23, ఏప్రిల్ 2009, గురువారం

జంధ్యప్పోగు

సజీవ సమాధిన్నేను!

బాల్యపుటంచుల్ని దాటని అమాయకత్వం నీడలో

విశాలమైన నా ఎడమ భుజం కొమ్మమీదికి

ఆచారపు కొండచిలువ ఎక్కినప్పుడే

నేను రెక్కలు తెగిన జటాయువు నయ్యాను

మట్టికీ మనిషికీ కాకుండా

నన్ను పనికిరాని పనిముట్టుగా మర్చిన

ఆ పగటి చీకటి ఇంకా జ్ఞాపకమై మెదుల్తూనే వుంది.


కాళ్ళకు పారాణి, బుగ్గన చుక్క, కళ్ళకు కాటుక పెట్టి

ఉపనయన మహోత్సవ పేరుతో నన్ను ముస్తాబు చేస్తుంటే

కొత్త పెళ్ళికొడుకులా ఎంత మురిసిపోయానూ..

చెవులు కుడుతున్నప్పుడు కలిగిన బాధంతా

బంగారు పోగుల్ని చూసుకుంటూ మర్చిపోయాను

బంధువుల అక్షితాశీస్సులమధ్య

నూలుపోగు మెడలో పడుతుంటే

పెద్దవాణ్నవుతున్నానని తెగ సంబరపడిపోయాను

రావి మండ భుజమ్మీదుంచుకొని

పై పంచెను చెరుగు పట్టి

"భవతీ భిక్షాందేహి" అని యాచించడం ఆచారమే అనుకున్నాను కానీ

నా భవిష్యత్తు ఖాళీ జోలౌతోందని ఊహించలేకపోయను

గాయత్రీ మత్రోపదేశం చేస్తున్నప్పుడు

"ద్విజులంత బుడ్డి చెంబులు పట్టి తిరిగేరయా" అన్న బ్రహంగారి తత్వం

నిత్య సత్యమై చెవులకు అడ్డం పడ్డట్టన్పించింది

"మీ అమ్మతో కల్సి ఒకే విస్తరిలో భోంచేసిరారా! భడవా" అని

దట్టీ బిగిస్తూ చెప్పిన పురోహితుడే

ఇకపై ఎవ్వరి ఎంగిలీ తినకూడదన్నప్పుడు

జీవితంలో అపురూపమైనదేదో కోల్పోతున్నట్లన్పించింది


నాగుల చవితికో, సుబ్రమణ్యషష్ఠికో

ఓపోసన వేసుకుంటాం భోజనానికి రండంటూ

చుట్టుపక్కల వాళ్ళంతా పిల్చుకెళ్ళి

భోజనంతోపాటు సదక్షిణ తాంబూలం చేతికిచ్చినప్పుడు

ఈ జంధ్యం నా పాలిటి కల్పవృక్షమనుకున్నాను

దారిద్య వైతరణిని దాటించే కామధేనువనుకున్నాను

రోజులు గడిచేకొద్దీ

పెరుగుతున్న ఈ జంధ్యం బరువెంతో తెల్సింది

ఉన్నత చదువులకీ, ఉద్యోగ సముపార్జనకీ వీల్లేకుండా

ఈ జంధ్యం లక్ష్మణరేఖై

నన్ను చేతగాని దద్దమ్మను చేసింది

కులాన్ని చెప్పుకోడానికి సిగ్గుపడటమేకాదు

ఎదుటివాడు జంధ్యాన్నెక్కడ చూస్తాడోని

చొక్కాలోపలికి దొంగవస్తువులా దాచేసుకోవాల్సొస్తోంది

నిజం చెప్పాలంటే

వీపు గోక్కోడానికి తప్ప

ఇంకెందుకూ పనికిరాని ఈ జంధ్యం

నన్ను సరికొత్త అస్పృశ్యుణ్ణి చేసింది

అగ్రహారాలు మేసిన ముత్తాతలకు

డొక్కలెండిన ముని మనుమలకు మధ్య

ఎంత వ్యత్యాసముందో మలుపు తిరిగిన చరిత్రే సాక్ష్యం.


నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి

నాలుగ్గుండెలూ, నలభై పిడికిళ్ళూ అవసరం లేదు

గాయపడ్డ ఒక్క గుండె కేక చాలు...!


(సమాచారం దిన పత్రిక, 03.08.1997)

8 కామెంట్‌లు:

నాలోనేను 23 ఏప్రిల్, 2009 4:51 PMకి  

తరతరాలుగా అంతరాలు పెంచిన లోకం చేసిన గాయం ఓ రగిలిన మనసులో బాధ
చక్కగా చెప్పారు

మంచి స్నేహితుడు 23 ఏప్రిల్, 2009 5:22 PMకి  

అద్బుతమైన వర్ణన నెనెర్లు

డా. సంగుభొట్ల సాయిప్రసాద్ 23 ఏప్రిల్, 2009 5:27 PMకి  

@నాలోనేను
@మంచి స్నేహితుడు

మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

కొత్త పాళీ 23 ఏప్రిల్, 2009 7:06 PMకి  

బాగుంది అనలేను. కానీ మనసులు కలిచివేసే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పగలను.

Bhãskar Rãmarãju 23 ఏప్రిల్, 2009 7:48 PMకి  

విశాలమైన నా ఎడమ భుజం కొమ్మమీదికి

ఆచారపు కొండచిలువ ఎక్కినప్పుడే


ఈ జంధ్యం లక్ష్మణరేఖై

నన్ను చేతగాని దద్దమ్మను చేసింది

కులాన్ని చెప్పుకోడానికి సిగ్గుపడటమేకాదు

ఎదుటివాడు జంధ్యాన్నెక్కడ చూస్తాడోని

చొక్కాలోపలికి దొంగవస్తువులా దాచేసుకోవాల్సొస్తోంది

మాష్టారూ మీరు మరీనూ, కులం, మతం ఇవన్నీ వర్ట్యువల్ అండీ. జంధ్యాన్ని దాచిపెట్టుకోవాల్సినంత అవసరం ఏమాత్రమూ లేదు నన్నడిగితే.

జిగురు సత్యనారాయణ 23 ఏప్రిల్, 2009 9:21 PMకి  

బాగుంది. ప్రస్తుత పరిస్థితిని సరిగ్గా వర్ణించారు.

అజ్ఞాత,  23 ఏప్రిల్, 2009 10:58 PMకి  

సమాజంలో పరిస్థితుల్ని హత్తుకునేలా చెప్పారు.. నెనర్లు...

upendra sharma,  2 ఆగస్టు, 2012 1:11 PMకి  

Taa chedda koti vanamella cherachindi ani oka sameta. meekunna pati alochana leka kadu enno vela ellugaa gayatri ni aacharistu vastunnadi. daani viluva, prabhavam telusukunnaru kabatte niyamanga paatinchi phalitam pondaaru. viluva leni(teliyani)chota vajramainaa, gokkotaniki tappa enduku panikiradu. Meeru dongala daachukuntunnappude daani (Jandhyam)upayogam kolpoyindi. Paapam mee bhavodvegam kosam mee peddalu meeku upanayanam cheyaledu. Kondachiluvani bhujaana buddimantulu evaruu vunchukorandi. Meeruu teseyavachchu. Meeku abhyantamaite/duradaga vunte (Jandhyam) vunchandi gokkovataniki upayogapadutundi. Chivariga Snehitudiga oka salaha, Mee muttaatala agrahaaraala asti meeku endikandi, kashtapadi sampaadinchukondi.

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP