నీటి జ్ఞాపకం
ఒకప్పుడు ఇక్కడో చెరువుండేది
అలల చిరు సవ్వడుల మీదుగా వీచిన
చల్లని గాలి తెరలుండేవి
ఒకప్పుడు ఇక్కడ వేకువను మేల్కొల్పుతూ
కలవరం లేని పక్షుల కలరవాలుండేవి
తామరల తళుకులుండేవి, చేప కన్నుల తళత్తళలుండేవి
ఉదయాలు కాలంతో దోబూచులాడుతూ
ఈ నీటి ప్రాంగణంలో కావిళ్ళుగా మారి
జల చైతన్యాన్ని ఇంటింటికి మోసుకెళ్ళేవి
చెరువు మీద నమ్మకంతో చెంబును విసిరేసి
పొద్దుటే నీటికి దిశమొలను చూపిన వెర్రిబాల్యం మాది
నీటి అంచులపై కాలు మోపితే
అలల చేతులతో కాళ్ళను చుట్టేసుకునే పిచ్చి ప్రేమ దీనిది.
ఈ చెరువు గట్టుపై సాయంత్రాలను షికారు నడిపిస్తూ
నీటి నిశ్చలతపై ఒక రాయి విసురుతానా
పెదాలను సుడులు తిప్పుతూ బోసినవ్వును ప్రదర్శించేది.
పండుగలకి పబ్బాలకి దోస్తులతో కలసి
సహస్ర పత్ర సుమ సంచయానికి
ఈ చెరువు నీటిలో ఈత పోటీలయ్యాం
మధాహ్నపు వేళల్లో
చెరువు లోతును తనిఖీ చేస్తున్న గేదెల వీపునెక్కి
గొంతు చించుకున్న వాగ్గేయకారులమయ్యాం
పల్లె పదాలమయ్యాం, వేమన పద్యాలమయ్యాం
ఎన్నో కాలి నడకల దాహాగ్నులు
ఇక్కడ దోసెడు నీళ్ళతో శమించేవి
బతుకు వలను విసిరే జాలర్లకు
బరువైన బహుమతులు దక్కేవి
నీటి కోసం తపిస్తున్న మాగాణి బిడ్డకు
ఈ జల దేవత పంటకాల్వల చనుబాలు పంచేది
భూమి గాడిపొయ్యిలా మండుతున్న రుతువులో
ఈ చెరువు నీటి చూపు కోల్పోయిన కన్నైంది
తడిని పరితపించే పిడచగట్టిన నాలుకైంది.
***
ఓ నా గొంతెండిన తటాకమా!
నీ మౌనం నాకు తెలుసు
కాలానికి తలవంచిన నీ ఓదాసీన్యమూ తెలుసు
బహిష్కృత జలస్పర్శవైన నిన్ను చూసినప్పుడల్లా
మా కడుపులు చెరువులౌతున్నాయి
మా గుండెలు దిగులు దివిటీలై మండుతున్నాయి
నువ్వు మళ్ళీ పూర్ణ జలపుష్పానివై తొణికిసలాడేంత వరకూ
మేమంతా ఒడ్డున కటకలాడుతున్న చేప పిల్లలమే కదా!
***
ఇప్పుడు
ఎండిన నీ పెదవి తుద మీద
నాలుగు కృతజ్ఞత చినుకులు కురిసేందుకు
ఏ దివ్య పురుషుడో
నన్నొక్కసారి మేఘాన్నయ్యేలా శపిస్తే బావుణ్ణు.
(ఆదివారం ఆంధ్రజ్యోతి, 14.05.2000)