కర్ణుడి చిరునామా!
మిరెప్పుడైనా
చీకటి పాటలు విన్నారా?
అశ్రుకణాల్ని చూశారా
లేత దుఃఖాన్ని పలకరించారా?
మీరు
పలరాతి సౌధాల్లో
జీవితాన్ని ఉయ్యాలలూపుకుంటూ
సుఖాల ముసుగుల్లోంచి దుఃఖాల్ని ప్రదర్శించేవాళ్ళు కదా !
దయచేసి వీళ్ళ బాల్యాన్ని గాయపరచకండి !
వీళ్ళసలే
చీకటి రాల్చిన మొక్కలెరుగని పువ్వులు
అక్టోబరు రెండోరోజో
ఆగష్టు పదిహేనోనాడో
నలగని ఖద్దరు టోపీలు
పేపర్లలో ఫొటోలకోసం పంచే బన్నుముక్కలే
ఈ ఆకలి కడుపులకి
ఒకింత ఊరటనిచ్చే పరమాన్నాలౌతాయి !
మత్తుతెలియని రాత్రుల్లో
విశృంఖల కౌగిళ్ళ మధ్య నలిగిన మల్లెపూలూ
వీళ్ళ చిరునామాలు చెప్పలేవు
ఊహ పెరిగేకొద్దీ
భవిష్యత్తును చంపే ఆలోచనల మధ్య
వీళ్ళ బ్రతుక్కి దారేదీ?
రైల్వేప్లాట్‌ఫారాల్లోనూ, బస్టాండుల్లోనూ
పలక ఫోటోలై వేలాడాల్సిందేనా?
చరిత్ర తిప్పితే
ఇలాంటి వెలుగు పూలకు
సంఘం పొత్తిళ్ళలో బహిస్కరణలెన్నో
చేతికున్న వేళ్ళేం చెబుతాయి!
స్వగతాల నేపధ్యంలో
అమావాస్య కరిగించిన స్వప్న పత్రాలివి
కనుబొమ్మలమధ్య ఉదయించే
ఈ సందిగ్ధ సంధ్యలకు సమాధానమేదీ...?
మళ్ళీ...
ఎక్కడో కేర్ మంటున్న శిశువు తొలి ఏడుపు...
ఈ కర్ణుడెవ్వడో...?