6, ఏప్రిల్ 2009, సోమవారం

పొగమంచు

పెదవుల మధ్యనుండి వచ్చే

మాటకు తడిలేదు

పూస్తూ పూస్తూన్న వసంతం

అధికార వాయువుకి

పండుటాకులా రాలిపోయింది

రేయింబవళ్ళు శ్రమకు

కళ్ళు పత్తిగింజలై

కల పొగమంచులా కరిగిపోయింది

ఎండిన బీళ్ళు

శరీరం మీద విచ్చుకత్తులై కూర్చున్నాయి !

లక్ష్యం చుట్టూ

ముళ్ళై మొలిచిన బ్రహ్మజెముళ్ళు!

కొమ్మ విరిగి

అయ్య వొరిగిన బాధ

జీవితాన్ని పాత గాయల మచ్చల్లోకి సాగనంపింది

అప్పుడు

గతాన్ని తిరగేసుకుని

ఆ వెలుతురులో ఆశయాల్ని జల్లించుకుంటున్నాను

నిట్టూర్పుల పొగలు

గుంటలుపడ్డ కళ్ళకు తెరలు కట్టేశాయి

ఇన్నేళ్ళూ గడిచిపోయాక

పక్షి సంతతిని

ఏ పామో పొట్టన పెట్టుకుందన్న వార్త!

స్వప్నం కూడా చితికి చేరాక

ఇక నా నడక చెట్టు వేరుల్లోకే..!?

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP