10, సెప్టెంబర్ 2009, గురువారం

చివరి పాట

ఎప్పటికైనా ఖాళీ చేయక తప్పదు

బతుకు చుట్టూ అల్లుకున్న

మమకార బంధాలను తెంచుకొని

చివరి క్షణంలో ఒంటరి ప్రయాణమూ తప్పదు



ఈ కోరికలెప్పుడూ ఇంతే!

ఆశల పల్లకి ఎక్కించి ఊరేగిస్తుంటాయి

దూరాన్ని సమీపించే కొద్దీ

విచారాన్ని మిగిల్చి విడిపోతుంటాయి

కొసకు చేరిన ఆయువు దీపం

వత్తిని తడుముకుంటూ కొండెక్కుతుంది

ఇక ఏ కోరికా వుండవు

వెళ్ళిన వాళ్ళ జ్ఞాపకాలతో

వెళ్ళబోయేవాళ్ళు దుఃఖమై కరుగుతుంటారు

కన్నీళ్ళమధ్య మళ్ళీ ఊరేగింపు మొదలవుతుంది



ఎప్పటికైనా తప్పనప్పుడు

బతుకును మూటకట్టుకొని సిద్ధపడటమే మంచిది

మృత్యువు ఎన్నడూ గాయపరచదు

సుతారంగా ప్రాణాన్ని ముద్దెట్టుకుంటుంది

పొందిన అనుభూతులన్నీ మాయమై

ఈ ఆఖరి అనుభూతే అద్భుతమౌతుంది



ఊపిరి పిట్టా! ఊపిరి పిట్టా!

గూడు విడిచే ఘడియ వచ్చిందని

దిగులు పడతావెందుకు?

మరణం శాపం కాదు

పునర్జన్మకు రెక్కలు తొడిగేందుకు

ఈ జన్మ మిగిల్చిన చివరి పదం


(26.06.2001, రాత్రి 01:15)


(ఈ బ్లాగుకి ఇదే చివరి పాట..!!)

Read more...

7, సెప్టెంబర్ 2009, సోమవారం

కూలుతున్న సోపానం

మీరు చెవులు రిక్కరించి కూర్చోండి

నేను గంధర్వుడిలా మారి

మీ కర్ణపుటల్లో గానామృతం నింపుతాను

శ్రవణ పేయంగా మీ తలలు వూగేందుకు

శృతి తప్పని స్వరతంత్రుల విన్యాసమౌతాను

మీ మానసిక కల్లోలం ఉల్లాసంగా మారేందుకు

అసలు కథ మధ్యలో

ఉపకథల చమత్కారమౌతాను

శివరాత్రులకో, నవరాత్రులకో తప్ప

ఇంకెప్పుడూ నేను గుర్తుకు రాక పోవచ్చు

నా కన్రెప్పల వెనక కావేరి నదులుంటాయని

మీ మనస్సంద్రంలో

ఆలోచన కెరటమై కదిలి వుండకపోవచ్చు

జల్లెడగా మారిన ధోవతిని చూసి

చకోర పక్షుల్లా కళ్ళు చిట్లించడం తప్ప

నా పేదరికంపై జాలి దుప్పటి కప్పలేని జడత్వం మీది

ఎముకలు కొరికే చలి రాత్రుల్లో

చొక్క లేకుండా కథ చెప్పాలని

మీరంతా పట్టువదలని విక్రమార్కులైనప్పుడు

'ఎనీమియా' కు ఆశ్రయంగా శ్రీరాన్ని ఒప్పగించాను

గాత్ర సౌలభ్యం కోసం

గుక్కెడు మిరియాల పాలు ఇప్పించమన్నందుకు

గుడ్లురిమి చూసిన మీ అహంకారం

మనసుపొరలను ఇంకా గుచ్చుతూనే వుంది



గొంతులో జలుబు దాగున రాత్రి

కథ శ్రావ్యంగా లేదని సాకుపెట్టి

పారితోషికం తగ్గించిన మీ అల్పబుద్ధి

ఎన్ని కథలుగా చెప్పినా తక్కువేనేమో!

మీరు 'వూ' కొట్టకున్నా

కథలు చెప్పి మెప్పించే అభాగ్యుడ్ని నేను తప్ప

ఈ ప్రపంచంలో - ఇంకెవరున్నాడు

గుడి ముంగిళ్ళలో, వీధి పందిళ్ళలో

హరికథా శ్రవణ ఫలితంగా

మీ పుచ్చు పుర్రెలకు పుణ్యాన్ని తాపడం చెయ్యడానికి

కంచిలోని కథలన్నీ తెచ్చి చెప్పాను

కానీ -

ఇవాళ

నేను బతుకు వ్యధను కథగా వినిపిస్తే

మీ చెవులన్నీ బధిరత్వాన్ని ఆపాదించుకున్నాయి

హరికథా సామ్రాట్టు వారసుణ్ణయినందుకు

ధర్మసత్రం అరుగు నా అడ్రసును మోస్తోంది

మీ మితిమీరిన నిర్లక్ష్యానికి

కాఫీ హోటళ్ళముందు, కళ్యాణ మంటపాల ముందు

కడుపును చేతిలోకి జార్చుకొని

యాచకత్వాన్ని శిక్షగా అనుభవిస్తున్నాను


ఈ బాధల భాగవతారును చూసి

మీ దాతృత్వం చిల్లరై

నా దోసిట్లోకి జారిపడకపోయినా

నేను మాత్రం ఆకలి పేగుల్ని శృతి చేసుకుంటూ

హరికథా సంకీర్తనతో

మీ మోక్షానికి సోపానమౌతూనే వున్నాను!

Read more...

3, సెప్టెంబర్ 2009, గురువారం

చరమాంకం

గొంతు తీగె తెగిపోయినప్పుడు

కరచాలనంలో విషాద స్తబ్దత

పరామర్శలో పలకరింపులో నిశ్శబ్దం!

కాలం కనికరించదు

మృత్యువు పగనెవడూ తప్పించుకోలేడు

ఆగిన గుండె కదలిక మళ్ళీ కదల్దు

మరణం

పునరావృతమయ్యే స్వప్నం కాదు

ఊపిరి తెగిపోయే చరమాంకం

నెత్తురు గడ్డకట్టే దీనావస్థ...

శ్వాస ఆగినప్పుడూ

సమూహ దుఃఖం సముద్రాల్ని గడ్డ కట్టిస్తుంది

ఏడుపు శవయాత్రలో వెదజల్లబడుతున్న

స్మృతి పత్రాల వెనుక అగ్నిని దహించే విషాదం

ఆకు రాలాల్సిందే...

ప్రవహించే వర్తమానంలో వెంటాడే మృత్యువు అనివార్యం

చావు చచ్చాక రాదు

మరణం మళ్ళీ మళ్ళీ పొందే అనుభూతి కాదు.

Read more...

31, ఆగస్టు 2009, సోమవారం

The Lake of Nature

ఆలోచనలు

రాత్రిని కౌగలించుకోగానే

నేను

నీళ్ళల్లో నిద్రిస్తాను

చేపా చేపా

నా రెప్పలెత్తవూ...

సంఘర్షణల మధ్య

చీకటి నోరు విప్పగానే

నేను

చెట్టుబెరడులో మూగబోతాను!

పిట్ట పిట్టా

మాట నేరపవూ...

మనిషి కోరిక

మృగ దాహమవ్వగానే

నేను

అరణ్యంలోకి పరిగెడతాను !

అరణ్యమా అరణ్యమా

నాలో పచ్చదనాన్ని పూయవూ...

కాలుష్యాల తాకిడికి

నేల గాయపడగానే

నేను

ఆకాశంలోకి నడుస్తాను !

ఆకాశమా ఆకాశమా

నన్ను మేఘాన్ని చేయవూ...!

నన్ను ఏదో ఒకటి చేసి

ఈ ఎడారితనంలోంచి

ఒక్కసారి ప్రకృతి జలాశయంలోకి విసిరెయ్యరూ...

Read more...

27, ఆగస్టు 2009, గురువారం

సముద్రాల్ని మోసే కళ్ళు

కాలం ఒక గూఢాచారి

రాత్రి పగలుగా రూపాన్ని మార్చుకుంటూ

నిరంతరాన్వేషణ సాగిస్తుంటుంది

దిక్కుల మధ్య పరచుకున్న భూమి కాన్వాసు పై

కొన్ని జీవితాలు విషాదంగా వొలికిపోతుంతయి

ఏ విషాదం ఏ గాయానిదో?

గాయానికి దయలేదు

పొరలు పొరలుగా చిట్లుతూ బతుకును భయపెడుతుంది

ఇక్కడ బ్రహ్మడి బతుకు ఈ గాయం

రంగు రంగుల భవిష్యత్తును

జంధ్యప్పోగుతో ఉరితీసి చంపే చట్టాలు

వల్లకాటి దారిలోనూ కత్తులు పేర్చుతాయి

చిరిగిన పంచెను జీవితంగా కప్పుకున్న విభూతి ముఖాలు

చిగురునవ్వును మొలకెత్తడం మర్చిపోతాయి

ఈ కళ్ళు సముద్రాల్ని మోయ్యడానికే పుట్టాయేమో!



వడ్డించిన విస్తరిలాంటి ఆలయభూములు

చడీ చప్పుడు లేకుండా స్వాహా చేసి

ఎంగిలి మెతుకులు విసిరే ప్రభుత్వాలు

అర్చకత్వాన్ని యాచకత్వంగా మారుస్తాయి

మూల విరాట్టులు మౌనాన్ని వీడవు

పూజారి శోకం గర్భగుడి దాటదు



బ్రాహ్మడుగా పుట్టడం నేరమైన దేశంలో

కొసదాకా బతుకు లాగటమే

ఆవలి తీరం చేరేందుకు అవిటివాడు నదిని ఈదటమే

అడుగడుగునా పేర్చిన నిచ్చెనలెక్కుతూ

వెనుకబడ్డ వాళ్ళాంతా ముందుకెళ్ళిపోయారు

ముందరివాడు మంత్రాల కింద నలిగి

వెంక్కి రాలేక, ముందుకు పోలేక

బతుక్కి దూరమౌతున్నాడు!

Read more...

24, ఆగస్టు 2009, సోమవారం

ఒకానొక సందర్భం

ఇద్దరం కలిసే వున్నాం

మౌనంగానో, మాటలుగానో

ఒకర్నొకరం పలకరించుకుంటూనే వున్నాం

హృదయాలే ఒక్కటవ్వట్లేదు

నా అభిరుచికి ఆమె దూరంగా వుండటమో

అమె ఆంతర్యానికి నేను దగ్గర కాలేకపోవడమో..



ఒక్కోరోజు

ఆమె మాటలు ముక్కలుగా విరిగిపోతుంటాయి

విడగొట్టడానికి వీల్లేని మాటలు నావి

అర్థం చేసుకునే ప్రయత్నంలో

ఆమె మాటలన్నీ మల్లెపూలలా ఏరుకుంటాను



ఆ మధ్య... కాలం వెంట పరిగెడుతూ

కొన్నాళ్ళు ఆమెకు ఎడబాటు కల్పించాను

తిరిగి వచ్చి చూస్తే

గుమ్మమ్ముందు ఎదురుచూపుల కొత్త సందర్భం

ఆమె పెదాలపై చిరునవ్వు పండుతోంది

ఆమె మాటలు స్పష్టంగా, అర్థవంతంగా

హృదయోల్లాస వ్యాఖానమంత సరళంగా -

ఇక మల్లెపూలు ఏరాల్సిన అవసరంలేదు



నిజమే... ఎవరన్నారో గానీ

దూరమై, మళ్ళీ దగ్గరయ్యాక

పొందే అనురాగమే అసలైన ప్రేమ


(26.12.2000, వేకువఝాము)

Read more...

20, ఆగస్టు 2009, గురువారం

పునరావృతం

ప్రతిరోజు ఇదే అనుభవం

పొద్దువాలేలోపు గాయపడటం

రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తడుముకోవడం



సన్నివేశ పునరావృత పరంపరలో

గొంతెత్తి ప్రశ్నిచే సందర్భముండదు

రుతువులు భ్రమణ సూత్రాన్ని వల్లిస్తూ

ఎదురు చూపుల నమ్మకంపై

ద్రోహాన్ని సూదులుగా గుచ్చుతాయి

ముఖాలు మౌనాన్ని తెరలు దించుకొని

ప్రాణం వూడిన తంత్రీ వాద్యాలవుతాయి

విరిగిన భుజాల మీంచి నడిచే విషాదం

సాముహిక దుఃఖమై స్రవిస్తుంది

ఉదయాలు గాయపడకుండా అడ్డుకోలేవు

ఏ రాత్రీ గాయానికి పూత మందు కాలేదు



ప్రతి రోజు ఇదే అనుభవం

పాత గాయాలను ఓదార్చుకుంటూ వెళ్ళి

మళ్ళీ పొద్దువాలే లోపు గాయపడటం

రాత్రులు గాయాన్ని కన్నీళ్ళతో తుడుచుకోవటం



సుప్రభాతం విక్లీ 25.08.2001

Read more...

17, ఆగస్టు 2009, సోమవారం

చెక్కిలి మీద జ్ఞాపకం

ఈ రాత్రి నిశ్శబ్దంగా వుండదు

చెవిని తొలిచే కీచురాళ్ళ ధ్వని

ఆలోచనకు రెక్కలు తొడగకా మానదు

ఇప్పటికెన్ని ఆలోచనలు

గాజుబొమ్మల్లా పగిలి పోయాయో

టార్చిలైటును ఆర్పివెలిగిస్తూ

రాత్రిని పరిశోధిస్తున్న మిణుగురుకు తెలుసు

పదునెక్కిన ఆలోచనల ముల్లుగర్రలు

మానుతున్న గాయాలను మెల్కొల్పుతుంటాయి

గాయాలు జ్ఞాపకమై సలిపినప్పుడల్లా

హృదయంలో కత్తిదిగిన బాధ...

అర్ధరాత్రి దాటాక

కునుకుపట్టని కళ్ళు నేరేడు పళ్ళవుతాయి

నరాలు కాలుతున్న కరెంటు తీగలౌతాయి

గుడ్లగూబ గొంతు విని

చంద్రుడు మబ్బు దుప్పటి కప్పుకుంటాడు

నేను మాత్రం

జ్ఞాపకాల లోయల్ని తొవ్వుకుంటూ

ఏ మూడో ఝామునో

స్వప్నంతో నిద్రను వెలిగించుకుంటాను.



తెల్లారి చూస్తే

జ్ఞాపకాలు జాడను కోల్పోయినట్టే అనిపిస్తుంది

అద్దానికి ముఖాన్ని చూపగానే

చెక్కిలి మీద చారికై నిలిచిన జ్ఞాపకం

మళ్ళీ ఆలోచనల్నిరేపి

నన్నొక కన్నీటి శిబిరాన్ని చేస్తుంది.


(విజేత దినపత్రిక, 18.03.2001)

Read more...

13, ఆగస్టు 2009, గురువారం

బాధోపనిషత్

దేవుడా!

వేదాలను నేనే కనుగొన్నాను

స్వరాలను నేనే సృష్టించాను

యాగానికి నేనే ఆయువు పోశాను

హోమ జ్వాలలో నేనే హవిస్సునయ్యాను

నిన్ను దేవుడ్ని చేశాను, నేను దరిద్రాన్ని మోశాను



ప్రభూ!

అభిషేకాలతో నిన్ను శుభ్రపరిచాను

అర్చనలతో నిన్ను అలంకరించాను

నైవేద్యాలతో నిన్ను తృప్తిపరిచాను

కల్యాణ వేడుకలతో ఊరేగించాను

నువ్వు మోసం చేశావు, శోకం మిగిల్చావు



భగవాన్!

అష్టోత్తరాల్ని నేనే సమకూర్చాను

సహస్రనామల్ని నేనే మాలగా గుచ్చాను

షోడషోపచారాల్ని నేనే సిద్ధం చేశాను

అట్టహాసంగా పట్టాభిషేకం జరిపించాను

నిన్ను హృదయపీఠం పై నిల్చాను, నువ్వు గుండెల మీద తన్నావు



స్వామీ!

నిన్ను స్మరిస్తూనే బాధల్ని మోశాను

నిన్ను ధానిస్తూనే కష్టాల్ని గడిపేశాను

ఏ మబ్బురధంలో దాగున్నావు ప్రభూ!

ఇప్పటికీ నేను నిరీక్షించే చకోరపక్షినే

నువ్వు వానచినుకెప్పుడౌతావో మరి



(12.1.2002, ఉదయం 9:40)

Read more...

10, ఆగస్టు 2009, సోమవారం

మరణాన్ని ప్రశ్నించే వీరుడికి

ఇక్కడెవ్వరూ క్షేమంగా లేరు

గోముఖ వ్యాఘ్రాల దాడిలో

జీవితం కన్నీటి సముద్రమైంది

నల్దిక్కులా

ఆవులించే మృత్యుముఖాలు

కన్రెప్పల మధ్య

చూపుల్ని గాయపరిచే సంక్షోభం

గొంతు నులిమే చీకట్లో

ఊపిరాడని ఉద్విగ్నస్థితి

వీధి మలుపు నెత్తురు చారల్లో

పాడెల్ని మోసుకెళ్ళిన పాద ముద్రలు...

వ్రణాన్ని చీల్చే సజీవ దహన వీచికలు



ఇప్పుడది రత్నగర్భ కానే కాదు

శవాల్ని కడుపులో దాచుకున్న స్మశానం!



అడవులంతా భాష్పవాయువు వ్యాపిస్తోంది

ఇక్కడో కన్నపేగు మెలికలు తిరుగుతోంది...!

చిరునామ దొరకని ఎముకల గుట్టల్ని చూసి

ఆగిపోయిన గుండె కదలికలు...


నువ్వొచ్చే దారిలో ఎన్‌కౌంటర్లు పొంచి వుంటాయి!

కత్తుల బోనులుంటాయ్!

కాటికి మోసే చేతులుంతయ్!

జాగ్రత్త సుమీ!

నీ పిడికిట్లోని వసంతాన్ని మాత్రం జారవిడవకు.

Read more...

6, ఆగస్టు 2009, గురువారం

నీటి పడగ

ఉన్నట్టుండి

ఆకాశం మేఘావృత ముఖాన్ని చూసుకోడానికి

భూమిని జల దర్పణంగా మారుస్తుంది

పడగెత్తి నీటిసర్పం నాల్క మీద

ప్రాణాలు పిప్పరుమెంటు బిళ్ళలౌతాయి

కాయ కష్టం కంకులౌతున్న ఉదయాన

పంట ముఖంపై నీటి ముసుగు కప్పే ఉప్పెన

మెతుకుల స్వప్నానికి గుండె కోత విధిస్తుంది

ఎత్తుల్ని కొలిచే అంతస్థులు సైతం

వరద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాయి

ప్రవాహోధృతికి నడుములు విరుచుకున్న వంతెనలు

నీళ్ళలో నానబెట్టిన గుగ్గిళ్ళౌతాయి

తీరం తాకని పడవలు ముక్కలై

చచ్చిన సొరచేపల్లా నీటిపై తేలుతుంటాయి

పక్షులు వలయాలుగా కలియ తిరుగుతూ

జల ఖడ్గపు ఝుళిపింపుకు రెక్కలు తెగి కూలిపోతాయి

వరద వేటుకు విరిగిన తరు సమూహం

చివరిసారి మొదళ్ళకు సాష్టాంగ పడుతుంది

వడుపు తెలిసిన మలుపుల రాణి సుడుల కౌగిలిలో

ఉక్కిరి బిక్కిరిగా నలిగిన రాచవీధులు

లోతు తెలియని కాల్వలౌతాయి

ప్రతీరోజూ ప్రదక్షిణ మంత్రాన్ని ధ్వనించే బస్సులు

డిపోల గూళ్ళలో ముడుచుకున్న చలి రాత్రుల పావురాళ్ళౌతాయి

వాన దేవుడి అజీర్తి రోగానికి భూదేవికి పొట్టుబ్బుతుంది

***


ఈ నీటి పడగ చితికి పోనూ...

ఎండిన గొంతును కబళించే నాల్గు చినుకులతో తడపాల్సింది పోయి

ఆయువును కబళించే జలగండంగా మారింది

వేనవేల కళేబరాల్ని మురికి పొట్టలో కుక్కుకొని

పరిసరాల్ని గుప్పుమనే శవాల వాసన చేసింది

ఇప్పుడు - వానంటే వొట్టి నీటి ప్రవాహమే కాదు

గొంతు బిగించి నిలువునా ఊపిరి తెంపే నీటి మోకు

శరీరాలను నిశబ్ద తీరాలకు తరలించే శవ పేటిక


***


ఎప్పుడూ ఇంతే

మళ్ళీ ఆకాశమ్మీద నిప్పుల కుంపటి మొదలవ్వగానే

వరద నీళ్ళు పారిపోతాయి

కన్నీళ్ళు, కొన వూపిరి శబ్దాలు మాత్రం మిగిలిపోతాయి


(2000 ఆగష్టు రాష్ట్రంలో వచ్చిన వరదలకు స్పందించి)

ఆదివారం ఆంధ్రజ్యోతి
10.09.2000

Read more...

3, ఆగస్టు 2009, సోమవారం

ఏదీ నిజంకానప్పుడు

మీరు అలాగే నవ్వుకోండి

గుక్కతిప్పుకోకుండా ఏడుపు నలాగే కొనసాగించండి

ఏదీ నిజం కానప్పుడు

నవ్వినా ఏడ్చినా ఒకటే కదా!

బ్రతికున్నతనానికి గుర్తుగా

మీరలాగే నిరర్థక సంభాషణ చెయ్యండి

మాట్లాడాల్సిందాన్ని మాట్లాడలేనప్పుడు

నీతైనా, బూతైనా ఒకటే కదా!


***


నిలువునా విలువలు కూలుతున్నా సరే

గజ్జి కుక్కలాంటి వ్యవస్థకు సిగ్గుండదు

ప్రార్థనా మందిరాల ముందు మతంపై కాలు దువ్వి

వివాదాల్ని గొంతెత్తి పిలుస్తున్న మారణాయుధాల్ని

ఏ చట్టమూ నిషేదించదు

పగ తీర్చుకున్న కర్కశత్వం నవ్వుతూనే వుంటుంది

గోడ మీద నినాదాలు రాసి

అజ్ఞాతంలోకి పరుగెత్తే ఉడుకు రక్తాన్ని నమ్ముకుని

రాని వెన్నెల కోసం

పల్లె అమాయకత్వం రెప్ప వాల్చని కన్నౌతుంది

నిండుగా ఖద్దరు కప్పుకున్న రౌడీయిజం

దొంగ గొంతుకతో అభివృద్ధిని వల్లించినందుకు

గొర్రెలు మూకుమ్మడిగా తలలూపుతాయి

నడివీధిలో జరిగిన దారుణ హత్య

ఆత్మహత్యగా రుజువైనందుకు

కోర్టంతా చప్పట్ల హోరుతో మార్మోగుతుంది

ప్రభుత్వ మొక గుడ్డెద్దు

వీరుడి నిజాయితీ అవినీతిగా నిరూపించి, ఊపిరొదిలాక

అమర వీరుడి బహుమతి ప్రకటిస్తుంది



***

జరగరానిది జరుగుతోందని అందరికీ తెల్సు

అబద్ధం నిజమౌతోందని, నిజం అబద్ధమౌతోందనీ తేలుసు

ఐనా నిజంగా మారిన అబద్ధాన్నే గొంతులన్నీ సమర్షిస్తాయి

రాని నవ్వును, లేని ఏడుపును నటిస్తూ

మసి గుడ్డతో ముఖం తుడుచుకోవటం అలవాటైంది



***



నిజాన్ని నిజంగా చెప్పుకోవడంలో తప్పు లేదు

ఈ సమాజం ఒక పిచ్చాసుపత్రి



ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక 26.04.1997

Read more...

30, జులై 2009, గురువారం

గాయపడ్డ గుండెకేక

బతకాలి కదా!

కరువు కుండకు పడ్డ చిల్లికి

ఒక్క ముద్దైనా అడ్డుపెట్టాలి కదా

బతకడం చావుగా మారినప్పుడు

ఈ యజ్ఞోపవీతం, రెండో జన్మా

శిశిరాన్ని మూటగట్టే శాపాలే మరి


తెల్లారగట్ల గుడిమైకులో

గొంతు చిరిగిన మేల్కొల్పులమైనా

మా బతుకుకు సుప్రభాతముండదు

సాయం సంధ్యల్లో దీపాలమై వెలిగినా

ఏ దేవుళ్ళకూ మాపై దయచూపే తీరికుండదు

మా విజ్ఞపన పత్రాలు అందుకోగానే

నాయకుల కళ్ళు చూపుల్ని కోల్పోతాయి

మా బాధోపనిషత్తు వినాలంటే చాలు

చట్టం చెవిలో కర్ణభేరి మాయమౌతుంది



ఇన్నాళ్ళూ

మా నెత్తిన శఠకోపురం పెట్టి

దేవాలయ మాన్యాలను ధర్మకర్తలు భోంచేస్తుంటే

పెచ్చులూడిన ధ్వజస్థంభాల మౌనమయ్యాం

మా ఫాలభాగంపై పంగనామం పెట్టి

కానుకలు కాజేస్తున్న కార్యనిర్వాహకుల ముందు

నిర్లిప్తాన్ని ప్రదర్శించే ఉత్సవ విగ్రహాలమయ్యాం

అమ్మవారి నగలు అదృశ్యమైన రాత్రి

మీ అనుమానం చండ్రకోలై మా వీపుల్ని చీరితే

అవమానం శూలానికి గుచ్చబడ్డ మాడవ్య మునులమయ్యాం

రంగనాయకస్వామి రక్షకుడైన నేలపై

మా ఆడోళ్ళమానం మంట గలసినప్పుడు

ఊరు ఖాళీ చేసిన కన్నీటి నిర్వాసితులమయ్యాం



ఇవాళ

మేం అవమానాలకు చిరునామగాళ్ళం

ఆర్థికంగా చితికి ఆకలితో అణిగిపోతున్న వాళ్ళం

వృత్తికీ, ఉద్యోగాలకీ రెంటికీ చెడ్డ రేవళ్ళం

దర్శనమౌతున్నా నిదర్శనం ముఖ్యమనుకుంటే

కులాలవారీగా ఆకలి పోటీలు పెట్టి

గెలిచిన వాళ్ళకే రిజర్వేషన్ బహుమతి ప్రకటించండి


అయ్యా! నాయకుల్లారా!

మేమిప్పుడు అగ్రహారాలను అడగటం లేదు

దేవాలయ మాన్యాలను మళ్ళీ తెచ్చిమ్మనటం లేదు

కంకణాలడగటం లేదు. గండపెండేరాలడగటం లేదు

మా వెనుకబాటుతనం ముఖమ్మీద కూడా

ఒక్క రిజర్వేషన్ ముద్ర కొట్టించమంటున్నాం


అందాక

మేం అభిషేకాలమై స్రవించిపోతాం

కర్పూరహారతులమై మండిపోతాం

పొట్ట నింపని పౌరోహిత్యాలమై కాలిపోతాం, కాని

మేం గుండెమండిన పరుశురాములం కాకముందే

మా బిడ్డల చీకటి భవిష్యత్తులోనైనా

ఒక్క వెలుగు శాసనం లిఖించిపోండి!?


(ప్రకృతి సాహితి, సెప్టెంబరు 2001)

Read more...

27, జులై 2009, సోమవారం

ఒక దుఃఖావరణ గురించి

ఎవరి దుఃఖమైనా సరే

దుఃఖమన్నాక హృదయం కన్నీరుగానే కరుగుతుంది

దుఃఖానికి తడిలేకుండ చెయ్యడం

ఏ మంత్రశక్తికీ సాధ్యపడని అసాధ్యమేనేమో!



ఏ దుఃఖం వెనుక ఏ గాయముందో

గాయానికి ముందు ఏ దుఃఖం సిద్ధపడి వుందో!

భౌతికంగా గాయపడటమే దుఃఖమైతే

అది అప్రయత్నం కవచ్చు, అనివార్యమూ కావచ్చు

తల్లడిల్లే మానసిక గాయానికి మాత్రం

పుండులా సలిపే జ్ఞాపకమే హేతువు

జ్ఞాపకం గాయమౌతుంది

గాయాల జ్ఞాపకం దుఃఖమౌతుంది

కన్రెప్పల కట్టల మధ్య సుడులు తిరుగుతూ

నదిలా ఎగసిపడే దుఃఖం

రహస్యంగా మనసు దరిని కోసేస్తుంది

కోసెయ్యడం కొసకు చేరగానే

అదాటున బతుకుదారం తెంచుకొని

ఆత్మను గాలిపటంలా ఎగరేసుకొంటూ

దుఃఖంతోనే పైకెళ్ళిపోతాం మనం

శూన్యమూ ఒక దుఃఖావరణమే

ఎన్ని దుఃఖాలు కలిస్తే ఈ శూన్యం ఏర్పడిందో!



వాడెవడో

ఆకర్షణ శక్తి భూమికే వుందన్నాడు కానీ

ఆకాశానికీ అయస్కాంత శక్తి వుంది

లేకుంటే, యిన్ని ప్రాణాల్ని ఎట్లా లాగేసుకుంటుందీ!

Read more...

23, జులై 2009, గురువారం

అవశేషాలన్నీ మ్యూజియం చేరవు

శరీరంలోంచి ఒక్కక బొట్టు రాలి

గది నిండిపోతుంది

తలుపు తెరచి ఎవరూ లోనికి రారు

గది బయట గాలి గడ్డకడుతుంది

తీరంతో కరచాలనం చేయకముందే

నీటి మధ్యలో నావ మునుగుతుంది

తెరచాపలు ఆదుకోవు

చుక్కాని చూపులేని గుడ్డిదవుతుంది

చుక్కలు చుక్కలుగా జారుతూ

ఆకాశం జాలిగా ఏడుస్తుంది

వెలుగుతున్న విషాదం మధ్య

గాయాలు నడుస్తూనే వుంటాయి

నిశబ్దాన్ని వెంటపెట్టుకొని

దిగంబరంగా వెనకాలే నడిచొస్తుంటాయి

గాయానికి ప్రవహించడం తెలుసు

గడ్డకట్టిన దేహంపై ఘనీభవించడమూ తెలుసు

గాయానికి పరిమితి లేదు

ఒక్కోసారి మనసు మీద మానని పుండవుతుంది

ఆలోచనలేవీ బరువు దించవు

శరీరాన్ని మడత పెట్టి

గాయాన్ని గాయపరచటమే పరిష్కారం

నిజానికి ఏ పరిష్కారమూ ముగింపు కాదు

ముగిసిందల్లా పరిష్కారమూ కాదు

అట్నుంచి ఇటు - ఇట్నుంచి అటు

కాలమొక్కటే వంతెన

ఈ వంతెన అంచుల పైన

ఎన్ని ఆత్మలు అదృశ్యమయ్యాయో

ఎన్ని అడుగులు పాదముద్రల్ని చెరుపుకున్నాయో

చరిత్ర పూడికను తీయలేదు

చీకటి దస్తావేజు మీది

అవశేషాలన్నీ మ్యూజియం చేరవు

నడిచే అడుగుల వెనుక

ఒక నీడ వెంటాడుతూనే వుంటుంది


జీవితం ఒక లాంతరు

తన కింద దాగిన రహస్యాన్ని

ఎన్నడూ ప్రమాదంగా పసిగట్టలేదు


ఆదివారం విజేత
01.04.2001

Read more...

20, జులై 2009, సోమవారం

గాయాల జ్ఞాపకం

మనసు పొరల్లోంచి

జ్ఞాపకాలన్నీ

దట్టంగా మొలుచుకొస్తాయి


జ్ఞాపకాల్నీ

తిరగేసినప్పుడు

గాయాలు బయటపడతాయి


గాయాలతో మాట్లాడినప్పుడల్లా

అనుభవాలు గుర్తుకొస్తాయి


***


గుర్తు అంటేనే... జ్ఞాపకం

జ్ఞాపకం అంటేనే గాయం

ఇప్పుడు

జ్ఞాపకాలు నన్ను చదువుకుంటూ

నేను గాయాల్ని తడుముకుంటూ

Read more...

16, జులై 2009, గురువారం

నేనూ దళితుణ్ణే...!

చావని అహంకారంతో

తెల్లపంచా శిల్కులాల్చీ తొడుకున్నానే కాని

నిజానికి నాదీ ఆకలి అగ్నికీలల్లో దహించుకుపోతూ

మృత్యుకోరలకి చిక్కిన ఖాళీకడుపే...!

అగ్రకులం నాదన్నది, కడుపు నిండిన వాణ్నన్నది

ఆ మునుపు కాలం నాటి మాట

నిజమే!

గంటకొక యజ్ఞం జరిగిన రోజుల్లో

నిన్ను పంచముడని పరిహసించి, పంచలోకి రానివ్వనిదీ,

నిన్ను ఊరికి, వాడకి, పల్లెకి కాకుండా

యేటిలోకి తొక్కేసిందీ

అంతా నిజమే !



***


అరుంధతి

నా ఇంటి కోడలైన రోజే వరసలు కలుపుకన్నవాళ్ళం

నీ కుల కవి పాదానికి

మా తాత గండపెండేరం తొడిగినరోజునే

బంధుత్వాన్ని పెంచుకున్నవాళ్ళం

నీతో కల్సి నడవాలని నే తొందర పడ్తుంటే

నా మీద ఇంకా ఆరని ద్వేషమెందుకు...?

నిష్టూర మనిపించినా నిజం చెప్పక తప్పట్లేదు

గాయత్రి సాక్షిగా నాదీ చినిగిన బతుకే

కడుపు నిండని వాడెవడైనా దళితుడే...!



***



గుండె పట్టని బాధ నాకూ ఉంది!

కడుపు నిండని శ్రాద్దాలు పెట్టుకుంటూ

మంత్రాన్ని నమ్ముకున్న వారసత్వం నాది.

స్టేషన్‌లో రైలాగ్గానే

"అపరకర్మలు చేయిస్తారా బాబుగారూ" అంటూ

ప్రయాణికుల్ని చుట్టుకుని

ఎన్ని అవహేళనల్ని బాధతో భరించానో

నా జీవితాన్ని కాటేసిన తెల్లతాచుకు తెలుసు...

చిరిగిన పంచె, మాసిన తువ్వాలు ఉతుక్కోడానికి

మారుపంచలేని

కులాగ్రపేదరికం నాది!

ఈ శ్రాద్దాల రేవులో

ఎన్ని ఉదయాలు కన్నీటిచుక్కలై ఇంకిపోయాయో...!



***



నేను చదువును నిర్లక్ష్యం చేసిన రోజు

"మాదిగోడిలా నువ్వూ చెప్పులు కుట్టుకు బ్రతకాల్సొస్తుంద"ని

నన్ను తిట్టడానికి

తాతయ్య నీ కులాన్ని అడ్డుపెట్టుకున్నప్పుడు

గుండె పగిలి ఎన్ని చెరువులై చెక్కిళ్ళమీదికి జరిందో..

నిన్ను బయట నిలబెట్టి

నువ్వు కుట్టిన తోలుచెప్పుల ముఖాన పసుపునీళ్ళు చల్లి

ఇంట్లోకి తీసుకెళ్ళినప్పుడే నాకర్థమైంది

పశువుకంటే మనిషే ఇంకా వెంకబడి ఉన్నాడని..!

బాల్యాన్ని వెంటేసుకుని బడికెళ్ళినరోజు

మనిద్దర్నీ వేరువేరు బెంచీలమీద ఎందుక్కూర్చోబెట్టారో

నన్ను ప్రేమగా ముద్దుపెట్టుకున్న మాష్టారు

నిన్నెందుకు చీదరించి దూరంగా పొమ్మన్నాడో -

ఇద్దరమూ పాఠము ఒప్పగించకున్నా

"గొడ్డుమాంసం తినేవాడివి నీకు చదువెందుకురా" అంటూ

నిన్ను మాత్రమే పలకతో కొట్టి

ఎందుకు తల బొప్పికట్టించాడో

నాకప్పుడర్ధంకాలేదు

నీ చేతికి అందే అదృష్టం పుస్తకానికి వుండుంటే

బహుశా నువ్వే నాకంటే బాగా చదివుకునుందేవాడివి.

నీతో కలిసి ఆడుకోవాలని ఆరాటపడ్డవాణ్ని

సగం కూలిన మీ గుడిసెలో కూర్చుని

నీ కంచంలో అంబలి పంచుకోవాల్నై ఉబలాటపడ్డవాణ్ని

వయసు పెరిగేకొద్దీ

నాకూ నీకు మధ్య పెరుగుతున్న ఎడబాటు తెల్సింది...!



***



నన్ను అస్పృశ్యుడ్ని చేసిన

ఈ శాస్త్ర గ్రంధాలూ, వేదపఠనాలూ

ఇవేవి అక్కర్లేదు నాకు

మనిషిగా బతకడానికి కాసింత మనిషితనం కావాలి

నిజనికి ఇప్పుడూ నేనూ -

నాలాంటి ప్రతి ఆకలి జీవీ దళితుడే...!

Read more...

13, జులై 2009, సోమవారం

ఒక ఒయాసిస్సు కోసం

నేను పుట్టింది మొదలు

ఈ దుఃఖం అజ్ఞాత శత్రువై వెంటాడుతూనే ఉంది!

ఆశల్ని మీటుకుంటూ

వెన్నెల వసంతాన్ని స్వప్నించి, స్వప్నించీ

నిరాశల ఊపిరి సెగల మధ్య

దగ్ధానుభూతికి లోనౌతాను !


***



అమ్మ ఒడిలో

వెండిగిన్నె పాలబువ్వ గోరుముద్దలకు, ప్రేమ ముద్దులకూ,

నాన్న వీపు నెక్కి

'చెల్ చెల్ గుర్రం - చెలాకి గుర్రం' ఆటల సరదాలకూ

కుప్పతొట్టి సాక్షిగా పెట్టి పుట్టని జీవితం నాది..!

మీ లాగా

నా బాల్యం బంగారు మొలతాడు కాదు

ముఫ్పై వసంతాలు విరబూసినా

మూడుముళ్ళకు నోచుకోని అక్కబోసి మెడను

ఉరితాడు కౌగలించుకున్న కన్నీటి దృశ్యం నా బాల్యం...!

మీరనుకున్నట్టి నా యౌవ్వనం

ఇందిరాపార్కు గుబురు పొదలమధ్య

వెచ్చని కౌగిళ్ళపరువపు గుబాళింపు కాదు

పగబట్టిన ఎన్‌కౌంటర్ నీడలో

గురి తప్పని తూటాకు బలైన తమ్ముడి శవాన్ని

కాటికి చేర్చేందుకు దారిచూపిన నిప్పుకుండ నా యవ్వనం



***



రెప్ప విప్పింది మొదలు

కంటి గూట్లోంచి ఎన్ని కన్నీటి పిట్టల్ని జారవిడిచానో


చిట్లిన జ్ఞాపకాల గాజు ముక్కలకు తెలుసు..!

ఈ ఎండిన గుండెను

ఏ మేఘ శకలమూ చినుకు వేళ్ళతో స్పృశించదు...

ఎడారి అనుభవాల మధ్య

ప్రశ్నార్థకమైన శేష జీవితాన్ని భుజాలకెత్తుకుని

ఇసుక గుండెలోని తడిని పరితపిస్తూ

నా దేహాన్నంతా చూపుగా మార్చుకున్నాను!

కాలిపోతున్న రాత్రింబవళ్ళ మధ్య

శూన్యాన్ని శోదిస్తున్న ఓ ఖర్జూర వృక్షమా ! ఇక్కడెక్కడా

పక్షుల జాడ కంపించదేం...!!

Read more...

9, జులై 2009, గురువారం

మౌనప్రవాహం

రంపం పొట్టులా

క్షణాలు రాలిపోయే వేళ...

నేను

నిశ్శబ్దంగా విస్తరించుకుంటాను

జ్ఞాపకాలు కెరటాలై

ఒడ్డును ఢీకొన్నప్పుడల్లా

హృదయం చెదిరిపోతూనే ఉంటుంది

రెప్పల మధ్య

ఆశల్ని దాచాలనే ప్రయత్నం

ఎప్పుడూ

నీటి మీద గీసిన గీతే!

అవునూ...?

ఆకురాలిన చెట్టును అసహ్యించుకుంటూ

పక్షులు వలస వెళ్ళిపోతున్నాయేంటి?

ఎండిపోతున్న చెరువుకు భయపడి

చేపలు బిత్తరపోతున్నాయేంటి ?

వసంతమూ -

వర్షమూ -

ఎటు తప్పిపోయాయి !

ఇక్కడ స్వప్నలన్నీ

ఏ మౌన ప్రవాహంలో పడి

కొట్టుకుపోయాయి...?!

Read more...

6, జులై 2009, సోమవారం

మనసుకందని సంభాషణ

ఎన్నాళ్ళనుంచో

ఎదురైనప్పుడల్లా సంభాషించుకొంటూనే వున్నాం

మాటలు మాటలుగా విరిగిపోతూనే వున్నాం

తడిలేని మాటలు కదా

మాటలన్నీ ఎండుటాకుల్లా రాలిపోతాయి

హృదయాన్ని తాకకుండానే పారిపోతాయి

ఎంత మాట్లాడినా ఏం ప్రయోజనం?

భావనికి తగ్గట్టు మాటలు కలవడం లేదు

పదాలు ముక్కలు ముక్కలుగ చెదిరి

క్వారీ ధ్వనుల సంకేతాలౌతున్నాయి

మనసుకందని సంభాషణంతా

వొఠ్ఠి మాటల గారడీలా వుంది

మానవత్వము, మంచితనమూ మినహా

మిగిలినవన్నీ మాటలై దొర్లుతున్నాయి

ఈ అర్థరహిత శబ్దాలకు అనువాదకులుంటే బాగుండు

చుట్టుముట్టిన పెడార్థాల మధ్య

ప్రతిరోజూ ఆత్మహత్యకు గురౌతున్నాను



ఇక

మాటలకు తెరదించడమే సమంజసం

సంభాషణ సంశయాన్ని మిగిలిస్తూ

సవాలక్ష సందేహాలకు కారణమౌతున్నప్పుడు

మనం మాట్లాడుకోకుండా వుండటమే మంచిది

రేపటి బోసి నవ్వుల లేత పెదాలపై

పరిశుద్ధ పదాలు పుష్పించడానికి

ఒక దీర్ఘకాల నిశ్శబ్దం పాటించడం మంచిది



నిశ్శబ్దం స్తబ్దత కాదు

శబ్ద జాగారానికి సరికొత్త కొనసాగింపు

శిశిరంలో మాటలు రాల్చుకున్న చెట్టు

లేద పదాల చిరుగు తొడిగేది

మౌనం తర్వాతే కదా!


(ఆదివారం ప్రజాశక్తి, 08.04.2001)

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP