాస్త్రవేత్తల, దళిత మేధావుల సూత్రీకరణలు .బ్రాహ్మణ (కుల) మేధావుల సహకారంతో మూలాల్ని "బ్రాహ్మినిజం"గా గుర్తించి పంధా మార్చుకున్నారు. ఈ సైద్ధాంతిక విశ్లేషణ చాలా మందికి తెలియక, ‘బ్రాహ్మినిజం’ అన్నాకూడా బ్రాహ్మణ కులాన్ని అన్నట్లుగా బ్లాగుల్లో ఫీలవడం ఈ మధ్యకాలంలో కూడా జరుగుతున్న నిజం.
పోరాటం "సమానత్వం" కోసం అయినప్పుడు అసమానతలను,అణచివేతను అనుభవిస్తున్న ప్రతి వ్యక్తీ దళితుడే.ఈ ధృక్పధం దళిత ఉద్యమంలో కొద్దికొద్దిగా వస్తోంది. అది త్వరితగతిన జరగాలని ఆశిద్ధాం.
యదార్ధ పరిస్థితిని కళ్ళముందు ఉంచింది. హాట్స్ ఆఫ్!!
@ కత్తి: వారు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మళ్ళీ ఆవు వ్యాసంలాగ పాత పాటే పాడేరు :)
@విశ్వామిత్ర: మీకు దళిత ఉద్యమం మీద అవగాహన లేదని సుస్పష్టంగా అర్థమవుతోంది.ఇక సామాజిక శాస్త్రపోకడల గురించి మీ జ్ఞానం శూన్యం అనేది మీ వ్యాఖ్యద్వారా తేటతెల్లం. కాబట్టి నా వ్యాఖ్య మీకు ఆవు వ్యాసంల అనిపిస్తే అర్థం చేసుకోగలనుగానీ...I can't appreciate it.
ఇక్కడ నేను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఏమీ లేవు. కవిత ఆవిష్కరించిన "నిజం" దళిత ఉద్యమంలో మార్పుని తీసుకొచ్చి కొన్ని సైద్ధాంతిక మూల్యాన్ని మార్చింది. ఆర్ధిక-రాజకీయ-అధికార అసమానతలుకూడా దళిత ధృక్పధాలే అన్న విశాలత్వం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మీలాంటి అరతెలివి మాటలు పట్టించుకోవడం ఉత్త సమయం వృధాతప్ప మరొకటి కాదు.
If you really want to discuss. Please do some reading first.
@ కత్తి: నేను ఆవు వ్యాసం అన్నది మీ "బ్రాహ్మణిజం" మాటని మరోసారి సమర్ధించుకున్నందుకు.
దీనికి దళిత ఉద్యమంపై అవగాహన అవసరమా అద్యక్షా? "బ్రాహ్మణిజం" అనే మాట ఖచ్చితంగా కులానికి చెందదు అనేది మీ అఙ్నానమనిగాని, ఙ్నాన శూన్యమనిగానీ నేను అనను! కొద్దిగా తెలుగు పుస్తకాలు చదవండి.
http://girishavedi.blogspot.com/2009/07/blog-post_16.html
ఈ కవిత గురించి కొన్ని చర్చలు మొదలైన నేపధ్యంలో మరి కొన్ని వివరములు:
ఈ కవిత ఆంధ్రజ్యోతి దిన పత్రికలో వచ్చింది. తరువాత వారం పగడాల నాగేందర్గారి స్పందన (కవితా రూపంలో) వచ్చింది. దానికి ప్రతిగా సంగుభొట్లవారు "ప్రియమైన తమ్ముడికి" అనే కవిత రాస్తే అది ఆ తరువాతి వారం వచ్చింది. దాని లింకు ఇది
http://pogamancu.blogspot.com/2009/07/blog-post.html
ఇవిగాక వ్యాసాలు, కవితల రూపంలో దాదాపు నెలరోజులు పత్రికా ముఖంగా చర్చలు జరగడం నాకు బాగా గుర్తు.
సాయిప్రసాద్ గారూ, నా మొదటి వ్యాఖ్య నొకసారి చూసుకుంటే కటువుగా ఉందని అనిపించింది, దాన్ని మరికాస్త మృదువుగా చెప్పుండాల్సింది. మన్నించండి.
రేరాజ్, బొల్లోజు బాబా: ఈ కవిత వెనకున్న కవి వేదన అర్థమౌతోంది నాకు. కానీ నేటి తన పరిస్థితి యొక్క కారణాలకు మూలాలు ఫలానా ఇదిగో ఇక్కడున్నాయంటూ తాను చూపుతున్న అంశమే...!
"నన్ను అస్పృశ్యుడ్ని చేసిన
ఈ శాస్త్ర గ్రంధాలూ, వేదపఠనాలూ
ఇవేవి అక్కర్లేదు నాకు"
ఈ పాదాలు లేకపోతే ఈ కవిత ఎలా ఉండేదంటారు? దానిపై స్పందన ఎలా ఉండేదంటారు?
చదువరి గారికి
మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్ధం అయింది.
ఆ పాదాలను సమకాలీన, ఉపరితల వ్యాఖ్య గానే నాకు అనిపిస్తూంది.
మీరు తీసుకొన్న విస్త్రుతార్ధంలో తీసుకోలేకపోవటానికి కారణం, కవితాన్వయానికి అవరోధమౌతుంది కనుక.
రెండు మూడు అర్ధాలు వచ్చే ఒక వాక్యాన్ని అన్వయించుకోవలసివచ్చినపుడు, ఆవాక్యం పైనా క్రిందా వ్రాయబడ్డ బావాలతో సరితూగే అర్ధాన్నే చెప్పుకోవాలికదా?
--- అని అనుకొంటున్నాను.
బొల్లోజు బాబా
ఈ కవిత ఈరోజు ప్రొద్దునే మీ బ్లాగులో చదివగానే కళ్ళముందు మా కోమటి సుబ్బమ్మ, పంచాగం పంతులు కనిపించారు.. ఎవరికీ తెలియకుండా మా ఇంట్లో ఎన్నిసార్లో చద్దన్నము వాకిలి చాటున తిన్న రోజులు కళ్ళముందు మెదిలాయండి.వారి వారి కులవృత్తులు వదులుకొని ఇప్పుడు వారి పిల్లలు ఎక్కడో ఎలాగో బ్రతుకుతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి