పూజగది
ఇది నా గుండెగది
వేదమంత్రాలతో, ఘంటానినాదాలతో
ప్రతిధ్వనించే నిత్యపూజల గర్భగుడి.
దిక్కులు తెల్లారక ముందే
ఈ గదిని కడిగిన ముత్యాన్ని చేసి
ధ్యాన ఆవాహనలతో దేవుళ్ళనాహ్వానించేవాణ్ణి
ఆశల పీథంపై ఆసనమేర్పరచి
అర్ఘ్యపాద్య ఆచమనాలుగా స్రవించేవాడ్ని
మూర్తీభవించిన సాలగ్రామాల శిరస్సుపై
ఎన్నిసార్లు కన్నీటి అభిషేకమయ్యానో
నా వొంటికి గుడ్డపేలిక కరువైనా
ఈ దేవతా మూర్తుల మానాల మీద
పట్టు పోగుల వస్త్రాలు కప్పేవాడ్ని
నా చిరిగిన పంచెను కుట్టుకోడానికి
దారం కరువైన దరిద్రంలో కూడా
వీళ్ళ భుజాలకు యజ్ఞోపవీతాలు తగిలించేవాణ్ణి
మేపూత సువాసనల కోసం
నా జీవితాన్ని గంధం చెక్కలా అరగదీసే వాడ్ని.
సూదికొన బొటనవేలికి కసిని గుచ్చుతున్నా
రంగు రంగు పూలను గుదిగుచ్చి
వీళ్ళ మెడలో ఇంద్రధనుస్సుల్ని మెరిపించాను
అయినా వాళ్ళ నిష్ఠూరాలను, వ్యంగ్యోక్తుల వెటకారాలను పక్కకునెట్టి
తీరని కష్టాల మధ్య అష్టోత్తరాలు చేశాను
ఈ సుర సమూహ ధూప సుగంధం కోసం
నా బతుకును అగరబత్తిగా వెలిగించి పెట్టాను
తాకట్టుగా మారిన స్థిరాస్తుల్ని
వీళ్ళ నీటికి నైవేద్యాలుగా, తంబూలాలుగా అందించి
హరించుకుపోయిన కర్పూర హారతినయ్యాను
అరుణారుణ మృదు చరణాల ముందు
స్వరం తప్పని మత్రపుష్పాన్నై మోకరిల్లాను
గానుగెద్దులా ప్రదిక్షిణాలు చేసి
దక్షిణగా హృదయాన్ని హుండీలో వేసినా
ఏ దాక్షిణ్యమూ దారి చూపే చుక్కాని కాలేక పోయింది
లక్షల అక్షింతలు పాదాలపై చల్లినా
ఏ కటాక్షమూ నా క్షుదార్తిని తీర్చే అక్షయ పాత్ర కాలేకపోయింది
పునఃపూజల ఉపచారాలు
గ్రహచారాన్ని మార్చలేని ఉపవాస చర్యలయ్యాయి
శిరస్సుపై చల్లుకున్న శంకు తీర్ధం
ఎన్ని పాపాల్ని ప్రక్షాళించిందో తెలీదుకాని
నా నెత్తిమీద దరిద్రాన్ని మాత్రం తొలగించలేక పోయింది
వెతలు తీర్చే వేల్పులు కొదవైనందుకు
ఈ పూజగది ఈశాన్యం అంచున
నేనోకన్నీటి చుక్కనై వేలాడుతున్నాను
దశాబ్దాలుగా మారని జీవన శైధిల్యాన్ని చూస్తూ
సహనాన్ని పరీక్షిస్తున్న ముక్కోటి దేవుళ్ళలో
ఏ ఒక్కడైనా వచ్చి
ఈ కాలుతున్న వొత్తిని కాపాడుకుంటాడా?
దేవుడా! దేవుడా!!
ఆజ్ఞాపించడం కాదు గానీ..!
నేను పోయాక మాత్రం దయచేసి నువ్వు రాకు.