ఒక కొత్త ఉదయం కోసం
ఈ ఉదయం
ఏ వెలుగునూ మోసుకురాదేమో
ముఖాన్ని దాచుకొని
ఎప్పటిలానే నిరాశగా మిగిలి పోతుందేమో
చాలా ఉదయాలు గుర్తొస్తున్నాయి
అవి రాత్రి ముందు ఓడిపోవడమూ గుర్తుంది
తుమ్మెదలు, తామరలూ
అలా వేకువకోసం నిరీక్షిస్తూ కన్నీళ్ళు పెట్టడం
ఏ తూర్పు పర్వతమో చూస్తే ఏమయ్యేదో
వెనక్కి తిరిగిన వెలుగుముద్దను పైకి లాగి
కిరణాలు కిరణాలుగా భూమ్మీదికి వెదజల్లేదేమో
పావురాళ్ళు, పాలపిట్టలు
ఏ చెట్టు గూళ్ళలో దిగులుగా ముడుచుకు పోయాయో
చీకటి నిడిన చెరువు గుండేలో
ఎన్ని కప్పలు ఆక్రోశాన్ని బావురుమంటున్నాయో
హద్దు చెరుపుకున్న పొద్దు తిరుగుడు పువ్వు
మొద్దులా స్పర్శను కోల్పోతుంది
ఎవరైనా అరచేతిలోకి తీసుకొని
ఒక్కసారి ఓదార్చి వెళ్తే బాగుండు
అసలు
కిరణాలన్నీ పారేసుకొని
ఈ పగళ్ళన్నీ
ఏ కొండ కింద నలిగి పోతున్నాయో
నాకైతే వెలుతురు స్నానం చెయాలనుంది
స్తంభించిన సముద్రం అలలై కదిలి
నా కాళ్ళ కింద గుంటలు తవ్వితే చూడాలనుంది
ఈ రగులుతున్న రాత్రుల మధ్య
ఉదయం పూర్తిగా చావలేదనుకుంటా
బహుశా
కొత్త సూర్యుణ్ణి ప్రసవించే అలసటతో
పురిటినొప్పులు పడుతోంది కాబోలు
(విజేత దినపత్రిక 11.02.2000)
1 కామెంట్‌లు:
Nice...నచ్చింది మీ కవిత!!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి