ప్రహరీ గోడ
ఇది ఎన్నేళ్ళుగానో
మా ఇంటిని కాపాడుతున్న రక్షణ కవచం
తాతయ్య పేర్చిన ఎన్ని ఆశల ఇటుకల ప్రతిరూపమో
ఇలా మా ఇంటి ముందు ప్రహరీ గోడై నిలిచింది
చిన్నప్పుడు బాల్య స్నేహితునిలా పరిచయమై
జామచెట్టును అల్లుకున్న మల్లె తీగలా
నా జీవితాన్ని పెన వేసుకుంది
ఈ గోడల భుజాలపై
కొబ్బరాకు పీకలతో గొంతుతెగేదాకా
కోటిస్వరాల కచేరీలు చేసేవాడిని
చినుకు రాల్చమని చిరునామా పంపుతూ
మేఘాల మధ్యకు గాలిపటాల్నెగురవేసే వాడిని
ఈ గోడ నీడలో బిళ్ళంగోడునై, బెచ్చాలాటనై
అనామికను ధనస్సులా వంచి గురిచూచి కొట్టే గోళీనై
శలవు దినాల్లో క్రీడోత్సవాలు జరుపుకునేవాడ్ని
గుర్తురాని గుణింతాల్ని వల్లించుకుంటూ
దీని ముఖాన్ని బొగ్గుతో గత్తర చేసే వాణ్ణి
సంధాకాలపు చల్లదనంలో
అమ్మచేతి గోరుముద్దలు తింటూ
ఈ గోడమీద బొమ్మనయ్యేవాణ్ణి.
ఈ ప్రహరీ నా రంగుల సాత్‌రంగీ
వారానికొకసారి సినిమా పోస్టరు రంగు దుస్తులు ధరించి
కొత్త ఓణీ కట్టిన కన్నెపిల్ల సిగ్గును అభినయించేది.
ఆ మధ్య ఎన్నికల్లోపార్టీ గుర్తుల్తో ముస్తాబు చేశాక
అచ్చం తెలుగు ఉపవాచకం ముఖచిత్రంలా కనిపించేది
కార్తీక మాసపు సాయంత్రాలు
ఈ గోడపై నానమ్మ దీపాలు వెలిగించాక
చుక్కలు భూలోకానికి వలస వచ్చినట్లుండేవి
ఎండబోసిన సజ్జగింజలకోసం వాలిన పిచ్చుకలు
ఈ గోడ గూళ్ళలో దాంపత్య సుఖాన్ని సఫలం చేసుకునేవి
ఏ అర్థరాత్రో సంకోచమై నిల్చున్న చూసినప్పుడల్లా
గేటు చేతులు చాచి నాన్న ప్రేమలా లోనికి ఆహ్వానించేది
ఎన్నో అనుభవాలకు మూగసాక్ష్యంగా నిల్చి
నాలాగే ఈ గోడా ముసలిదై పోయింది
మట్టి నాల్కను బైటకు చాపి
పక్షవాతం వచ్చిన దేహంలా చచ్చుబడిపోతోంది
కొడుకులు ఊతంగా నిలవని వృద్ధాప్యంలో
ఈ గోడే నాకు ఆసరాగా నిల్చి అడుగులు నేర్పుతోంది
నా జరత్వాన్ని ఛీత్కరించిన పుత్రుల్లారా
ఈ కూలుతున్న గోడనైనా మళ్ళీ నిలబెట్టుకోండి
రేపటి ముసలితనాన్ని మీ కొడుకులూ నిర్లక్షం చేస్తే
నాలాగే మీకూ ఊనిక అవసరం కదా!
(ఆంధ్రభూమి దినపత్రిక11-09-2000)
1 కామెంట్‌లు:
అబ్బ.. ఎంత బాగా రాశారండీ..!!
excellent post..!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి