తద్దినం బ్రాహ్మడు
ఇవాళ
మీరెవరూ నా దుఃఖాన్ని చూసి దిగులు పడక్కర్లేదు
ఎవరూ నా గాయాల్ని చూసి జాలి నటించక్కర్లేదు
మీ చులకన చూపుల చెండ్రకోల దెబ్బలకు
దించిన తలను మళ్ళీ ఎత్తలేక
దారిద్ర్యపు క్షితిపై నిలువునా తగలబడుతున్న వాణ్ణి
ఆకలి పొట్టను అన్నంతో నింపలేక
ముడతలు పడ్డ ఉదరమ్మీద
విభూతి రేఖలు దిద్దుకోవడం గురించి కానీ,
పుండైన బతుకు మెడ మీద కష్టాల కాడిమాను
మోస్తుండటం గురించి కానీ మీకు తెలియదు!
శవాన్ని ఆరుబైట పడేసి
మీరంతా ఆస్తిపంపకాల కుస్తీలు పడుతున్నప్పుడు
వల్లకాటి కర్తవ్యాన్ని గుర్తు చేసిన వశిష్టుడ్ని
కుళ్ళు కంపు శవ యాత్రలో
స్మశానం దాకా భుజం కలిసిన శవవాహకుణ్ణి
మీ వేళ్ళకు పవిత్రం చుట్టడం కోసం
బ్లేడు ముక్కల్లాంటి దర్భపరకల పదునుని
నా వేళ్ళతో పరీక్షించి కొత్త రేఖలు సృష్టించుకున్నవాణ్ణి
వేళకాని వేళల్లో
తిలాక్షతలను నిత్తిమీద ఆవాహన చేసుకొని
గుప్పెడు మెతుకుల గంపెడాశనై కూర్చున్నవాణ్ణి
కాకులు ముట్టని మీ తండ్రుల పిండాల్ని
మండుటెండలో ఏటికి సమర్పించిన బృహస్పతిని
క్రియలు పూర్తయ్యేదాకా మీరు పెట్రమాక్స్‌లైట్లై
తీరా దక్షిణ ఇవ్వాల్సొచ్చే సరికి
వత్తిమాడిన దరిద్రమ్మొహాలతో, లోభిత్వాన్ని చేతిలో పెట్టినా
"ఆయుష్మాన్‌భవ" అంటూ
ఉదారంగా దీవించిన బడుగు బాపణ్ణి
నా ఒంటరితనం, వీధిలో ఎదురైనందుకు
అపశకునం పేరున మీ చీవాట్లకు చితికిపోయినవాణ్ణి
ఆంబోతుకు అచ్చేసినట్లు తద్దినం బ్రాహ్మడనే ముద్రతో
శుభకార్యాలకు నాపై నిషేదాజ్ఞ విధించి
గొడ్డుమోతుతనంతో కడుపు కొట్టినా సహించాను
నేనెప్పుడైనా ఆకలి కోపంతో నోరు మెదిపితే
"బాపనోడికి బలిసిందంటూ" కారు కూతలు కూసి
నా నిస్సహాయతను అవహేళన చేసినా భరించాను
ఇక - జీవితాన్ని ఖాళీ చేస్తున్న ఈ క్షణంలో
చివరిసారి ఆకలి కడుపు ముందు నిల్చోని
పస్తుండిన నా బిడ్డల సాక్షిగా
బతికుండగానే మీ కోసం పిండ ప్రదానం చేస్తాను
(ప్రకృతి సాహితి సెప్టెంబరు - 2000)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి