స్టడీ అవర్
సాయంత్రం కాగానే
క్లాసు రూములు మాట్నీ వొదిలిన ధియేటర్లవుతాయి
పగటి నిశ్శబ్ధాన్ని మోసిన హాశ్టల్ గదుల్లో
స్వర సమ్మేళనాల శబ్ద కచేరీ మొదలవుతుంది
కాలనికి పరుగుపోటీ పెట్టే విధ్యార్ధులు
క్షణాల్లో స్నానమై, ముస్తాబై, శ్నాక్స్ ఐ
స్టడీ కోసం వరుసలై కూర్చున్నాక
వరండాలు కిక్కిరిసిన టొరంటో మైదానాలౌతాయి
క్రమంగా
పుస్తకాలు పేజీల రెప్పల్ని తెరుచుకున్నా
రెక్కలు విప్పుకున్న మనసులు మాత్రం
విభిన్న తీరాలకే మజిలీలు ప్రారంభిస్తాయి
నన్నయ నుంచి షేక్స్పియర్‌లోకి
మీడియం మార్చిన ఫిరాయింపుదారులు
బుర్రకెక్కని ఫిజిక్స్ కెమిస్ట్రీల మ్యాన్యువల్స్
ర్యాంకులు పండించడానికి
లెక్కలకు రాపిడి పెట్టే పెదవులు
కదులుతున్న బైనామియల్ థీరంలౌతాయి
తనను చూసేందుకు నెలకైనా రాని
అమ్మానాన్నలను తలచుకొని
పుస్తకం చాటున కొన్ని కళ్ళు కన్నీళ్ళవుతుంటాయి
ఉత్తరంలో కనిపించిన
తాతయ్య అనారోగ్యం జ్ఞాపకమైనందుకు
ఒక ముఖమ్మీద
విచారం సాలెగూడై అల్లుకుంటుంది
ఈ గిరిగీసిన కాంపౌండు మధ్య
ఎవరి అనుభూతుల్లో వాళ్ళు బొంగరాలై తిరుగుతుంటారు
అలసటను నిద్రకప్పగించిన
కొన్ని సుకుమార శరీరాలు
బరువును గోడకు ఆనించి తూగుతుంటాయి
రిలీజైన కొత సినిమా కబుర్లతో
కొందరు మాటల పుట్టలై చిట్లుతుంటారు
లంగావోణీల ముస్తాబుకు దిష్టిపెడుతూ
పంజాబీ డ్రస్సులు గుసగుసలు పోతుంటాయి
వెనుక వరుసై కూర్చున్న మీసాల తుంటరితనం
కోరికల కాగితపు రాకెట్లై
సిగ్గును మొగ్గలు పూయించిన అమ్మాయిల మధ్య దూకుతుంది
చారుదత్త చరితాన్ని చదివే చూపులు
మధ్య మధ్య వోరచూపులుగా వక్రించి
వీధివైపు కదలికల్లో వసంతసేనను వెదుకుతుంటాయి
విధ్యార్ధుల చుటూ
దీపం పురుగుల్లా తిరిగే ట్యూటర్లు
జీతాలకీ ఖర్చులకీ సమన్వయం కుదరక
కాలు కాలిన పిల్లులై గిలగిలలాడుతుంటారు
ఈ బరువెక్కిన హృదయాల్ని చూసి
లాంగ్ బెల్లు బాధగా గొంతు చించుకుంటుంది
ఇంతవరకూ
అలలై కదిలి వెళ్ళిన ఆలోచనలన్నీ
ఇప్పుడు తీరం తాకని అసంతృప్తితో వెనుదిరుగుతాయి
మనసుకెక్కని పుస్తకాల్లోని వాక్యాలు
అసంధర్భ వాక్యాలై మిగిలిపోతాయి
స్వేచ్ఛను కోల్పోయిన ఈ యవ్వన చకోరాలు
మళ్ళీ క్రమశిక్షణ పంజరాల్లోకి వెళ్తూ
గుండె బరువుల నిట్టూర్పులౌతారు
(ఆదివారం విజేత 04.03.2001)
5 కామెంట్‌లు:
నాకు మా ఇంటర్ కాలేజ్ గుర్తు వచ్చింది
మునుపటి మా కాలేజి + హాస్టలు జీవితం, ఆ మధ్య చూసిన Happy Days గుర్తుకొచ్చాయి.
హాస్టలు జీవితం గురించి ఎంత బాగా రాశారు !
చాలా బాగా రాశారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి