దగ్ధ దృశ్యం
ఒక అనిశ్చితి రేఖపై దగ్ధమౌతున్నాను
వొరిగిన వాంచలు కలలుగా ఆవిష్కృతమౌతున్న తరుణంలో
సూక్ష్మంగానో, రహస్యంగానో చిట్లిపోతున్నాను
నీరుల్లిని ఎరగా చూపి
బోను సిద్ధపరుస్తున్న చేతుల్ని చూస్తున్నాను
జీవితం జీవితం కాకపోవడమే విషాదం
ఇప్పుడు జీవితం పరాజయమై గుచ్చుతోంది
పిల్లంగ్రోవిలా స్వేచ్చాగీతం పాడటం నేరమని
వేట కొడవళ్ళు గొంతును వెంటాడుతున్నాయి
నడిచే అన్ని దారుల్లోనూ అగాధం ఎదురై
అంచెలంచెలుగా భవిష్యత్తును పాతాళానికి తోసేస్తోంది
ఎన్ని అరణ్యాల పచ్చదనాన్ని జ్ఞాపకంగా తొడుకున్నా
రంగు వెలిసిన ఇంద్రధనస్సులే కళ్ళముందు వేలాడుతున్నాయి
ఒంటరి గాలిపటంలా తెగిన దారాన్ని వెంటేసుకొని
దిక్కుల మధ్య గిరికీలు కొట్టడమే ప్రస్తుత సందర్భం
ఇప్పటికీ
జీవితం దుఃఖమై మెలిపెడుతూనే వుంది
కళ్ళు మూసినా తెరిచినా కన్నీళ్ళే కదుల్తూ
నుదుటి కింది బొరియలు దిగుడు బావులయ్యాయి
నడిచినంత మేరా బాధ విస్తరిస్తూనే వుంది
నమ్మకానికీ, సందేహానికీ మధ్య నలగడం మొదలయ్యాక
దుఃఖాన్ని కప్పుకోకుండా పడుకున్న రాత్రుల్లేవు
రెక్కలు తెగిన పక్షులు వంత పాడుతుంటాయి
కంటి తుడుపు సంజాయిషీలు తేనెటీగల్లా కమ్ముకున్నా
వేదనలు ఏకమై శరీరాన్ని శోధించడమే వర్తమాన దృశ్యం
కొన్ని క్షణాలు జీవితాన్ని యుద్ధమని పిలుస్తాను
ప్రతిరోజు గాలిని పీల్చినంత సహజంగానే
బతుకు కోసం ఆయుధంలా మేల్కోవాల్సి వస్తోంది
యుద్ధ నీతులు ఛిద్రమైన అటవిక పోరాటంలో
రాత్రి యుద్ధాలు, రాతి యుద్ధాలు అనివార్య చర్యలౌతున్నాయి
యుద్ధం కోసం బతకడం వేరు
బతకడం కోసం యుద్ధం చేయడామే బాధాకరం.
కొద్దిసేపు జీవితాన్ని మృత్యువని పిలుద్దామా?
శ్వాస మీదా, నిశ్వాసం మీదా నిషేధం విధించి
ఆకాశం దండేనికి ఆత్మను వేలాడదీస్తుంది కదా!
గాయపడని చిరునవ్వే చుక్కగ మెరుస్తుందేమో!
నెను వేదమంత్రాల మధ్య దగ్ధమౌతున్నవాణ్ని
జీవితాన్ని ఎన్ని రకాలుగా నైనా పిలుస్తను
తొలిపొద్దు అరికాలి కింద గాజుపలుకై
రక్తనదిని ఆవిష్కరించే లోపు
తూర్పు దిక్కును కంటి రెప్పలతో శుభ్రపరచగలనేమో, కానీ
ఎన్నటికీ జీవితాన్ని జీవితమని మాత్రం పిలువలేను