ముగింపులేని ప్రయాణం
ప్రవహించే జ్ఞాపకాలమధ్య
గాయాలను ఓదార్చుకుంటూ ప్రయాణం మొదలౌతుంది
విరిగిపడే క్షణాల కొండ చరియల కింద
కొన్ని చెవిని కొరికే ఆర్తనాదాలు
అచ్చం నాకేకను గుర్తుకు తెస్తూ.
దూరంగా సన్నని అలికిడి
బహుశా రహస్య ప్రయాణం కావచ్చు
చీకటిని ఉండ చుట్టుకుంటూ
అడుగులు నడిచిపోతూనే వున్నాయి
నిజనికి ఏ మజిలీ మధ్యలో ఆగడంలేదు
పాదముద్రలు గుమిగూడిన చోట
మాటలు మొలుస్తునే వన్నాయి
సరిగ్గా నా గొంతును అనుకరిస్తూ -
అనివార్యమైన ప్రయాణంలో
అన్నీ సంకేతాల వ్యక్తీకరణలు
దారి నిట్టూర్పులతో నిండిపోతుంది
కాళ్ళు విశ్రాంతిని మరిచిపోతాయి
కళ్ళలోయలో దిగులు నిండినా
చూపును వెంటాడుతూనే వుంటాయి నడకలు
ఖచ్చితంగా నా కదలికను అనుకరిస్తూ -
ఇక్కడ
ఏ ప్రయాణానికీ ముగింపు లేదు
యుద్ధం కంటే
ముగింపులేని ప్రయాణం గొప్పది
వీళ్ళవరూ ప్రయాణీకులు కారు
బతుకు పోరాటం చేస్తున్న సైనికులు
(16.12.2000, మధ్యాహ్నం 12:20)
2 కామెంట్లు:
excellent
బాబాగారు,
నెనర్లండి
కామెంట్‌ను పోస్ట్ చేయండి