మృత్యుకంపం
ఇవాళ
ఒడ్డు చెదిరిన సముద్రాలు
ఊళ్ళలోకి వలసరావడం ఆశ్చర్యం కాదు
వరదముఖంతో నేలకుజారిన మేఘాలు
నీటి మోకులై గొంతుబిగించడం ఆశ్చర్యం కాదు
బతుకు భరోసాకి చిత్తరువైన భూమి
పట్టపగలు వొళ్ళు విరుచుకోవడం ఆశ్చర్యం
ఒక్కొక్కరికి ప్రేమగా పురుళ్ళుపోసిన పుడమి
ఒక్కసారే ఇందర్ని సమాధి చెయ్యడం ఆశ్చర్యం
నావకింద నీళ్ళు కదిలినట్టు
ఇప్పుడు కాళ్ళకింద నేల కదులుతుంది
ఒక పాపిష్టి ప్రకంపన తర్వాత
ఏది ఇల్లో - ఏది గొయ్యో
అంతా ఒకటిగా కళ్ళముందున్నప్పుడు
భూమంటే మనుషుల్ని పూడ్చే మట్టెని కాక
క్షేమకు రూపమైన ధరిత్రని ఎలా చెప్పగలం?
ఓ వేద పండితులారా!
ఇక మీగొంతులో భూసూక్తాన్ని స్వరపరచకండి
గణతంత్రదినాన కుతంత్రం చేసి
లేతమొగ్గల బతుకుతుంచిన బాల ఘాతి ఇది
మట్టిపొరల పాచినోటితో
ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న పీనుగల దిబ్బయిది
ఇప్పుడు
చెట్లు మొదళ్ళును కోల్పోయి
మట్టి గుండెపై మెటికలు విరచడం ఆశ్చర్యం కాదు
ఆకాశానికి నిచ్చెనేసిన అపార్టుమెంట్లు
నిలబడ్డచోటే కాళ్ళు నరుక్కోవడం ఆశ్చర్యం
వంతెన కలపలేని ఖాళీల మధ్య
నడకలు తెగిన దారులు కళేబరాల్ని పేర్చుకోవడం ఆశ్చర్యం
భూమి పొరలు పొరలుగా విడిపోయాక
వూరంటే శవాలు పేర్చిన వల్లకాడేనేమో
శిధిలాల మధ్య కుళ్ళుతున్న దుర్గంధమేనేమో
బతకడం నేరమైన భూమ్మీద
సామూహిక దహనంగా బూడిదవటమే శిక్షేమో!
ఇక దిక్కులెన్నివున్నా
మనం ముమ్మాటికీ దుక్కులేనివాళ్ళమే
వెల్లువౌతున్న విలయాలమధ్య
బతుకు భరోసాకు భూమి కూడా ఆధారం కానప్పుడు
బతుకు కంటే ఎక్కువగా
మనం చావును ప్రేమించడం సహేతుకం
(2001 జనవరి 26 గుజరాత్ భూకంపానికి పతిస్పందనగా)
(ఆంధ్రభూమి దినపత్రిక 12.02.2001)