గిలకబావి
వేకువ దివిటీ పట్టుకొని వేగుచుక్క పొడవగానే
చీకటి ఉలిక్కిపడి
దిగులు గుండెలో తిరుగుముఖం పడుతుంది
రెక్కల దుప్పట్లలో తలదూర్చుకు పడుకున్న కోడిపుంజులు
గొంతుతీగెల్ని సుతారంగా సవరించుకుంటాయి!
రాత్రంతా నిశ్శబ్ద ప్రదర్శనైన గిలకబావి
పొద్దుటిపూట శబ్దకచేరి చేస్తుంది...
గిలక చప్పుళ్ళకు
గుడిగంటలు గూటిపక్షులూ మేల్కొంటాయి !
వెల్తురు స్పర్శకోసం
దరులచుట్టూ తిరిగే తాబేలు
నిమిష నిమిషానికి నీటిమట్టం కొలుస్తుంటుంది
అలికిడి ఆగితే చాలు -
గిలకపై కూర్చొని పిచ్చుకలు ఊసులాడుకుంటయి
ఎండ పై కెక్కేకొద్దీ
బిందెలు బిందెలుగా తరలివచ్చే జన సందోహం మధ్య
గిలకబావి పెళ్ళి మండపమై కళకళలాడుతుంది
మిట్టమధ్యాహ్నం
చమటలు కక్కే సూర్యుడు ముఖం తుడుచుకుంటూ
బావి అంచులమీంచి
నీటి అద్దంలోకి తొంగిచూసుకుంటాడు
పొద్దువాలే వరకూ
అలుపెరగని గిలకబావి
బకెట్లు బకెట్లుగా జలదానం చేస్తూనే ఉంటుంది !
చీకటి చిక్కబడే వేళకి
గిలకబావి సద్దుమణిగి
బిడ్డకి పాలిచ్చి అలిసిపోయిన నిద్రపోతున్న బాలింతలా ఉంటుంది
ఏళ్ళ తరబడి తపస్సులో మునిగిన మునీశ్వరునిలాంటి గిలకబావికి
గట్టుమీది మర్రిచెట్టు కొమ్మల వింజామరలూపుతూ
జోలపాట పాడుతుంది !
అనావృష్టి నేపధ్యంలో
గిలకబావి ఎండిపోయి
వలసపోతున్న పక్షుల కళ్ళల్లో జాలిచూపై నన్ను కరిగిస్తుంది
కొన్నేళ్ళుగా
ఇక్కడ గిలక చప్పుళ్ళు వినిపించట్లేదు
బావిగుండెల్లో గింగిర్లుకొట్టే గుడ్ల గూబల రెక్కల చప్పుళ్ళు తప్ప.
నిజానికి
ఇప్పుడు గిలకబావి గొంతెండిన రాయలసీమలా ఉంది !
ప్రతిరోజూ
ఈ బావి అరుగుమీద నన్ను నిలబెట్టి
ఒళ్ళంతా ప్రేమనురగలు చేసి రుద్దీ రుద్దీ
లాలపోయించిన అమ్మ జ్ఞాపకం
ఓ కన్నీటి చుక్కై చెక్కిలి మీదకు జారుతుంది !
ఒకప్పుడు పెళ్ళిమంటపమై కళకళలాడిన యీ బావి
ఇప్పుడు పాడుబడి
నుదిటి తిలకం రాలిన నానమ్మ వెలితి జీవితంలా
నన్ను నిలువున దహిస్తుంది.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి