రెప్పలు విచ్చుకుంటున్నప్పుడు
రాత్రి సరిహద్దుదాటి
లేత ఎండ
గుమ్మంలో కొచ్చినప్పుడు
స్వప్నాల్ని విచ్చుకుంటాయి
కళ్ళల్లో వెలుతురు ప్రపంచం
ఇంటింటికీ విస్తరించే రశ్మి
చీకటితోపాటు సోమరితనాన్నీ తరిమేస్తుంది !
చుట్టూరా పరుచుకున్న పచ్చదనం
మొగ్గల్ని పువ్వులుగా పూస్తుంది
కొమ్మమీది పక్షిగానం
గాలి కెరటాలకు సంగీతాన్ని శృతి చేస్తుంది.
నూతిలో
చేదపడ్డ చప్పుడు
బిందె గొంతు నిండుతుంది
తువ్వాయి
తల్లి పొదుగుకోసం
రాటకు కట్టిన తాడును తెంచే ప్రయత్నం !
చెరువులో
అల్లరి బాల్యపు కేరింతల ఈత !
పొలాల్లో కాపురమున్న వరి కంకులకు
మంచు బిందువులే కిరీటాలు
గుడి మైకు
"కౌసల్యా సుప్రజారామా" తో
ఊరి పొలిమేరల్ని దాటుతోంది
ఈ అనంత కాంతి ప్రసారంలో
ఎత్తు పల్లాల మధ్య
తొలి అడుగు
సూర్య బింబంలా విచ్చుకుంటోంది !
1 కామెంట్‌లు:
హృద్యంగా వర్ణించారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి