శ్రాద్ధాల రేవు
ఇక్కడి ప్రతి వుదయం
కొన్న అస్తమయాల విషాద సంకేతం!
గూడుకట్టిన అంధకార శబ్ద రాహిత్యంలోకి
వేకువను మోసుకొచ్చే పక్షుల గుంపు
ఈ రేవు మలుపులో
మౌనీకరించుకున్న సంతాపమై బాధతో ముడుచుకుపోతుంది
రాత్రంతా
నిశబ్దాన్ని కప్పుకు పడుకున్న నది
ఏ వేద మంత్రధ్వనికో కెరటాల రెప్పలెత్తి
దిగులు కళ్ళలో కన్నీళ్ళు నింపుకుంతుంది
ఈ రేవు మెట్ల మీద
కడుపునిండిన కలలన్నీ తరగని దుఃఖమై కరుగుతుంటాయి
మంత్రాన్ని వారసత్వంగా వల్లించే
వేదాధ్యాయి ఎండిన పెదాల మీంచి
రుతువులు ఎండమావులై వెళ్ళిపోతుంటాయి
జీవితాకాశానికి ఇంద్రధనుస్సు కాలేని జంధ్యప్పోగు
జవాబులేని ప్రశ్నై వెంటాడుతుంది
ఇక్కడ జీవితం గాయమౌతుంది
గాయమే జీవితమౌతుంది
శ్రాద్ధ కర్త కనపడాగానే
నేనంటే నేనని పోటీపడే ఘనాపాఠీలు
కడుపు మండే ఆవేశంతో
పిడికెడు బియ్యం కోసం పిడికిళ్ళు బిగిస్తుంటారు
చావులపై ఆధారపడ్డ
కాటికాపర్లలాంటి మడిగుడ్డల అస్పృశ్యులు
ఆకలి దారిద్ర్యంతో
ఏట్లో కలపాల్సిన పిండాకూడును
నోట్లో కూరుకునే రహస్య భోక్తలౌతారు
ఏ ఉత్తమ గతుల స్వార్థంతోనో
నది మధ్యలోకి విసరబడ్డ చిల్లర పైసల కోసం
అనాధ పిల్లలు ప్రాణల్ని బలిపెడుతుంటారు
శ్వేతాక్షతలు, నువ్వుగింజలు, దర్భపిండాల మీంచి జారి
మృతుల స్మృతిలా
రేవు నల్దిక్కులకూ పరివ్యాప్తమౌతాయి
తలదించని వెయ్యి కాళ్ళ దరిద్రాన్ని చూసి
గట్టు మీది మర్రిచెట్టు
శోకాన్ని మౌనంగా ఊడలు దించుకుంటుంది
చావులాంటి రాత్రి!
రేవంతా జీవ రహిత నిశ్శబ్దం !!
మళ్ళీ
ఎప్పటిలాగే పొద్దుపొడుస్తుంది
ఎప్పటిలాగే నది దర్భల్ని మోస్తుంది
ఎప్పటిలాగే కాకులు గుంపులౌతుంటాయి
ఎప్పటిలాగే
మనిషి ఆకలికి పరిష్కారం కాలేని శ్రాద్ధాల రేవు
మెతుకు చినుకు రాల్చని దొంగ మబ్బై
బతుకు కోతను విధిస్తుంది...
(ఆంధ్రజ్యోతి వీక్లీ16-04-1996)
1 కామెంట్‌లు:
కదిలించే ఆలొచనలు
కవితలైతే తెలిసింది ఎలా వుంటాయో తెలిసింది
కామెంట్‌ను పోస్ట్ చేయండి