అసంబద్ధం
కవిత్వమూ అసంబద్ధమూ కలగలసిన చోటు
గొంతు ముడి విప్పి
నిజాన్ని ఆవిష్కరించడం నిషిద్ధమౌతోంది
స్వార్థం పడగెత్తిన నీడలో
పలకరింపులు, పరామర్శలు పెదాల కదలిక మాత్రమే!
విద్రోహ చర్యలు చాపకింద నీరై
వర్తమానం ముఖమ్మీద నీలి పరదాలు కప్పుతాయి
గాయపడటం పాతే ఐనా, ఆ సంధర్భంలో
గాయపడే పద్ధతి కొత్తగా వుంటుంది
నదిని ఎండమావిని చేసే జలగచూపులు
అదృశ్యంగా వీపు వెనుక కదుల్తుంటాయి
రక్తంలోకి ఇంజక్టైన ద్వంద్వవైఖరిని శ్వాసిస్తూ
మనిషి బహుముఖాలుగా విస్తరించడం
యాదృశ్చికం కాదు
ముఖంలేని నీడలన్నీ సమూహమై
చప్పుడులేని చావుల వెంటాడటమే అసంబద్ధం...!
అబద్ధమే జీవితమైనప్పుడు
నమ్మకద్రోహం చర్చనీయాంశం కాదు
కంఠాలకు కత్తులు గురిపెట్టాక కూడా
స్వేచ్చగా, సహజంగా మట్లాడటమే ఒక యుద్ధం
సమూహం కోసం గొంతు ఉరుములై ధ్వనించడమే యుద్ధం
సందిగ్ధాన్ని దగ్ధం చేస్తూ ఇక యుద్ధానికి వెళ్ళలి
యుద్ధానికి రెండు పార్శ్వాలుంటాయని తెల్సు
పోరాటాన్ని జీవితం మల్చుకున్న వాడికి
విజయం పట్ల విశ్వాసముంటుంది
పోరాటోన్ముఖమైందే జీవితం
చచ్చినా బ్రతికుండే వాడే వీరుడు
ఇక్కడ జీవితాల్లేవు! వీరుల్లేరు!
రెప్పవాల్చని సరిహద్దురేఖకి నేను నమస్కరిస్తాను.
ఆంధ్రజ్యోతి దినపత్రిక20.11.2000
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి